Honda Avancier : హోండా 3-రో హైబ్రిడ్ ఎస్‌యూవీ 'అవాన్సియర్' ఇదిగో..

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన సరికొత్త మూడు వరుసల హైబ్రిడ్ ఎస్‌యూవీ 'అవాన్సియర్'ను ఆవిష్కరించింది. కొత్త తరం హైబ్రిడ్ టెక్నాలజీ, సరికొత్త 'H' లోగోతో వస్తున్న తొలి మోడల్ ఇదే. వివరాల్లోకి వెళితే..

Published on: Nov 21, 2026, 05:30:16 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆటోమొబైల్ దిగ్గజం హోండా సరికొత్త 3-రో లగ్జరీ ఎస్‌యూవీ 'అవాన్సియర్'ను అధికారికంగా ఆవిష్కరించింది. సంస్థ రూపొందించిన తదుపరి తరం హైబ్రిడ్ వ్యవస్థను పరిచయం చేయనున్న తొలి కారు ఇదే కావడం విశేషం. అంతేకాదు, హోండా తీసుకొచ్చిన సరికొత్త 'H' లోగోతో రానున్న మొదటి హైబ్రిడ్ మోడల్‌గా ఈ అవాన్సియర్. ఈ కారుతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫామ్‌ను, అధునాతన ఎలక్ట్రిక్ ఆల్-వీల్-డ్రైవ్ వ్యవస్థను కూడా హోండా తొలిసారిగా పరిచయం చేసింది. థాయ్‌లాండ్, జపాన్, చైనా సహా పలు ఆసియా మార్కెట్లలో ఈ ఎస్‌యూవీని విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

హోండా అవాన్సియర్ ఎస్​యూవీ ఇదిగో
హోండా అవాన్సియర్ ఎస్​యూవీ ఇదిగో

హోండా అవాన్సియర్- 'గ్రాండ్-జర్నీ' థీమ్‌తో

సుదూర ప్రయాణాలకు అనువుగా 'గ్రాండ్-జర్నీ' అనే థీమ్ చుట్టూ అవాన్సియర్ కారును తీర్చిదిద్దారు. క్లీన్ బాడీ ప్రొఫైల్‌తో పాటు అసలైన ఎస్‌యూవీ శైలి అంశాలను మేళవించి దీనికి రాజసమైన రూపాన్ని ఇచ్చారు. ముందుభాగంలో సన్నని మల్టీ-ఫంక్షన్ లైట్లు, అందరి దృష్టిని ఆకర్షించే పెద్ద గ్రిల్ అమర్చారు. వెనుక భాగంలో పదునైన యాంగులర్ కాంబినేషన్ ల్యాంప్స్, ఉబ్బెత్తుగా కనిపించే వీల్ ఆర్చ్‌లు కారుకు దృఢమైన రూపాన్ని అందిస్తున్నాయి. వాహనం బయటి రూపం ఎక్కడా గజిబిజిగా లేకుండా ఉండేందుకు కారు బాడీలో కలిసిపోయే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సన్నని టెయిల్‌గేట్ స్పాయిలర్, కంటికి కనిపించకుండా అమర్చిన రియర్ వైపర్‌ను అందించారు.

హోండా అవాన్సియర్- కొత్త ప్లాట్‌ఫామ్..

హోండా రూపొందించిన తదుపరి తరం టూ-మోటార్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించిన మొదటి మోడల్ అవాన్సియర్. ఇందులో ఇంజిన్ పనిచేసే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరింత చిన్నదైన, సమర్థవంతమైన డ్రైవ్ యూనిట్‌ను, ఆధునీకరించిన కంట్రోల్ టెక్నాలజీని జతచేశారు. డ్రైవింగ్ పనితీరులో ఏమాత్రం రాజీ పడకుండా మెరుగైన మైలేజీని అందించేందుకే ఈ మార్పులు చేసినట్లు హోండా వెల్లడించింది.

