నాలుగు రాష్టాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం!

తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల్లో రూ.24,200 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణలోని NH-63, NH-563 విస్తరణకు రూ.7,597 కోట్లు కేటాయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Updated on: Jun 03, 2026 5:50 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణతో పాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్.. ఒడిశా, తెలంగాణ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.24,200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నాలుగు ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ మొత్తం నిధుల్లో తెలంగాణ రాష్ట్ర రహదారుల విస్తరణకే ఏకంగా రూ.7,597.16 కోట్లను కేంద్రం కేటాయించడం విశేషం. పీఎం గతిశక్తి ఫ్రేమ్‌వర్క్ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.

తెలంగాణలో రహదారుల విస్తరణ

తెలంగాణలో రద్దీని తగ్గించేందుకు, జిల్లాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు NH-63, NH-563 జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించనున్నారు. నేషనల్ హైవే-63లోని ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల సెక్షన్, అలాగే నేషనల్ హైవే-563లోని జగిత్యాల - కరీంనగర్ సెక్షన్‌లను 4 లేన్లుగా మారుస్తారు. మొత్తం పొడవు 190.76 కిలోమీటర్లు ఉండగా.. అంచనా వ్యయం రూ. 7,597.16 కోట్లుగా ఉంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(HAM), బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతుల కలయికతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.

ప్రయాణ సమయం ఎంత తగ్గుతుందంటే?

ఈ హైవే విస్తరణ వల్ల నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల పరిధిలోని కీలక పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఆర్మూర్ నుండి మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 90 నిమిషాలు (గంటన్నర) తగ్గుతుంది. అలాగే, జగిత్యాల - కరీంనగర్ మధ్య ప్రయాణ సమయం 45 నిమిషాలు తగ్గిపోనుంది.

ఒడిశా

ఒడిశాలో రామేశ్వర్ నుండి పారాదీప్ వరకు 160.18 కిలోమీటర్ల పొడవైన సరికొత్త తీరప్రాంత రహదారి (Coastal Highway) నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖుర్దా, పూరి, కేంద్రపడ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టు వల్ల రామేశ్వర్ - పారాదీప్ మధ్య ప్రయాణ సమయం రెండున్నర గంటలు తగ్గుతుంది.

మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని బేతుల్, ఖాండ్వా, ఖర్గోన్, బర్వానీ జిల్లాల గుండా వెళ్లే NH-347B రహదారిలోని పలు సెక్షన్లను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఖర్గోన్ జిల్లాలో 16.2 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ బైపాస్ రోడ్డును కూడా నిర్మిస్తారు.

బిహార్

బిహార్‌లో ఖగారియా - పూర్ణియా సెక్షన్ పరిధిలోని 143.53 కిలోమీటర్ల రహదారిని 4 లేన్లుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టులో పూర్ణియా నగరం చుట్టూ 6.73 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ బైపాస్ నిర్మాణం కూడా భాగమై ఉంది. దీనివల్ల ఖగారియా, భాగల్పూర్, కతిహార్, పూర్ణియా జిల్లాల మధ్య రవాణా సులువవుతుంది.

పీఎం గతిశక్తితో పారిశ్రామిక రంగానికి ఊతం

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నాలుగు భారీ ప్రాజెక్టులు పీఎం గతిశక్తి లక్ష్యాలకు అనుగుణంగా సాగుతాయి. ఇవి దేశంలో సరుకు రవాణాను వేగవంతం చేయడమే కాకుండా, వాహనాల నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు, దేశ లాజిస్టిక్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని కేంద్రం స్పష్టం చేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More