H-1B visa : హెచ్-1బీ వీసా మోసాలపై అమెరికా సీరియస్! అక్కడ ఆకస్మిక తనిఖీలు..

H-1B visa updates : హెచ్-1బీ వీసా మోసాలను అరికట్టేందుకు అమెరికా కార్మిక శాఖ రంగంలోకి దిగింది. డల్లాస్‌లో దాడులు నిర్వహించి పలు నకిలీ ఆఫీసులను గుర్తించింది.

Published on: Aug 14, 2026, 10:45:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో హెచ్-1బీ వీసా మోసాలపై దర్యాప్తు ముమ్మరమైంది! ఇందులో భాగంగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నేరుగా రంగంలోకి దిగారు. వందలాది హెచ్-1బీ దరఖాస్తులు పొందిన డల్లాస్ ప్రాంతంలోని కంపెనీల కార్యాలయాలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

హెచ్-1బీ వీసా మోసాలపై అమెరికా సీరియస్! అక్కడ ఆకస్మిక తనిఖీలు.. (Unsplash)
హెచ్-1బీ వీసా మోసాలపై అమెరికా సీరియస్! అక్కడ ఆకస్మిక తనిఖీలు.. (Unsplash)

విదేశీ కార్మికుల వీసా ప్రోగ్రామ్‌లో జరుగుతున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ పీడ ఎస్పొసిటో స్వయంగా డల్లాస్‌లో పర్యటించినట్లు లేబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆగస్టు 13న వెల్లడించింది.

అనేక వ్యాపార సంస్థల పేరుతో రిజిస్టరై ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనంలో అధికారులు డోర్-టూ-డోర్ విచారణ జరిపారు. ఈ భవనం చిరునామాపై 500కి పైగా హెచ్-1బీ దరఖాస్తులు ఆమోదం పొందాయి. అయితే తనిఖీ చేసిన సమయంలో చాలా కార్యాలయాలు మూతపడి ఉన్నాయని, తలుపులకు తాళాలు వేసి ఉన్నాయని ఓఐజీ అధికారులు తెలిపారు. అక్కడ వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని పేర్కొన్నారు.

అయితే ఆ కంపెనీలన్నీ లేదా హెచ్-1బీ దరఖాస్తులన్నీ పూర్తిగా మోసపూరితమైనవని ఏజెన్సీ అనలేదు. విదేశీ కార్మిక వ్యవస్థలో జరుగుతున్న సంభావ్య దుర్వినియోగంపై సాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ ఫీల్డ్ చెక్స్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.

క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు..

డల్లాస్‌లో జరిగిన ఈ ఆపరేషన్ విదేశీ కార్మిక వీసా కార్యక్రమాలలో అక్రమాలను అరికట్టేందుకు లేబర్ డిపార్ట్‌మెంట్ చేస్తున్న పెద్ద ప్రయత్నంలో ఒక భాగమని చెప్పవచ్చు.

కేవలం పేపర్ వర్క్‌కే పరిమితం కాకుండా వలస వ్యవస్థ పవిత్రతను, అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే ఈ దర్యాప్తు ప్రధాన ఉద్దేశమని ఆంథోనీ పీడీ ఎస్పొసిటో స్పష్టం చేశారు.

"మా విదేశీ కార్మిక కార్యక్రమాలలో మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అనే స్పష్టమైన సందేశాన్ని మేము ఇస్తున్నాము," అని ఏజెన్సీ ప్రకటనలో డీ ఎస్పొసిటో పేర్కొన్నారు.

హాట్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, సమాచారం ఆధారంగానే దర్యాప్తు బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే డల్లాస్ తనిఖీలకు సంబంధించిన కంపెనీల పేర్లను, ఎంతమంది హెచ్-1బీ కార్మికులు ప్రభావితం కానున్నారు అనే వివరాలను ఓఐజీ ఇంకా బహిర్గతం చేయలేదు.

హెచ్-1బీ వీసా తనిఖీల అర్థం ఏంటి?

అమెరికా యజమానులు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ కార్మికులను నియమించుకోవడానికి హెచ్-1బీ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. అయితే కంపెనీలు వేతనాలు, పని పరిస్థితులకు సంబంధించి ఫెడరల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అలాగే తాము అందిస్తున్న ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏజెన్సీ దృష్టి అంతా విదేశీ కార్మిక వ్యవస్థలోని అక్రమాలపైనే ఉంది.

జులై ఆరంభం నుంచి నిఘా తీవ్రం..

జులై నెలలో లేబర్ డిపార్ట్‌మెంట్ ఓఐజీ ప్రకటించిన యాంటీ ఫ్రాండ్ ఇనీషియేటివ్‌కు కొనసాగింపుగానే డల్లాస్ ఆపరేషన్ జరిగింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్ టాస్క్ ఫోర్స్‌తో సమన్వయం చేసుకుంటూ ఈ చర్యలు చేపట్టినట్లు ఏజెన్సీ తెలిపింది. మోసాలను గుర్తించడం, అమెరికన్ కార్మికులను రక్షించడం కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఈ టాస్క్ ఫోర్స్ కోరింది.

ఈ తాజా పరిణామం ద్వారా దర్యాప్తు కేవలం అడ్మినిస్ట్రేటివ్ సమీక్షలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి పాకినట్లు స్పష్టమవుతోంది. కార్మిక శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా తమ హాట్‌లైన్ ద్వారా నివేదించాలని ఓఐజీ ప్రజలను కోరింది.

హెచ్-1బీ యజమానులకు, విదేశీ కార్మికులకు డల్లాస్ ఆపరేషన్ ఒక హెచ్చరిక లాంటిది. వ్యాపార సంస్థలు కాగితాలపై చూపించే వివరాలు, గ్రౌండ్ రియాలిటీలో భిన్నంగా ఉంటే ఇకపై ఫెడరల్ ఏజెన్సీల నిఘా మరింత కఠినంగా ఉంటుందని అనడంలో సందేహం లేదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More