ఈ హోండా అవాన్సియర్ ఎస్‌యూవీలో బ్రాండ్ సరికొత్త 'డ్యూయల్ పవర్ ఈఏడబ్ల్యూడీ' వ్యవస్థను ప్రవేశపెట్టారు; ఇది ముందు, వెనుక చక్రాలను స్వతంత్రంగా నడిపించడానికి వేర్వేరు మోటార్లను ఉపయోగిస్తుంది. బ్రేకింగ్, డ్రైవింగ్ శక్తులను సమన్వయం చేయడానికి 'హోండా మోషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్'తో పాటు డ్రైవింగ్ అనుభూతిని పెంచే 'హోండా S+ షిఫ్ట్' ఫీచర్‌ను కూడా ఇచ్చారు. కొత్త ప్లాట్‌ఫామ్‌ను బరువు తగ్గిస్తూనే దృఢత్వాన్ని పెంచేలా రూపొందించారు. దీని మాడ్యులర్ నిర్మాణం వల్ల భవిష్యత్తులో వచ్చే ఇతర మోడళ్లలోనూ విడిభాగాలను సులభంగా పంచుకునే వీలుంటుంది. ఈ కారుకు ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సదుపాయం కూడా లభిస్తుంది.

హోండా అవాన్సియర్- ఫీచర్లు..

హోండా అవాన్సియర్ కారు లోపల మూడు వరుసల్లో కూర్చునే ప్రయాణికులందరికీ పూర్తి సౌకర్యం ఉండేలా క్యాబిన్‌ను విశాలంగా డిజైన్ చేశారు. వివిధ ఫంక్షన్లను ఒకే చోట నియంత్రించేందుకు డ్యాష్‌బోర్డుపై పెద్ద సెంట్రల్ డిస్‌ప్లేను అమర్చారు. సెంటర్ కన్సోల్ వద్ద ఎక్కువ ఖాళీ స్థలం లభించేందుకు గేర్ సెలెక్టర్‌ను స్టీరింగ్ కాలమ్‌పై అమర్చారు. రెండో వరుస ప్రయాణికులకు వ్యక్తిగత ఆర్మ్‌రెస్ట్‌లు, హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద హెడ్‌రెస్ట్‌లను అందించారు. మూడో వరుస వరకు విస్తరించిన పనోరమిక్ రూఫ్ క్యాబిన్‌కు విశాలమైన అనుభూతిని ఇస్తుంది; చివరి వరుస సీట్లలోకి ప్రయాణికులు సులభంగా ఎక్కి దిగేలా డోర్ సిల్ డిజైన్‌ను ప్రత్యేకంగా మార్చారు.

ముందు వరుసలో శరీరానికి హాయినిచ్చే ఎర్గోనామిక్ సీట్లతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను అందించారు. ఏసీ నియంత్రణ వంటి పనుల కోసం వాయిస్ కంట్రోల్స్ సదుపాయం ఉంది. కారును పార్క్ చేసిన తర్వాత యజమానులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే వాహనం లోపలి భాగాన్ని, చుట్టుపక్కల పరిసరాలను చూసుకునేందుకు 'రిమోట్ ఇన్-క్యాబిన్ వ్యూ', 'రిమోట్ సరౌండ్ వ్యూ' ఫీచర్లను కూడా తీసుకొస్తున్నారు.

2030 నాటికి 15 కొత్త హైబ్రిడ్ మోడళ్లు.. హోండా భారీ వ్యూహం!

2030 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ తదుపరి తరం హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 15 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని హోండా లక్ష్యంగా పెట్టుకుంది. అవాన్సియర్ ఆవిష్కరణతో ఆ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఎస్‌యూవీ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్, మైలేజీ గణాంకాలు, వివిధ దేశాల్లో విడుదల తేదీలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఆధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, విశాలమైన క్యాబిన్‌తో రానున్న ఈ అవాన్సియర్ ఆసియా మార్కెట్లో ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుంది.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.