TG Cabinet Decisions : భూముల ధరల్లో మార్పు.. కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10 పాయింట్లు!
TG Cabinet Decisions : తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల అవకతవకలపై కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
తెలంగామ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలక విషయాలు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న 10 కీలక నిర్ణయాలు ఇవే..

1. విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్తు కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్తు ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2024 మార్చి 14వ తేదీన కమిషన్స్ ఆఫ్ ఇంక్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 2024 జులైలో ఆయన విచారణ నుంచి తప్పుకోవటంతో జస్టిస్ మదన్ బి. లోకూర్‌ను కమిషన్‌గా నియమించారు.
2024 అక్టోబర్లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం 2025 జనవరి 4వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. వాటన్నింటినీ కేబినెట్ చర్చించింది. ప్రధానంగా అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కేసులో ఉన్నాయి. అందుకే నిష్పాక్షిక దర్యాప్తు జరిపేందుకు సీబీఐ విచారణ అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
2. రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈనెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకి వస్తాయి.
వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించే పరిహారం రేట్లపై అసంతృప్తితో ఉన్నారు. ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందిస్తున్నారు. దీంతో పాటు వాస్తవంగా మార్కెట్ లో ఉన్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు భారీగా వ్యత్యాసమున్నాయి. అందుకు శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఈ ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల్లో ఉండే మార్కెట్ విలువల రివిజన్ కమిటీలు అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని విలువలను సవరిస్తుంది.
3. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా పది శాతం చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. వారికి ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90 శాతం 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
4. అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో పంటలు, పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం అందింది. వెంటనే ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు బాధ్యత తీసుకుని వివరాలు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
5. నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంవోయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ- రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ( NARMAC)కు సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ ఎన్డీడీబీ నిర్వహిస్తుంది.
6. తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ పద్ధతిన 18 చోట్ల ఈ సోలార్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.66.50 కోట్లతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అమలు చేసేందుకు ఆమోదం లభించింది.
7. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్( OTS) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 5864 కోట్ల బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
8. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందించనున్నారు.
9. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీ శాట్‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే గొడుగు కింద ఉంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
10. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


