పసిడి, వెండి ధరల్లో ఒడుదొడుకులు: యూఎస్ ఫెడ్ నిర్ణయంపైనే చూపులు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు కమొడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరిమిత శ్రేణిలో కొనసాగుతున్నాయి. డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో పసిడిపై ఒత్తిడి నెలకొంది.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఒడుదొడుకుల మధ్య స్థిరంగా కొనసాగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరిస్తున్నారు.

మంగళవారం రాత్రి 9:10 గంటల సమయంలో ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం పెరిగి 10 గ్రాములకు ₹1,51,450 వద్ద ట్రేడైంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.09 శాతం క్షీణించి కిలో రూ.2,32,480 వద్ద నమోదైంది.
డాలర్, బాండ్ ఈల్డ్స్ ధాటికి బ్రేక్
అమెరికా డాలర్ ఇండెక్స్ 0.20 శాతం మేర లాభపడింది. మరోవైపు 10 ఏళ్ల అమెరికా బాండ్ ఈల్డ్స్ 5 శాతం మార్కును దాటాయి. అక్టోబర్ 2023 తర్వాత బాండ్ ఈల్డ్స్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ఆకర్షణ కొంతమేర తగ్గింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బలపడటమే డాలర్, బాండ్ ఈల్డ్స్ రికవరీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడ్ రెండు రోజుల సమావేశం అనంతరం భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు తన మోనెటరీ పాలసీ నిర్ణయాన్ని వెల్లడించనుంది.
వడ్డీ రేట్ల పెంపు అంచనాలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతం నుంచి 4.00 శాతానికి చేర్చే అవకాశం ఉందని అత్యధిక మంది నిపుణులు భావిస్తున్నారు. ఫెడ్ ప్రామాణికంగా తీసుకునే వ్యక్తిగత వినియోగ వ్యయాల (పీసీఈ) ద్రవ్యోల్బణ సూచీ వరుసగా 65 నెలలుగా లక్ష్యిత 2 శాతం కంటే పైనే నమోదు కావడం దీనికి బలాన్నిస్తోంది. ఆగస్టు నెలకు సంబంధించిన పీసీఈ గణాంకాలు సెప్టెంబర్ 30న విడుదల కానున్నాయి.
దీనికితోడు ఆగస్టు నెల అమెరికా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 3.4 శాతం, నెలవారీ ప్రాతిపదికన 0.3 శాతం పెరిగింది. ఈ సమాచారం కూడా వడ్డీ రేట్ల పెంపు అవకాశాలను స్పష్టం చేస్తోంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల పట్టిక (సెప్టెంబర్ 15)
| నగరం | 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) | వెండి 999 ఫైన్ (1 కేజీ) |
|---|---|---|---|
| న్యూఢిల్లీ | ₹1,51,380 | ₹1,38,765 | ₹2,31,220 |
| ముంబై | ₹1,51,621 | ₹1,39,003 | ₹2,31,610 |
| బెంగళూరు | ₹1,51,760 | ₹1,39,113 | ₹2,31,800 |
| కోల్‌కతా | ₹1,51,440 | ₹1,38,820 | ₹2,31,310 |
| హైదరాబాద్ | ₹1,51,740 | ₹1,39,095 | ₹2,31,730 |
| చెన్నై | ₹1,51,940 | ₹1,39,278 | ₹2,32,040 |
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


