Hero Xpulse 421 : హిమాలయన్ 450కి పోటీగా ‘హీరో ఎక్స్‌పల్స్ 421’- ఇలా ఉంటుంది..
హీరో మోటోకార్ప్ తమ మోస్ట్ పవర్ఫుల్ అడ్వెంచర్ బైక్ 'ఎక్స్‌పల్స్ 421' టీజర్‌ను విడుదల చేసింది. ఈఐసీఎంఏ 2026 ఆటో షోలో అడుగుపెట్టబోతున్న ఈ ఆఫ్‌రోడ్ బైక్ ఇంజిన్, డిజైన్, భారత్‌లో లాంచ్ వివరాలు ఇక్కడ చూడండి..
భారత టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ అడ్వెంచర్ ప్రియులకు అదిరిపోయే వార్త అందించింది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆఫ్‌రోడ్ బైక్ 'ఎక్స్‌పల్స్' సిరీస్‌లో సరికొత్త పవర్ఫుల్ మోడల్‌ను లాంచ్ చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. 'హిమాలయన్ 450'కి గట్టి పోటీగా భావిస్తున్న ‘హీరో ఎక్స్‌పల్స్ 421’ బైక్‌కు సంబంధించిన సరికొత్త టీజర్‌ను కంపెనీ తమ సోషల్ మీడియా వేదికల్లో అధికారికంగా విడుదల చేసింది.

మిలాన్ నగరంలో ప్రారంభంకానున్న ప్రసిద్ధ ఈఐసీఎంఏ 2026 ఆటో షో వేదికగా ఈ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు టీజర్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్స్‌పల్స్ 210 కంటే ఇది ఎగువన కంపెనీ ఫ్లాగ్షిప్ అడ్వెంచర్ టూరర్గా నిలవనుంది.
లద్ధాఖ్ రోడ్లపై కఠిన పరీక్షలు: లీకైన వివరాలు ఇవే..
గత కొన్ని నెలలుగా ఈ బైక్‌కు సంబంధించిన టెస్టింగ్ మోడళ్లు రహదారులపై సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయాల్లోని లద్ధాఖ్ కఠినమైన రహదారులపై హీరో ఈ బైక్‌ను తీవ్రంగా పరీక్షించింది. కేవలం సాధారణ టెస్ట్ డ్రైవర్లు మాత్రమే కాకుండా, డాకర్ ర్యాలీ రేసర్లు అయిన రోస్ బ్రాంచ్, నాచో కార్నెజో వంటి ప్రతిష్టాత్మక రేసర్లు స్వయంగా ఈ ఎక్స్‌పల్స్ 421ను నడిపి దీని ఆఫ్-రోడ్ పనితీరును మెరుగుపరిచారు.
ఎక్స్‌పల్స్ 210తో పోలిస్తే ఈ కొత్త హీరో ఎక్స్‌పల్స్ 421 మోడల్ చాలా పెద్దదిగా, దృఢంగా కనిపిస్తోంది!
డిజైన్: సుదీర్ఘ ప్రయాణాల్లో గాలి ఒత్తిడిని తట్టుకునేలా ఎత్తైన విండ్‌స్క్రీన్, భారీ ఫ్యూయల్ ట్యాంక్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ అమర్చారు.
ఆఫ్‌రోడ్ హార్డ్‌వేర్: పైకి లేచి ఉండే ఎగ్జాస్ట్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, కన్వెన్షనల్ ఫ్రంట్ మడ్‌గార్డ్, స్పోక్ వీల్స్ ఇచ్చారు.
ఈ హార్డ్‌వేర్ చూస్తుంటే హీరో మోటోకార్ప్ హైవే టూరింగ్‌తో పాటు అడ్వెంచర్ ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడే రైడర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
శక్తివంతమైన 421సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్..
ఈ హీరో ఎక్స్‌పల్స్ 421 అడ్వెంచర్ బైక్‌లో ఆల్-న్యూ 421సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. ఇంజిన్ పవర్, టార్క్ వివరాలను హీరో ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎం 390 అడ్వెంచర్ బైక్స్‌కి సమర్థవంతమైన పోటీనిస్తుందని స్పష్టమవుతోంది.
హార్డ్‌వేర్ పరంగా ఇందులో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. ఆఫ్‌రోడింగ్‌కు అనుకూలంగా ముందు వైపు 21-అంగుళాల పెద్ద స్పోక్ వీల్‌ను అందించనున్నారు.
భారత్‌లో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండవచ్చు?
నవంబర్ 3 నుంచి మిలాన్‌లో ప్రారంభమయ్యే ఈఐసీఎంఏ 2026 వేదికగా హీరో ఈ బైక్‌ను ప్రపంచానికి ప్రదర్శించనుంది. ఆ తర్వాత 2027 ప్రారంభంలో ఈ హీరో ఎక్స్‌పల్స్ 421ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, కేటీఎం అడ్వెంచర్ బైక్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, హీరో నుంచి రాబోతున్న ఈ 421సీసీ బైక్ రూ. 2.80 లక్షల నుంచి రూ. 3.20 లక్షల ఎక్స్-షోరూమ్ బడ్జెట్ పరిధిలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడే తెలుగు కుర్రాళ్లకు ఈ బైక్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


