GATE 2027 Registration : 'గేట్' అభ్యర్థులకు బిగ్ అప్డేట్- రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ..
ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు పీఎస్‌యూ ఉద్యోగాలకు మార్గం సుగమం చేసే 'గేట్ 2027' ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, కావాల్సిన పత్రాల జాబితాను ఇక్కడ తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్! గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2027) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక), పీహెచ్‌డీ కోర్సుల్లో చేరాలనుకునే ఇంజనీరింగ్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఏటా లక్షలాది మంది బీ.టెక్, బీ.ఈ పూర్తి చేసిన అభ్యర్థులు గేట్ పరీక్షపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ పరీక్ష ద్వారా కేవలం ఉన్నత విద్య మాత్రమే కాకుండా బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఈసీఐఎల్, ఓఎన్‌జీసీ వంటి మహారత్న, నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధించే అవకాశం లభిస్తుంది.
గేట్ 2027 దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది?
అభ్యర్థులు 'గోప్స్' (GOAPS) పోర్టల్ అయిన gate2027.iitm.ac.in ద్వారా తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు పత్రాల్లో ఉన్న వివరాలకు, అప్లికేషన్‌లో నమోదు చేసే సమాచారానికి ఎలాంటి తేడాలు ఉండకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.
గేట్ 2027 ముఖ్యమైన తేదీలు..
గేట్ 2027 రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ- ఆగస్టు 27
అప్లికేషన్‌కి చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా)- సెప్టెంబర్ 27
లేట్ ఫీజుతో అప్లికేషన్‌కి చివరి తేదీ- అక్టోబర్ 5
అప్లికేషన్ కరెక్షన్ విండో- అక్టోబర్ 14 నుంచి 21
గేట్ 2027 పరీక్షల తేదీలు- ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21
గేట్ 2027 దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు..
గేట్ 2027 అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించే సమయంలో కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్)
పాస్‌పోర్ట్ సైజు ఫొటో (సెంటిమీటర్లు, పిక్సెల్ పరిమాణం నిబంధనల ప్రకారం)
అభ్యర్థి డిజిటల్ సంతకం
డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా చివరి సంవత్సరం మార్కుల మెమో
కుల ధృవీకరణ పత్రం (వర్తించే అభ్యర్థులకు)
నివాస స్థానికత పత్రం
దివ్యాంగులైన అభ్యర్థులకు పీడబ్ల్యూడీ ధృవీకరణ పత్రం
గేట్ 2027 దరఖాస్తు ఫీజు వివరాలు..
గేట్ 2027 కోసం మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులు ప్రతి పేపర్‌కు రూ. 1,000 ఫీజు చెల్లించాలి. ఇతర కేటగిరీల అభ్యర్థులకు ప్రతి పేపర్‌కు రూ. 2,000 ఫీజుగా నిర్ణయించారు. ఒకవేళ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకుంటే ప్రతి పేపర్‌కు అదనంగా రూ. 500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
గేట్ 2027 స్కోర్ ప్రాముఖ్యత..
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు నెలకు రూ. 12,400 వరకు స్టైపెండ్ లభించే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్‌తో పాటు సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, హ్యూమానిటీస్ విభాగాల విద్యార్థులు కూడా తమ సబ్జెక్టులలో గేట్ పరీక్ష రాసేందుకు అర్హులు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


