హోండాకి బిగ్ షాక్- యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారే లేరు! ప్రొడక్షన్ బంద్..
ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల్లో హోండా సంస్థకు నిరాశ తప్పడం లేదు! 'యాక్టివా ఈ', 'క్యూసీ1'కి డిమాండ్ కనిపించడం లేదని సమాచారం. ఫలితంగా ఉత్పత్తిని సైతం నిలిపివేసిందని సమాచారం!
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఈ సంవత్సరం ప్రారంభంలో ‘యాక్టివా ఈ’, 'క్యూసీ1' మోడళ్లను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. జపాన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి స్పందన లభిస్తుందని అందరూ భావించారు. కానీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ డేటా మాత్రం అందుకు భిన్నమైన విషయాన్ని సూచిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హోండా ఆగస్టు 2025 నుంచి ఈ రెండు మోడళ్లను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేసింది!

ఉత్పత్తి నిలిపివేతకు కారణాలు
ఫిబ్రవరి నుంచి జులై 2025 వరకు హోండా మొత్తం 11,168 యాక్టివా ఈ, క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్లకు చెందిన యూనిట్లను తయారు చేసింది. అయితే డీలర్లకు కేవలం 5,201 యూనిట్లు (46.6 శాతం) మాత్రమే పంపిణీ అయ్యాయి. దీనితో కంపెనీ వద్ద పెద్ద మొత్తంలో అమ్ముడుపోని స్టాక్ మిగిలిపోయింది. ఈ కారణంగానే వీటి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.
డీలర్లకు పంపిణీ చేసిన 5,201 యూనిట్లలో కూడా 4,461 యూనిట్లు (86 శాతం) క్యూసీ1 మోడళ్లు సేల్ అయ్యాయి. యాక్టివా ఈకి సంబంధించి కేవలం 740 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి!
యాక్టివా ఈతో పోలిస్తే క్యూసీ1 మోడల్ విక్రయాలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణాలు: తక్కువ ధర, పోర్టబుల్ ఛార్జర్ సౌకర్యం. యాక్టివా ఈ మోడల్ పూర్తిగా హోండా స్వాపెబుల్ బ్యాటరీ సదుపాయాలపై ఆధారపడి ఉంది.
హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లు- ధర, రేంజ్ వివరాలు
| మోడల్ | ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) | సింగిల్ ఛార్జ్‌పై రేంజ్ | ప్రధాన ప్రత్యేకత |
|---|---|---|---|
| హోండా యాక్టివా ఈ | రూ. 1.17 లక్షలు | 102 కి.మీ | స్వాపెబుల్ బ్యాటరీ |
| హోండా క్యూసీ1 | రూ. 90,022 | 80 కి.మీ | పోర్టబుల్ ఛార్జర్, తక్కువ ధర |
ఈ ధర, ఫీచర్లు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లోని వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఉన్నాయి. బజాజ్, టీవీఎస్, ఏథర్, ఓలా, హీరో మోటోకార్ప్ వంటి అగ్రశ్రేణి ఈవీ తయారీదారులు కూడా ఇదే తరహా ఉత్పత్తులను అందిస్తున్నారు.
విక్రయ కేంద్రాలు
హోండా క్యూసీ1 మోడల్ ముంబై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూణె, చండీగఢ్ వంటి ఆరు నగరాల్లో అందుబాటులో ఉంది. యాక్టివా ఈ కంటే ఎక్కువ నగరాల్లో లభించడం కూడా క్యూసీ1 అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే కేవలం 3 లేదా 6 నగరాల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశవ్యాప్తంగా లభించే ఉత్పత్తుల విక్రయ సామర్థ్యాన్ని అందుకోలేకపోవడం గమనార్హం!
భారతీయులకు హోండా యాక్టివాతో ప్రత్యేక అనుబంధం ఉంది. దేశంలో అమ్ముడుపోతున్న బెస్ట్ సెల్లింగ్ 2 వీలర్స్‌లో ఇదీ ఒకటి. మరీ ముఖ్యంగా ఫ్యామిలీలకు పర్ఫెక్ట్ ఆప్షన్‌గా దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ యాక్టివా ఈకి మాత్రం డిమాండ్ దక్కడం లేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


