బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

బడ్జెట్ 2026 సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు (ETFs) భారీగా పతనమయ్యాయి. వెండి ఈటీఎఫ్‌లు ఏకంగా 20% నష్టపోవడంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ కారణాల వల్లే ఈ పతనం సంభవించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Published on: Feb 1, 2026, 10:13:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 1) భారత స్టాక్, కమొడిటీ మార్కెట్లు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కోసం తెరుచుకున్నాయి. అయితే, ఇన్వెస్టర్లకు ఈ సెషన్ తీరని చేదు అనుభవాన్ని మిగిల్చింది. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం, వెండి ధరల్లో పెను కుదుపు చోటుచేసుకుంది. కేవలం భౌతిక లోహాల ధరలే కాకుండా, వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా కుప్పకూలాయి.

బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?
బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

MCXలో భారీగా పడిపోయిన ధరలు

మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆదివారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బంగారం ధర 9% మేర క్షీణించి 10 గ్రాములకు రూ. 1,36,185 వద్దకు చేరింది. అదేవిధంగా, వెండి ధర కూడా 9% పతనమై రూ. 2,65,652 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పుంజుకోవడం, సిఎమ్ఈ (CME) గ్రూప్ బంగారం, వెండి ఫ్యూచర్స్‌పై మార్జిన్లను పెంచడం ఈ పతనానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.

కుప్పకూలిన ఈటీఎఫ్‌లు (ETFs)

ధరల పతనం తాలూకు ప్రభావం ఈటీఎఫ్‌లపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లకు భారీ షాక్ ఇచ్చాయి:

  1. వెండి ఈటీఎఫ్‌లు: ఎస్‌బీఐ సిల్వర్ ఈటీఎఫ్ 20.50%, ఐసీఐసీఐ ప్రు సిల్వర్ ఈటీఎఫ్ 20.14%, యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్ 20.16% మేర నష్టపోయాయి.
  2. బంగారం ఈటీఎఫ్‌లు: నిప్పాన్ ఇండియా గోల్డ్ బీఈఎస్ (BeES) 11%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ 13%, జెరోధా గోల్డ్ ఈటీఎఫ్ 10.9%, ఏంజెల్ వన్ గోల్డ్ ఈటీఎఫ్ 12% మేర క్షీణించాయి.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

నిపుణుల సలహా ఈ అకస్మాత్తు పతనంతో భయపడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

“ప్రస్తుతం వెండి, బంగారంలో కనిపిస్తున్న అస్థిరత కేవలం ‘లీవరేజ్ అన్-వైండింగ్’, మార్జిన్ సంబంధిత లిక్విడేషన్ల వల్ల కలిగింది. లోహాల దీర్ఘకాలిక విలువలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఆందోళనతో పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దు. ఇలాంటి సమయాల్లోనే ఇన్వెస్టర్లు మరింత క్రమశిక్షణతో వ్యవహరించాలి” అని ఇన్వెస్ట్ పిఎమ్ఎస్ (INVasset PMS) బిజినెస్ హెడ్ హర్షల్ దసాని వివరించారు.

కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా, విడతల వారీగా (Staggered way) పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని ఆయన సూచించారు. బంగారం ఎప్పుడూ పోర్ట్‌ఫోలియోను స్థిరీకరిస్తుందని, వెండిలో మాత్రం రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More