Heatwave alert : అమ్మో ఎండలు! ఆ ప్రాంతాలకు ఐఎండీ హీట్​వేవ్​ అలర్ట్స్..

IMD Heatwave alert : దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతుండటంతో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు 'యెల్లో అలర్ట్' జారీ చేసింది. ఏప్రిల్ 19వ తేదీన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

Published on: Apr 19, 2026, 09:08:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మండుతున్న వేసవి సెగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ తాజా బులిటెన్ విడుదల చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు మధ్య, తూర్పు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఎండలకు మహారాష్ట్రలో ఓ మహిళ పరిస్థితి ఇలా..
ఎండలకు మహారాష్ట్రలో ఓ మహిళ పరిస్థితి ఇలా..

ఐఎండీ హీట్​వేవ్​ అలర్ట్- ఎక్కడెక్కడ ఎండల తీవ్రత?

వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 20 వరకు, రాజస్థాన్, ఒడిశాలో ఏప్రిల్ 22 వరకు వడగాల్పులు కొనసాగుతాయి. ఝార్ఖండ్‌లో ఏప్రిల్ 20, 21 తేదీల్లో హీట్​వేవ్ ప్రభావం ఉంటుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు యెల్లో అలర్ట్​ని జారీ చేసింది ఐఎండీ.

నిన్నటి గణాంకాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్, మహారాష్ట్రలోని వార్ధాలో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 20 వరకు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తీరప్రాంత కర్ణాటకలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఐఎండీ హీట్​వేవ్ అలర్ట్- జాగ్రత్తలు తప్పనిసరి..

వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ఐఎండీ కొన్ని కీలక సూచనలు చేసింది:

హైడ్రేటెడ్​గా ఉండండి: మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలి. తరచుగా మంచి నీరు, పండ్ల రసాలు తాగుతూ ఉండాలి.

బయటి పనులు వద్దు: ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య కఠినమైన పనులు చేయకూడదు.

వార్మ్ నైట్: ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కూడా వేడి గాలులు వీచే అవకాశం ఉంది.

దిల్లీలో పరిస్థితి ఏంటి?

దేశ రాజధాని ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఇది సాధారణం కంటే 1.6 నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువ. వాయువ్య దిశ నుంచి గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అక్కడ మాత్రం వర్షాలు..

దేశమంతా ఎండలతో మాడుతుంటే, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో ఏప్రిల్ 19 నుంచి 21 వరకు భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉంది.

ఏపీలో భిన్న వాతావరణం..

కోస్తా ప్రాంతాన్ని పక్కనపెడితే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇవి రాబోయే రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి ఉంటుందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడతాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఈరోజు ఏ రాష్ట్రాల్లో హీట్​వేవ్ అలర్ట్ ఉంది?

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఐఎండి యెల్లో అలర్ట్ జారీ చేసింది.

2. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎక్కువగా నీరు తాగాలి, వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. మధ్యాహ్నం వేళ ఎండలో తిరగకూడదు. ఓఆర్ఎస్ లేదా నిమ్మరసం తీసుకోవడం మంచిది.

3. ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

కోస్తా ఆంధ్రలో ఏప్రిల్ 20 వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

4. దిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఎంత ఉండవచ్చు?

దిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More