రైతులకు కేంద్రం తీపి కబురు: వరి మద్దతు ధర పెంపు.. పొద్దుతిరుగుడుపై కాసుల వర్షం
ఖరీఫ్ సీజన్ ముందు దేశవ్యాప్త రైతాంగానికి మోదీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు దిగువన పండించే రైతులకు ఈసారి భారీ లబ్ధి చేకూరనుంది.
ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు గానూ 14 రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైతులు తమ పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం పొందేలా ధరలను ఖరారు చేశారు.

వరి ధర ఎంత పెరిగింది?
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 72 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
- సాధారణ రకం వరి: క్వింటాల్‌కు రూ. 2,441 (గతంలో రూ. 2,369)
- ఏ-గ్రేడ్ రకం వరి: క్వింటాల్‌కు రూ. 2,461
పొద్దుతిరుగుడు, పత్తి రైతులకు బంపర్ ఆఫర్
ఈసారి మద్దతు ధరల పెంపులో పొద్దుతిరుగుడు (Sunflower) పంట రికార్డు సృష్టించింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 622 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పొద్దుతిరుగుడు ధర రూ. 8,343కు చేరింది.
పత్తి రైతులకు కూడా కేంద్రం పెద్ద పీట వేసింది. మధ్యస్థ పింజ పత్తిపై రూ. 557 పెంచి, ధరను రూ. 8,267గా నిర్ణయించింది. పొడుగు పింజ పత్తి ధర క్వింటాల్‌కు రూ. 8,667కు చేరింది. ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా నూనె గింజలు, పప్పు దిగుసల ధరలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
పప్పు ధాన్యాలు, ఇతర నూనె గింజలు:
పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కంది, మినుము ధరలను భారీగా సవరించింది.
- కంది (Tur): రూ. 450 పెంపు (కొత్త ధర: రూ. 8,450)
- మినుము (Urad): రూ. 400 పెంపు (కొత్త ధర: రూ. 8,200)
- పెసలు (Moong): రూ. 12 పెంపు (కొత్త ధర: రూ. 8,780)
- వేరుశనగ: రూ. 254 పెంపు (కొత్త ధర: రూ. 7,517)
- సోయాబీన్: రూ. 380 పెంపు (కొత్త ధర: రూ. 5,708)
ముతక ధాన్యాలు (Millets):
- జొన్న (హైబ్రిడ్): రూ. 4,023 (రూ. 324 పెంపు)
- సజ్జలు: రూ. 2,900 (రూ. 125 పెంపు)
- మొక్కజొన్న: రూ. 2,410 (రూ. 10 పెంపు)
- రాగులు: రూ. 5,205 (రూ. 319 పెంపు)
రైతు ఆదాయమే లక్ష్యం: అశ్విని వైష్ణవ్
కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. పెట్టుబడి వ్యయం కంటే కనీసం 50 శాతం లాభం ఉండేలా ఈ ధరలను నిర్ణయించాం. పెసలు పండించే రైతులకు అత్యధికంగా 61 శాతం మార్జిన్ లభిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 2.60 లక్షల కోట్ల భారం పడనుందని అంచనా.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. వరి క్వింటాల్ ధర ఎంత పెరిగింది?
వరి సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ. 72 పెరిగింది. దీనితో కొత్త మద్దతు ధర రూ. 2,441కి చేరింది.
2. ఏ పంటకు అత్యధికంగా మద్దతు ధర పెరిగింది?
పొద్దుతిరుగుడు (Sunflower) గింజలకు అత్యధికంగా రూ. 622 మద్దతు ధర పెరిగింది. దీని తర్వాత పత్తికి రూ. 557 పెరిగింది.
3. కంది, మినుము పప్పుల కొత్త ధరలు ఏమిటి?
కంది పప్పు (Tur) క్వింటాల్ ధర రూ. 8,450 కాగా, మినుము (Urad) ధర రూ. 8,200గా నిర్ణయించారు.
4. ఈ ధరలు ఏ సీజన్‌కు వర్తిస్తాయి?
ఈ కొత్త కనీసం మద్దతు ధరలు (MSP) 2026-27 ఖరీఫ్ (వర్షాకాలం) సీజన్‌కు వర్తిస్తాయి. జూన్ నుండి ప్రారంభమయ్యే సాగుకు ఇవి వర్తిస్తాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


