3 రోజుల్లో 15% దూసుకెళ్లిన హెచ్‌ఎఫ్‌సీఎల్.. ఈ షేరును ఇప్పుడు కొనొచ్చా?

హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఫ్‌సీఎల్) షేర్లు దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ ఊపందుకున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 15 శాతానికి పైగా పెరిగిన ఈ షేరు, అక్టోబర్ 1 గురువారం నాటి ట్రేడింగ్‌లో మరో 5 శాతం లాభపడి రూ.237.95 స్థాయికి చేరుకుంది.

Published on: Oct 1, 2026, 12:06:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్‌ఎఫ్‌సీఎల్ (HFCL) షేర్లు స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. అక్టోబర్ 1 ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు 5 శాతం లాభపడి రూ.237.95 వద్ద ముగిసింది. దీంతో గడిచిన మూడే మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 15 శాతానికి పైగా రాబడిని అందించింది. గడిచిన వారం రోజుల్లో 13 శాతం, మూడు నెలల్లో 12 శాతం చొప్పున పెరిగిన ఈ షేరు.. ఆరు నెలల కాలంలో ఏకంగా 227 శాతం ఎగబాకి మల్టీబ్యాగర్‌‌గా నిలిచింది. ఏడాది కాల పరిమితిలో ఇన్వెస్టర్లకు 223 శాతానికి పైగా లాభాలను అందించడం విశేషం.

3 రోజుల్లో 15% దూసుకెళ్లిన హెచ్‌ఎఫ్‌సీఎల్.. ఈ షేరును ఇప్పుడు కొనొచ్చా?
3 రోజుల్లో 15% దూసుకెళ్లిన హెచ్‌ఎఫ్‌సీఎల్.. ఈ షేరును ఇప్పుడు కొనొచ్చా?

కాగా, 2026 ఆగస్టులో ఈ షేరు రూ.257 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా, 2026 జనవరిలో రూ.59.83 వద్ద 52 వారాల కనిష్ట స్థాయి నమోదు చేసింది.

సాంకేతిక సూచీలు ఏం చెప్తున్నాయి?

"ఎగువ స్థాయిలో హెచ్‌ఎఫ్‌సీఎల్ షేరు ఊపు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ర్యాలీ తర్వాత షేరు కొంతకాలం స్థిరీకరణ (Consolidation) లేదా లాభాల స్వీకరణ దశలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ధర వద్ద కొత్తగా భారీగా కొనుగోలు చేయడం కంటే, ఉన్న ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడం శ్రేయస్కరం" అని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సీనియర్ మేనేజర్ జిగర్ ఎస్ పటేల్ సూచించారు. ఈ షేరుకు రూ.220 వద్ద తక్షణ మద్దతు (Support) ఉందన్న ఆయన, ఎగువన రూ.260 స్థాయి ప్రధాన నిరోధంగా (Resistance) పనిచేస్తుందని తెలిపారు. రూ.260 స్థాయిని దాటితేనే మళ్లీ బలమైన బుల్లిష్ ట్రెండ్ ప్రారంభమవుతుందని అంచనా వేశారు.

మరోవైపు షేర్ మార్కెట్ విశ్లేషకులు మయాంక్ జైన్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "రూ.50 నుంచి రూ.100 శ్రేణిలోనే సుదీర్ఘకాలం ట్రేడ్ అయిన హెచ్‌ఎఫ్‌సీఎల్ షేరు 2026 ప్రారంభంలో బలమైన బ్రేక్‌అవుట్ సాధించింది. స్వల్ప, మధ్యమ, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల (50 EMA రూ.218.25, 100 EMA రూ.197.52, 200 EMA రూ.163.09) కంటే పైన ట్రేడ్ అవుతూ బుల్లిష్ ట్రెండ్‌ను స్పష్టం చేస్తోంది" అని మయాంక్ జైన్ వివరించారు. రూ.256.70 వద్ద గరిష్టాన్ని తాకిన తర్వాత వచ్చిన సవరణలో కొనుగోలుదారులు మళ్లీ ఆసక్తి చూపారని, ఈ షేరుకు రూ.218 నుంచి రూ.197.50 శ్రేణి కీలక మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు.

రూ.0.20 డివిడెండ్‌కు ఏజీఎం ఆమోదం

కంపెనీ ఇటీవల ముగిసిన 39వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) అనేక కీలక నిర్ణయాలకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు రూ.0.20 (20 శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎక్స్-డివిడెండ్, రికార్డు తేదీగా 2026 సెప్టెంబర్ 22ను నిర్ణయించారు. అనంతరం సెప్టెంబర్ 29న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఏజీఎంలో ఈ డివిడెండ్‌ ప్రతిపాదనను వాటాదారులు ఖరారు చేశారు. దీంతోపాటు డైరెక్టర్ అరవింద్ ఖరాబందా పునర్నియామకానికి, సబ్సిడీ సంస్థలైన హెచ్‌టీఎల్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్ ఇన్‌కార్పొరేషన్‌లతో సంబంధిత లావాదేవీలకు ఆమోదం లభించింది.

ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలు.. రూ.21,206 కోట్ల ఆర్డర్ బుక్

కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం హెచ్‌‌ఎఫ్‌సీఎల్ వ్యాపార పనితీరు విశేషంగా మెరుగుపడింది. కంపెనీ ఆర్డర్ బుక్ ఏటా 113 శాతం పెరుగుదలతో రూ.21,206 కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 22 శాతం పెరిగి రూ.4,949 కోట్లకు చేరుకుంది. అలాగే ఎబిటా (EBITDA) 63 శాతానికి పైగా పెరిగి రూ.827 కోట్లుగా నమోదైంది. కంపెనీ నికర లాభం (PAT) ఏకంగా 90 శాతానికి పైగా ఎగబాకి రూ.329 కోట్లను దాటగా, ఇపిఎస్ (EPS) 73 శాతం పెరిగి రూ.2.13కి చేరింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More