...
...
Next Story

H-1B Visa : హెచ్​-1బీ వీసాదారులపై ట్రంప్ కోలుకోలేని దెబ్బ- 60రోజుల గ్రేస్​ పీరియడ్ రద్దు​పై ప్రకటన..

అమెరికాలో ఉద్యోగం పోతే వెంటనే దేశం వీడాల్సిందేనంటూ ట్రంప్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయానికి సిద్ధమైంది. హెచ్-1బీ వీసాదారులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే విధంగా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ కొత్త ప్రకటనను విడుదల చేసింది.

Published on: Sep 11, 2026, 06:26:10 IST
Advertisement

అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి స్థిరపడిన వేలాది కుటుంబాలకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. విదేశీ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయినా లేదా రాజీనామా చేసినా అమెరికాలోనే ఉండి మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్​ఎస్) ప్రతిపాదించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. (REUTERS)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. (REUTERS)

ఈ నిబంధన కనుక అమల్లోకి వస్తే, ఉద్యోగం పోయిన వెంటనే విదేశీ ఉద్యోగులు అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీనివల్ల హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయ టెక్కీల్లో తీవ్ర అభద్రతాభావం నెలకొంది.

ఉద్యోగం ఊడితే వెంటనే ప్యాకప్!

సాధారణంగా అమెరికాలో ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించినప్పుడు లేదా ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు మరొక కంపెనీలో ఉద్యోగం సాధించడానికి లేదా వేరే వీసా హోదాలోకి మారడానికి 60 రోజుల వ్యవధి లభించేది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం, ఉద్యోగం ముగిసిన మరుక్షణమే సదరు విదేశీయుడి చట్టబద్ధమైన వీసా హోదా రద్దవుతుంది.

ఈ నిర్ణయం అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలకు కూడా పెద్ద దెబ్బే. భారతీయ నైపుణ్యంపై ఎక్కువగా ఆధారపడే సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఇకపై అనుభవజ్ఞులైన ఉద్యోగులను వెంట వెంటనే భర్తీ చేసుకోవడం కష్టతరంగా మారుతుంది.

హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాదన ఇదీ..

ఈ నిబంధన వెనుక ఉన్న ఉద్దేశాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ సమర్థించుకుంది. "విదేశీయులకు ఇచ్చే వీసా హోదాకు, వారు పనిచేసే నిర్దిష్ట ఉద్యోగానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పునరుద్ధరించడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ప్రభుత్వానికి పరిపాలనా పరమైన భారం కూడా తగ్గుతుంది," అని డీహెచ్​ఎస్ గురువారం వెలువరించిన ప్రకటనలో స్పష్టం చేసింది.

2017 నుంచి ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ అమలులో ఉంది. హఠాత్తుగా ఉద్యోగం పోయినప్పుడు మరొక స్పాన్సర్‌ను వెతుక్కోవడానికి, ఒకవేళ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే ఇల్లు అమ్మకం, పిల్లల పాఠశాలల నుంచి టీసీలు తీసుకోవడం, వ్యక్తిగత విషయాలను చక్కబెట్టుకోవడానికి ఈ రెండు నెలల సమయం ఎంతో ఊరటగా ఉండేది. ఇప్పుడు ఆ సమయాన్ని పూర్తిగా రద్దు చేయడమంటే టెక్కీలను నడిరోడ్డుపై నిలబెట్టడమే అవుతుంది.

వరుస నిర్ణయాలతో విదేశీయులు ఉక్కిరిబిక్కిరి

2025 జనవరిలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ చట్టబద్ధ వలసలను అడ్డుకునేందుకు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల వీసా రుసుములను భారీగా పెంచారు. అంతేకాకుండా, కొత్త శిక్షణ కార్యక్రమాల పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్‌లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks