హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఎక్స్‌టెన్షన్‌పై అమెరికా షాక్.. అమలులోకి కొత్త ఫీజు

అమెరికాలో హెచ్-1బీ, ఎల్-1 వీసా ఎక్స్‌టెన్షన్ల కోసం చెల్లించాల్సిన ‘9-11 బయోమెట్రిక్ రుసుము’ నిబంధనలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సవరించింది. సెప్టెంబర్ 9, 2026 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రాగా, ఇది భారతీయ ఐటీ రంగానికి, టెక్కీల వీసా పొడిగింపు ప్రక్రియకు అదనపు భారంగా మారనుంది.

Published on: Sep 10, 2026, 17:49:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరో ఆర్థిక భారం పడింది. వీసా ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రవేశపెట్టిన కొత్త ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ రుసుము’ నిబంధన సెప్టెంబర్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. బాధ్యతాయుత భద్రతా ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఎక్స్‌టెన్షన్‌పై అమెరికా షాక్.. అమలులోకి కొత్త ఫీజు
హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఎక్స్‌టెన్షన్‌పై అమెరికా షాక్.. అమలులోకి కొత్త ఫీజు

ఏమిటీ కొత్త మార్పు? ఎవరిపై ప్రభావం?

గతంలో అమెరికాలో మొదటిసారి హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసా పొందేటప్పుడు లేదా ఉద్యోగ సంస్థ మారినప్పుడు (Change of employer) మాత్రమే కంపెనీలు ఈ బయోమెట్రిక్ రుసుమును చెల్లించేవి. అయితే సవరించిన నిబంధన ప్రకారం.. ఒకే కంపెనీలో కొనసాగుతూ వీసా కాలాన్ని పొడిగించుకునే (Extension of status) అభ్యర్థుల దరఖాస్తులకు కూడా కంపెనీలు ఈ రుసుమును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆగస్టు 10న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించిన ఉత్తర్వులు సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వచ్చాయి.

ఎంత రుసుము చెల్లించాలి?

కొత్త నిబంధన ద్వారా ఫీజు మొత్తాన్నేమీ పెంచలేదు, కానీ ఫీజు వసూలు చేసే పరిధిని పొడిగించారు.

  • హెచ్-1బీ వీసా ఎక్స్‌టెన్షన్: ఒక్కో దరఖాస్తుకు 4,000 డాలర్లు.
  • ఎల్-1 వీసా ఎక్స్‌టెన్షన్: ఒక్కో దరఖాస్తుకు 4,500 డాలర్లు.

ఈ ఫీజు అమెరికాలోని అన్ని కంపెనీలకూ వర్తించదు. అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది హెచ్-1బీ లేదా ఎల్-1 (ఎల్-1ఏ, ఎల్-1బీ) వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో భారతీయ టెక్కీలను నియమించుకునే ఐటీ, అవుట్‌సోర్సింగ్ కంపెనీలపై ఈ భారం పడనుంది. తక్కువ మంది విదేశీ ఉద్యోగులున్న చిన్న కంపెనీలకు దీని నుంచి మినహాయింపు లభిస్తుంది.

భారతీయ ఉద్యోగులపై పడే ప్రభావం ఎంత?

ఈ బయోమెట్రిక్ రుసుమును వీసా స్పాన్సర్ చేసే కంపెనీలే చెల్లించాలి. ఈ ఖర్చులను భర్తీ చేసుకోవడానికి హెచ్-1బీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకూడదని డీహెచ్ఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కంపెనీలకు వీసా పొడిగింపు వ్యయం గణనీయంగా పెరగనుండటంతో, ఎక్స్‌టెన్షన్లు ఇచ్చే సమయంలో కంపెనీలు మరింత కఠిన వైఖరి అవలంబించే అవకాశాలు ఉన్నాయి.

ఈ నిబంధన సెప్టెంబర్ 30, 2027 వరకు దాఖలయ్యే దరఖాస్తులకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అమెరికా సరిహద్దు భద్రత, బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ బలోపేతానికి ఈ నిధులను వినియోగిస్తారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More