గేట్ 2027 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఉపాధి, ఉన్నత విద్యకు మార్గం సుగమం చేసే 'గేట్ 2027' పరీక్ష తేదీలను ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఆగస్టు 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, కొత్తగా 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' సబ్జెక్టును అందుబాటులోకి తెచ్చారు.

Published on: Jul 20, 2026, 14:51:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు అత్యంత కీలకమైన 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్' (GATE 2027) పరీక్షల షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 21 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ రోజు రెండు సెషన్ల (ఉదయం, మధ్యాహ్నం) చొప్పున దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఈ పరీక్షలు జరుగుతాయి.

గేట్ 2027 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు ప్రారంభం
గేట్ 2027 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఆగస్టు 14 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు

గేట్ 2027 రాయాలనుకునే అభ్యర్థులు 2026 ఆగస్టు 14 నుంచి అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సెప్టెంబర్ 21 తుది గడువుగా నిర్ణయించారు.

ఈసారి మొత్తం 30 సబ్జెక్టుల్లో (Test Papers) గేట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా రెండు సబ్జెక్టుల వరకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. పరీక్షలు కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటాయి.

రోబోటిక్స్ సబ్జెక్ట్ చేరిక.. సిలబస్‌లో మార్పులు

సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐఐటీ మద్రాస్ ఈసారి గేట్ సబ్జెక్టుల్లో కీలక మార్పులు చేసింది.

కొత్త సబ్జెక్ట్: 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' (RA) పేపర్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు.

పేపర్ మార్పు: ఇప్పటివరకు ప్రత్యేక పేపర్‌గా ఉన్న 'టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్' (TF)ను ఇంజినీరింగ్ సైన్స్ (XE) కింద ఒక సెక్షనల్ పేపర్‌గా మార్చారు.

దరఖాస్తు సమయంలో ఇవి గుర్తుంచుకోండి

అభ్యర్థులు ఒకే ఒక్క దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. రెండు పేపర్లు రాయాలనుకునే వారు తమ మొదటి అప్లికేషన్‌లోనే రెండవ పేపర్‌ను జోడించాలి. ఒకరికంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే, అందులో ఒకదానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని మిగిలిన వాటిని తిరస్కరిస్తారు. అలా రద్దయిన అప్లికేషన్ల ఫీజును తిరిగించేల్లించరు.

గేట్ స్కోర్‌తో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు

గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా కేంద్ర విద్యాశాఖ (MoE), ఇతర ప్రభుత్వ సంస్థల పరిధిలోని ఐఐటీలు, నిట్‌లలో మాస్టర్స్, డైరెక్ట్ డాక్టోరల్, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. అర్హత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

అంతేకాకుండా, మహారత్న, నవరత్న వంటి ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) గేట్ స్కోర్ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్ సంస్థలు సైతం రిక్రూట్‌మెంట్‌లో గేట్ మార్కులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

  1. ఐఐటీ గేట్ అధికారిక వెబ్‌సైట్ gate2027.iitm.ac.in సందర్శించండి.
  2. హోమ్‌పేజీలో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి.
  3. వివరాల నమోదు పూర్తయ్యాక లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్ నింపండి.
  4. నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
  5. దరఖాస్తు సమర్పించిన తర్వాత, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
  6. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ప్రింటవుట్ ప్రతిని భద్రపరుచుకోండి.
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More