Gate 2027 : గేట్ అభ్యర్థులకు అలర్ట్! రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌లో కీలక మార్పులు- ఇవి తెలుసుకోండి..
Gate 2027 registration : గేట్ 2027 రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్ సవరించింది. ఆగస్టు 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు, అర్హత వివరాలు వంటివి ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి.
గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2027 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అప్డేట్! గేట్ 2027 రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌లో ఐఐటీ మద్రాస్ కీలక మార్పులు చేసింది. తొలుత ఆగస్ట్ 14న రిజిస్ట్రేషన్ ప్రారంభమవ్వాల్సి ఉండగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం.. గేట్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 27, 2026న మొదలవుతుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఒకవేళ ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి అక్టోబర్ 5, 2026 వరకు అవకాశం ఉంటుంది.

విద్యా మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తున్న విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గేట్ స్కోర్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే, పలు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) ఉద్యోగ నియామకాల కోసం గేట్ స్కోర్ ప్రామాణికం అని అధికారిక ప్రకటన స్పష్టం చేసింది.
గేట్ 2027 పరీక్ష తేదీలు..
ఐఐటీ మద్రాస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీలలో పరీక్షలు జరుగుతాయి:
మొదటి వారం: ఫిబ్రవరి 6 - 7, 2027
రెండవ వారం: ఫిబ్రవరి 13 - 14, 2027
మూడవ వారం: ఫిబ్రవరి 20 - 21, 2027
ఈ ఆరు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టులలో ఈ పరీక్ష నిర్వహించనుండగా, అభ్యర్థులు ఒకటి లేదా గరిష్టంగా రెండు సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు ఉంది.
అధికారిక క్యాలెండర్ ప్రకారం జనవరి 4, 2027న పరీక్ష కేంద్రాల కేటాయింపు వివరాలను సంస్థ విడుదల చేయనుంది.
గేట్ 2027- ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు?
ప్రస్తుతం ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో మూడో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న విద్యార్థులు గేట్ 2027 పరీక్షకు అర్హులు. అలాగే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్ విభాగాలలో ప్రభుత్వ గుర్తింపు పొందిన డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐటీ మద్రాసు విడుదల చేసిన గేట్ 2027 నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
గేట్ 2027- ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు ఉన్నవారికి సూచనలు..
ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి ప్రొఫెషనల్ సొసైటీల నుంచి సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ పరీక్షలు బీఈ, బీటెక్, బీఆర్కిటెక్ట్ కోర్సులకు సమానమైనవిగా MoE, AICTE, UGC లేదా UPSC చేత ఆమోదించినవి అని అభ్యర్థులు నిర్ధారించుకోవాలని అధికారిక నోటిఫికేషన్ తెలిపింది.
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. మార్చి 19, 2027న గేట్ 2027 ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
గేట్ 2027- సిలబస్‌లోనూ మార్పులు..
గతంలో విడుదల చేసిన ప్రకారం.. గేట్ సిలబస్ సైతం మారింది. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన 'రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్' పేపర్‌ను రెండు భాగాలుగా విభజించారు — పార్ట్ ఏ, పార్ట్ బీ. పార్ట్ ఏలో అందరికీ కామన్ సెక్షన్ ఉంటుంది. పార్ట్ బీలో రెండు విభాగాలుగా ఉంటుంది — ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్. అభ్యర్థులు తమ ప్రాధాన్యతను బట్టి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక చేయండి.
మరిన్ని వివరాల కోసం ఐఐటీ మద్రాసు లేదా గేట్ 2027 అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


