Gold Price Today : బంగారం, వెండి ధరలు డౌన్- ఇక్కడి నుంచి పెరుగుతాయా? పడతాయా?
Gold rate today 7 July : మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బంగారం, వెండి ధరలు పడ్డాయి. ఎంసీఎక్స్ గోల్డ్, ఎంసీఎక్స్ సిల్వర్ రేట్లను, నిపుణుల ప్రకారం కీలక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవల్స్‌ని ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
జులై 7, మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు పడ్డాయి. ఎంసీఎక్స్ (మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్) గోల్డ్ ఆగస్ట్ కాంట్రాక్ట్స్ 0.52శాతం పతనమై రూ. 1,46,148 (10గ్రాములు) వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 1.14శాతం మేర పడి కేజీకి రూ. 2,33,416 వద్ద కొనసాగుతున్నాయి.

జూన్ నెలలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశానికి సంబంధించిన “మినిట్స్” జులై 8న వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం బంగారం, వెండి ధరలు డౌన్ అవుతున్నాయి.
అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల భారీగా పెరిగిన ముడి చమురు ధరలు, తద్వారా వచ్చిన ద్రవ్యోల్బణ సమస్యల కారణంగా ఈ ఏడాది 3 రేట్ హైక్స్ ఉంటాయని మార్కెట్ భావించింది. కానీ భౌగోళిక అనిశ్చితులు తగ్గడం, ముడి చమురు ధరలు పడటం, అమెరికాలో జూన్‌కి సంబంధించిన ఉద్యోగాల డేటా అనుకున్న దాని కన్నా తక్కువగా రావడంతో వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ ఆచితూచి వ్యవహరిస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి.
“త్వరలో రాబోతున్న ఫెడ్ మినిట్స్ కోసం మార్కెట్ ఎదురుచూస్తోంది. దాని ఔట్‌పుట్‌తోనే బంగారం ధరల కదలికలపై క్లారిటీ వస్తుంది,” అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ రవి సింగ్ తెలిపారు.
గోల్డ్, సీల్వర్ కీ లెవల్స్..
ప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక సమీకరణాలు, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు ఇన్వెస్టర్లకు హాట్ టాపిక్‌గా మారాయి. ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ట్రేడింగ్ సరళిని గమనిస్తే, సాంకేతికంగా మార్కెట్ బలంగానే కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, కీలకమైన మద్దతు శ్రేణిని కాపాడుకుంటూ ముందుకు సాగుతుండటం ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తోంది.
మార్కెట్ నిపుణుడు రవి సింగ్ విశ్లేషణ ప్రకారం.. పసిడి ధరలకు రూ. 1,40,500 వద్ద అత్యంత కీలకమైన సపోర్ట్ జోన్ ఉంది. మార్కెట్ ఈ స్థాయి కంటే పైనే స్థిరంగా కొనసాగుతుండటం సానుకూల పరిణామం. రాబోయే సెషన్లలో ఎగువ వైపు చూస్తే, 21-డే ఈఎంఏ ప్రకారం రూ. 1,48,000 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఎదురుకానుంది. ఒకవేళ మార్కెట్ ఈ మార్కును దాటి బ్రేక్‌అవుట్ సాధిస్తే, పసిడి ధరల్లో రికవరీ మరింత వేగవంతం కావచ్చు. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు ఏకంగా రూ. 1,50,000 నుంచి రూ. 1,51,000 స్థాయిని కూడా తాకవచ్చు.
పృథ్వీఫిన్‌మార్ట్ కమొడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ నేటి ట్రేడింగ్ సెషన్ కోసం అంతర్జాతీయ (కోమెక్స్), దేశీయ (ఎంసీఎక్స్) మార్కెట్ల కీలక స్థాయిలను క్రింది విధంగా వివరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక ట్రాయ్ ఔన్స్‌కు 4,135 డాలర్లు, 4,100 డాలర్ల వద్ద సపోర్ట్ కలిగి ఉండగా, ఎగువన 4,194 డాలర్లు, 4,220 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ని ఎదుర్కొంటోంది. అలాగే అంతర్జాతీయ వెండి ధరలకు 61.20 డాలర్లు, 59.80 డాలర్ల వద్ద సపోర్ట్, ఎగువన 63.40- 64.20 డాలర్ల వద్ద రెసిస్టెన్స్ ఉన్నాయి.
దేశీయ మార్కెట్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే, జైన్ అంచనాల ప్రకారం ఈ స్థాయిలను గమనించాలి:
ఎంసీఎక్స్ గోల్డ్ : దిగువన రూ. 1,46,100, రూ. 1,45,500 వద్ద సపోర్ట్ ఉంది. ఒకవేళ ధరలు పెరిగితే ఎగువన రూ. 1,47,400, రూ. 1,48,200 వద్ద నిరోధం ఎదురవుతుంది.
ఎంసీఎక్స్ సిల్వర్: కిలో వెండికి దిగువన రూ. 2,33,300, రూ. 2,30,000 వద్ద సపోర్ట్ లభిస్తుండగా, ఎగువన రూ. 2,38,800, రూ. 2,41,000 వద్ద గట్టి రెసిస్టెన్స్ ఉంది.
మరోవైపు ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంసీఎక్స్ గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్ ధర స్వల్పంగా క్షీణించి ప్రతి 10 గ్రాములకు రూ. 1,46,300 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో ఎగువన రూ. 1,47,300 మార్కు పసిడికి కీలకమైన రెసిస్టెన్స్ స్థాయిగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఆధారంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను గమనిస్తూ అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఇలా..
మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడ్డాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల (10గ్రాములు) బంగారం ధర రూ. 1,33,150గా ఉంది. 24 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ ప్రైజ్ రూ. 1,45,260గా ఉంది. కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 2,45,000 వద్ద కొనసాగుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


