వడ్డీ రేట్లలో పారదర్శకత.. రుణగ్రహీతలకు ఆర్‌బీఐ తీపి కబురు

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ వడ్డీ రేట్లు, స్ప్రెడ్‌లు, ఏపీఆర్ (APR) పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. 2027 ఏప్రిల్ 1 నాటికి అమల్లోకి రానున్న ఈ ఏకీకృత నిబంధనలతో రుణాల మధ్య పోలికలు సులువుకావడమే కాకుండా, చిన్న రుణాలపై వడ్డీ వేధింపులకు చెక్ పడనుంది.

Published on: Aug 27, 2026, 15:09:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రుణాలు తీసుకునే సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీపి కబురు అందించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) విధించే వడ్డీ రేట్లు, స్ప్రెడ్‌లు (Spreads), వార్షిక వడ్డీ శాతాల (APR)పై పారదర్శకత తీసుకొచ్చేందుకు నూతన మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. 2027 ఏప్రిల్ 1 నాటికి ఈ ఏకీకృత నిబంధనావళిని అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

వడ్డీ రేట్లలో పారదర్శకత.. రుణగ్రహీతలకు ఆర్‌బీఐ తీపి కబురు
వడ్డీ రేట్లలో పారదర్శకత.. రుణగ్రహీతలకు ఆర్‌బీఐ తీపి కబురు

అసలు మార్పు ఏమిటి?

ప్రస్తుతం వేర్వేరు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ సొంత నిబంధనల ఆధారంగా వడ్డీ స్ప్రెడ్‌ను ఖరారు చేస్తున్నాయి. దీనివల్ల ఒక బ్యాంకు రుణానికి, మరో ఎన్‌బీఎఫ్‌సీ రుణానికి మధ్య ఉన్న తేడాలను, అసలు వడ్డీ వ్యయాన్ని సరిగ్గా పోల్చి చూడటం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. హోమ్ లోన్లు, ఎంఎస్ఎంఈ రుణాలు వంటి ఫ్లోటింగ్ రేట్ రుణాల కోసం బ్యాంకులు రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లులను బెంచ్‌మార్క్‌గా వాడుతున్నాయి. అయితే, ఎన్‌బీఎఫ్‌సీలు విభిన్న విధానాలు పాటించడం వల్ల రేట్లలో తీవ్ర వ్యత్యాసాలు వస్తున్నాయి.

ఈ వ్యత్యాసాలను తొలగించి, వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు బదిలీ చేయడమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యం.

మూడేళ్లపాటు మారని స్ప్రెడ్ నిబంధనలు

నూతన ప్రతిపాదనల ప్రకారం ఫ్లోటింగ్ లోన్ రేటులో బెంచ్‌మార్క్ రేటు, స్ప్రెడ్ అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ స్ప్రెడ్‌లో క్రెడిట్ రిస్క్ ప్రీమియం, ఆపరేటింగ్ ఖర్చులు, ఇతర వ్యాపార అంశాలు ఉంటాయి. ఇకపై 'క్రెడిట్ రిస్క్ పరిధిలోకి రాని ఇతర ఖర్చుల స్ప్రెడ్‌ను మూడేళ్ల పాటు మార్చడానికి వీల్లేదు' అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

కేవలం అప్పు తీసుకున్న వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్‌లో స్పష్టమైన మార్పు వస్తే తప్ప క్రెడిట్ రిస్క్ ప్రీమియం పెంచకూడదు. అలాగే, మార్కెట్‌లో బెంచ్‌మార్క్ రేట్లు మారినప్పుడు, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు త్వరగా అందించేందుకు గరిష్టంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫ్లోటింగ్ రేట్లను రీసెట్ చేయాల్సి ఉంటుంది. అయితే చిన్న గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులు, బేస్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలకు ఈ పునఃసమీక్ష నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.

"వ్యాపార వ్యయం, ఆపరేటింగ్ కాస్ట్, క్రెడిట్ రిస్క్ ప్రీమియం వంటి అంశాలను విడివిడిగా చూపించడం వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల రుణ వడ్డీ రేట్లను సరిపోల్చి చూడటం తొలిసారిగా సులువవుతుంది" అని ఫిన్‌బాక్స్ సీఈఓ, కో-ఫౌండర్ రజత్ దేశ్‌పాండే పేర్కొన్నారు.

"నూతన నిబంధనల ప్రకారం బ్యాంకుల వడ్డీ రేట్లు వారి అసలు నిధుల సేకరణ వ్యయానికి అనుగుణంగా ఉండాలి. గత మూడు నెలల సగటు ఫండ్స్ వ్యయాన్ని బట్టి వినియోగదారునికి రేట్లను వర్తింపజేయాల్సి ఉంటుంది" అని కొటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్స్ బిజినెస్ హెడ్ నకుల్ సక్సేనా అభిప్రాయపడ్డారు.

చిన్న రుణాలకు ఏపీఆర్ పరిమితి

వడ్డీ భారం మోయలేని స్థాయికి చేరకుండా ఉండేందుకు, 50,000 లోపు ఉండే చిన్న తరహా వ్యక్తిగత రుణాలపై ఏపీఆర్ (Annual Percentage Rate) పరిమితిని బోర్డు ఆమోదంతో విధించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. అసలు వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలన్నింటినీ కలిపి ఏపీఆర్‌గా పరిగణిస్తారు.

ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇకపై పారదర్శకంగా ఏపీఆర్ నిబంధనలు పాటించాల్సి రావడం వల్ల, డిజిటల్ ఫిన్‌టెక్ యాప్‌ల చిన్న రుణాలను, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్‌తో పోల్చి ఏది సరసమైనదో ఎంచుకునే వెసులుబాటు రుణగ్రహీతలకు దక్కుతుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More