Assam rape case : 15ఏళ్ల బాలికపై అత్యాచారం! ప్రైవేట్ భాగాల్లో రాడ్ జొప్పించి..

అసోంలోని హైలాకండి జిల్లాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేసి, అత్యంత పాశవికంగా హత్య చేశారు! ముఖాన్ని దారుణంగా చితకబాది, ప్రైవేట్ భాగాల్లో రాడ్ చొప్పించి చంపేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర అగ్గిరాజ రాజేసింది.

Published on: Aug 3, 2026, 13:05:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అసోంలో మానవజాతి సిగ్గుపడే విధంగా, అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు మృగాలు అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై కిరాతకంగా హత్య చేశారు! కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి కనీసం గుర్తుపట్టలేని స్థితిలో ఆ బాలిక మృతదేహం పడి ఉందని తెలుస్తోంది. ఈ ఘాతకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహజ్వాలలను రేకెత్తించింది.

అసోంలో కలకలం రేపుతున్న 15ఏళ్ల బాలిక హత్య కేసు.. (Representative Image (Sakib Ali/HT))
అసోంలో కలకలం రేపుతున్న 15ఏళ్ల బాలిక హత్య కేసు.. (Representative Image (Sakib Ali/HT))

అసలేం జరిగింది?

హైలాకండి జిల్లాలోని కాట్లీచెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని అలోయ్‌చోరా ప్రాంతంలో శనివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సమీపంలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. బాలిక కూడా వారితో పాటు వెళ్లినప్పటికీ, బావ వరుసయ్యే వ్యక్తితో చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చేసింది.

విందు ముగించుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, గదిలో నేలపై రక్తమడుగులో బాలిక మృతదేహం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు బాలిక తల, ముఖాన్ని దారుణంగా చితకబాదడమే కాకుండా, ప్రైవేట్ భాగాల్లో రాడ్ జొప్పించి అత్యంత పాశవికంగా హింసించి చంపేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ దెబ్బలకు బాలిక ముఖం దారుణంగా నలిగిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

6వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత.. స్థానికుల ధర్నా

15ఏళ్ల బాలిక హత్య వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలంటూ నేషనల్ హైవే-6ని నిర్బంధించి భారీ ధర్నా చేపట్టారు. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో అనుమానితులైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమితాబ్ సిన్హా ధృవీకరించారు.

"బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ విషయమై ఒక స్పష్టతకు రాగలము. ఈ కేసును అన్ని కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నాము," అని అమితాబ్ సిన్హా అన్నారు.

హత్యకు ముందు లైంగిక దాడి జరిగిందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు, అత్యాచారం అంశంపై వైద్యపరంగా స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More