నెలంతా కష్టపడి పనిచేసిన తర్వాత అక్టోబర్ నెల శాలరీ స్లిప్ చూడగానే దేశంలోని చాలా మంది ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు! కంపెనీ ఇచ్చిన సీటీసీలో ఎలాంటి మార్పూ లేకపోయినా, చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ తగ్గడం సోషల్ మీడియా వేదికలైన లింక్డిన్, రెడ్డిట్‌లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు జీతం ఎందుకు తగ్గింది? కొత్త రూల్స్ ఏమొచ్చాయి? పీఎఫ్ ఖాతాలో ఏం జరుగుతోంది? అని వేలాది మంది ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

మీ అక్టోబర్ జీతం తగ్గడం వెనుక ఎలాంటి కంపెనీ కోతలు లేవని, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం వల్ల జరిగిన మార్పు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
12 ఏళ్ల తర్వాత మారిన 'పీఎఫ్' వేతన పరిమితి..
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుంచి ఏకంగా రూ. 25,000కి పెంపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. గతంలో 2014 సెప్టెంబర్‌లో రూ. 15,000గా నిర్ణయించిన ఈ పరిమితిని, సుదీర్ఘమైన 12 ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వం సవరించడం గమనార్హం.
ఈ వేతన పరిమితి పెరగడం వల్ల ప్రతినెలా మీ జీతం నుంచి పీఎఫ్ ఖాతాకు వెళ్లే కోత (డిడక్షన్) పెరిగింది. దీనివల్ల నెలవారీగా చేతికి వచ్చే జీతం తగ్గింది. కానీ మీ భవిష్యత్తు పొదుపు (పీఎఫ్ కార్పస్) ఖాతాలో జమ అయ్యే మొత్తం గణనీయంగా పెరుగుతుంది.
మీ జీతంపై ఈ మార్పు ప్రభావం ఎంత?
ఈ కొత్త పరిమితి వల్ల ప్రతి ఉద్యోగి జీతంపై ఒకే రకమైన ప్రభావం ఉండదు. మీ శాలరీ స్ట్రక్చర్ ఆధారంగా ఈ కింది విధంగా వ్యత్యాసాలు ఉంటాయి:
గతంలో రూ. 15,000 పరిమితిపై పీఎఫ్ కట్ అవుతున్న వారికి:
{{/usCountry}}గతంలో రూ. 15,000 పరిమితిపై పీఎఫ్ కట్ అవుతున్న వారికి:
{{/usCountry}}గతంలో పీఎఫ్ విరాళం ప్రతినెలా గరిష్టంగా రూ. 1,800 (15,000 లో 12%) మాత్రమే కట్ అయ్యేది. కానీ కొత్త పరిమితి (రూ. 25,000) వల్ల ఇప్పుడు అది రూ. 3,000కి పెరుగుతుంది. అంటే మీ టేక్-హోమ్ శాలరీ నుంచి ప్రతినెలా అదనంగా రూ. 1,200 పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది.
ఇంతకుముందు పీఎఫ్ పరిధిలోకి రాని వారికి (రూ. 15,000 - రూ. 25,000 జీతం ఉన్నవారు):
గతంలో పీఎఫ్ మినహాయింపు లేని వారికి ఇప్పుడు నిర్బంధంగా 12% పీఎఫ్ కట్ అవుతుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 20,000 ఉంటే, ప్రతినెలా రూ. 2,400 నేరుగా పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.
ఇప్పటికే రూ. 25,000 అంతకంటే ఎక్కువ బేసిక్ పేపై పీఎఫ్ చెల్లిస్తున్న వారికి:
వీరి జీతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. పాత పద్ధతిలోనే పీఎఫ్ కోత కొనసాగుతుంది.
అక్టోబర్ జీతంలోనే ఎక్కువ కోత ఎందుకు జరిగింది?
కొందరికి అక్టోబర్ నెలలో అనుకున్న దానికంటే ఎక్కువ జీతం తగ్గి ఉండవచ్చు. దానికి కారణం ‘అరియర్స్ అడ్జస్ట్‌మెంట్’. కొత్త నిబంధన సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి రావడం వల్ల, సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు ఉన్న 14 రోజుల అదనపు పీఎఫ్ మొత్తాన్ని కంపెనీలు అక్టోబర్ నెల జీతం నుంచే రికవరీ చేశాయి.
ఉద్యోగులకు ఊరట: ఈ 14 రోజుల అదనపు కోత కేవలం అక్టోబర్ నెల జీతానికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి నవంబర్ నెల జీతంలో అక్టోబర్ కంటే కాస్త ఎక్కువ టేక్-హోమ్ శాలరీ వచ్చే అవకాశముంది.
51 లక్షల మందికి సామాజిక భద్రత!
వేతన పరిమితిని పెంచడం వల్ల దేశవ్యాప్తంగా కొత్తగా 51 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ నిర్బంధ భద్రతా పరిధిలోకి వచ్చారు. ఈపీఎఫ్ఓ కేవలం ప్రావిడెంట్ ఫండ్ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకాలను కూడా నిర్వహిస్తోంది.
దీనివల్ల ఉద్యోగులకు లభించే పెన్షన్ సదుపాయం, అలాగే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే లభించే ఉచిత బీమా పరిమితి కూడా పెరుగుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.68 లక్షల కంపెనీల్లో దాదాపు 7.98 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ సేవలు పొందుతుండగా, 82 లక్షల మంది పెన్షన్ అందుకంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లోని ఐటీ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ పీఎఫ్ పెంపు దీర్ఘకాలంలో భారీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆర్థిక రంగా నిపుణులు భావిస్తున్నారు.