Honda Elevate facelift : హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్.. లాంచ్ రేపే- ఇవి హైలైట్స్..

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'ఎలివేట్' ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను అక్టోబర్ 6న అధికారికంగా విడుదల చేయనుంది. సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ కారు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Oct 5, 2026, 12:22:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హోండా ఎలివేట్ మరిన్ని నవీకరణలతో మార్కెట్లోకి వస్తోంది. భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి హోండా సంస్థకు అత్యంత కీలకమైన మోడల్‌గా నిలిచిన ఈ ఎస్‌యూవీకి సంబంధించి మొదటి ప్రధాన ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను కంపెనీ అక్టోబర్ 6న లాంచ్ చేస్తోంది. సరికొత్త లుక్, ఆధునిక ఫీచర్లతో రానున్న ఈ మోడల్ బుకింగ్‌లను హోండా కార్స్ ఇండియా ఇప్పటికే ప్రారంభించింది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్..
హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్..

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, మారుతీ సుజుకీ విక్టోరిస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఫోక్స్‌వాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటి దిగ్గజ మోడళ్లతో హోండా ఎలివేట్ నేరుగా పోటీపడుతోంది. ఈ విభాగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుని కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోండా ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌‌ను రూపొందించింది.

ఈ నేపథ్యంలో ఈ హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్- ఆకట్టుకునే ఎక్స్​టీరియర్..

కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్ల ప్రకారం.. కొత్త ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో ప్రధాన మార్పులు జరిగాయి. కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, రీ-డిజైన్ చేసిన బంపర్, సరికొత్త ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, హెడ్‌లాంప్ క్లస్టర్ ఈ వాహనానికి మరింత గంభీరమైన రూపానిచ్చాయి. వెనుక భాగంలో నవీకరించిన ఎల్ఈడీ టైల్ లాంప్స్, మార్పులు చేసిన బంపర్‌ను అమర్చారు. వాహన సిల్హౌట్ పాత మోడల్‌లాగే ఉన్నప్పటికీ, ఈ మార్పులు ఎస్‌యూవీకి గ్లోబల్ హోండా డిజైన్ శైలిని తెచ్చిపెట్టాయి.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్- రీఫ్రెషింగ్ కేబిన్, ప్రీమియం ఫీచర్లు..

ప్రస్తుత ఎలివేట్ మోడల్‌లో కొన్ని కీలక ఫీచర్లు లేవనే అసంతృప్తి కొనుగోలుదారుల్లో ఉండేది. ఆ లోటును భర్తీ చేస్తూ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో హోండా కీలక సదుపాయాలను చేర్చింది. కేబిన్‌లో పెద్ద సైజ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్, మెరుగైన కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అందుబాటులోకి వచ్చాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం వెంటిలేటెడ్ సీట్లు, ఇరుకైన ప్రాంతాల్లో సులభంగా పార్కింగ్ చేయడానికి ఉపయోగపడే 360-డిగ్రీ కెమెరా, ప్రీమియం కేబిన్ ట్రిమ్‌లను టాప్ వేరియంట్లలో అందిస్తున్నారు. కేబిన్ అమరికలో పెద్ద మార్పులు లేకపోయినా, ఉపయోగించిన మెటీరియల్ క్వాలిటీ ప్రయాణ అనుభూతిని మరింత పెంచుతుంది.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్- 'హోండా సెన్సింగ్' అడాస్ భద్రత..

భద్రత విషయంలో హోండా తమ పాపులర్ 'హోండా సెన్సింగ్' అడాస్ టెక్నాలజీని ఈ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లోనూ కొనసాగిస్తోంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి రక్షణగా నిలుస్తాయి.

హోండా ఎలివేట్ ఫేస్​లిఫ్ట్- ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు..

సాంకేతికంగా ఈ ఎస్​యూవీ ఇంజిన్ విభాగంలో ఎలాంటి మార్పులు చేపట్టలేదు. నమ్మకమైన 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులోనూ కొనసాగిస్తున్నారు. ఇది 121 హెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకునే వారికి, ముఖ్యంగా మెరుగైన సేఫ్టీ, పవర్ కోరుకునే వారికి ఈ హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మంచి ఎంపికగా మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More