మరింత పతనమైన బంగారం, వెండి.. 7 నెలల కనిష్ఠానికి సిల్వర్

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ విపణిలో పసిడి, వెండి ధరలు దారుణంగా పడిపోయాయి. ఎంసీఎక్స్‌లో కేజీ వెండి ఏకంగా రూ.8,593 పతనమై 7 నెలల కనిష్ఠానికి చేరగా, బంగారం ధర కూడా 2 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆ వివరాలు మీకోసం.

Published on: Oct 22, 2026, 20:47:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండగల సీజన్ వేళ పసిడి, వెండి కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది. గురువారం (అక్టోబర్ 22) నాటి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు మరింత పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వేదికగా డిసెంబర్ కాంట్రాక్ట్ వెండి ధర ఒక్కరోజే కిలోకు రూ.8,593 క్షీణించి రూ.2,00,575 స్థాయికి పడిపోయింది. గత ఏడు నెలల్లో వెండికి ఇదే అతి తక్కువ ధర కావడం గమనార్హం.

మరింత పతనమైన బంగారం, వెండి.. 7 నెలల కనిష్ఠానికి సిల్వర్
మరింత పతనమైన బంగారం, వెండి.. 7 నెలల కనిష్ఠానికి సిల్వర్

మరోవైపు పసిడి ప్రాభవం కూడా మసకబారింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.2,300 మేర తగ్గి రూ.1,43,600 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల కనిష్ఠ స్థాయి. కాగా, ఈ అక్టోబర్ నెలలోనే బంగారం ధర 3.3 శాతం, వెండి ధర దాదాపు 10 శాతం మేర పడిపోవడం విశేషం.

చమురు మంట.. వడ్డీ రేట్ల అంచనాలు

మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో చమురు సరఫరాకు ఏర్పడిన విఘాతాలు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పెంచేశాయి. సౌదీ అరేబియాలోని చమురు మౌలిక వసతులపై జరిగిన వరుస దాడులతో క్రూడాయిల్ సఫరాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 112.38 డాలర్లకు చేరింది. గత ఐదు నెలల్లో చమురు ధరకు ఇదే గరిష్ఠ స్థాయి.

మరోవైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై సైనిక చర్య తీవ్రతరం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెలువడుతున్న నివేదికలు క్రూడాయిల్ మార్కెట్‌లో కలకలం రేపాయి. పెరిగిన ఇంధన ధరల వల్ల ద్రవ్యోల్బణం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, దాంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

డిసెంబర్‌లో 'ఫెడ్' వడ్డీ రేట్ల పెంపు ఖాయమేనా?

అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన తదుపరి సమావేశంలో (అక్టోబర్ 27-28) వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, డిసెంబర్ నాటికి మరోసారి వడ్డీ రేట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం ఫెడ్ నిర్దేశించుకున్న 2 శాతం కంటే గణనీయంగా ఎక్కువగా ఉండటం, పైగా చమురు ధరల మంట తోడవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కఠిన ద్రవ్య విధానం (Monetary Policy) తప్పదని మార్కెట్ భావిస్తోంది.

సిఎమ్‌ఈ (CME) ఫెడ్‌వాచ్ టూల్ సమాచారం ప్రకారం, డిసెంబర్ సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం 86 శాతంగా ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరున (అక్టోబర్ 29న) వెలువడనున్న యూఎస్ వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) గణాంకాలు వడ్డీ రేట్ల భవిష్యత్తు దిశను నిర్దేశించనున్నాయి.

సాధారణంగా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే లేదా యుఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడితే, ముదుపరులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల నుంచి నిధులను ఉపసంహరించి డాలర్ వైపు మళ్లిస్తారు. ఇది పసిడి, వెండి ధరలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More