Honda Elevate : హోండా బిగ్ అప్డేట్- ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ! లాంచ్ ఎప్పుడంటే..
'ఎలివేట్' ఫేస్‌లిఫ్ట్‌కి సంబంధించిన బుకింగ్స్‌ని అధికారికంగా ప్రారంభించింది హోండా కార్స్ ఇండియా. అక్టోబర్ 6న భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ కారును రూ. 21,000 చెల్లించి డీలర్‌షిప్‌లలో రీజర్వ్ చేసుకోవచ్చు. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ చూసేయండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో పండుగల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే దసరా, దీపావళి సీజన్లలో వాహన విక్రయాలను భారీగా పెంచుకునేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హోండా కార్స్ ఇండియా' సరికొత్త 'ఎలివేట్' ఎస్‌యూవీ నవీకరించిన వర్షన్‌ను సిద్ధం చేసింది. అక్టోబర్ 6, 2026న ఈ కారును భారత్‌లో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ లాంచ్‌కు ముందే కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ. 21,000 టోకెన్ మొత్తం చెల్లించి హోండా అధీకృత డీలర్‌షిప్‌లలో ముందస్తుగా ఆర్డర్ చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లేని విధంగా, అందరికంటే ముందుగా భారత్‌లోనే ఈ కొత్త ఎలివేట్‌ను విడుదల చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ విశేషాలను ఇక్కడ చూసేయండి.
ముందు భాగంలో ఆకర్షణీయమైన మార్పులు..
సరికొత్త హోండా ఎలివేట్ డిజైన్‌లో అత్యంత కీలకమైన మార్పులు ముందు భాగంలోనే కనిపిస్తాయి. కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం ప్రధాన హెడ్‌ల్యాంప్ సెటప్ నుంచి వేరుపడి గ్రిల్‌లో కలిసిపోయేలా కొత్త ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను అమర్చారు. గ్రిల్ మధ్య భాగంలో అందించిన మందపాటి హారిజాంటల్ ఎలిమెంట్ ఈ ఎస్‌యూవీకి రోడ్డుపై మరింత ధృడమైన, పవర్‌ఫుల్ అప్పీల్‌ను ఇస్తుంది. జపాన్‌లో హోండా ప్రదర్శించిన 'ఫీల్డ్ ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్' శైలి ఆధారంగా ఈ నూతన ఫ్రంట్ గ్రాఫిక్స్‌ను తీర్చిదిద్దారు.
మరిన్ని ప్రీమియం ఫీచర్లు.. వెంటిలేటెడ్ సీట్లు!
2026 హోండా ఎలివేట్ క్యాబిన్ లోపల కస్టమర్ల సౌకర్యార్థం పలు కీలక మార్పులు చేపట్టింది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. సరికొత్త అప్‌హోల్‌స్టరీ, నూతన కలర్ థీమ్‌తో పాటు భారతీయ కస్టమర్లు ఎంతగానో కోరుకుంటున్న 'వెంటిలేటెడ్ సీట్ల' ఫీచర్‌ను ఈ మోడల్‌లో జత చేయనున్నారు.
ఇప్పటికే ఉన్న 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్), 8-స్పీకర్ ఆడియో సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్, 7 ఇంచుల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్-బటన్ స్టార్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులోనూ కొనసాగుతాయి. అధునాతన రక్షణ కోసం ఇచ్చే కెమెరా ఆధారిత 'అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్' (అడాస్) రక్షణ కవచం ఈ మోడల్‌లోనూ లభించనుంది.
ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు..
ఎలివేట్ మోడల్‌లో హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను పరిచయం చేస్తారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని కంపెనీ వాయిదా వేసింది. ఈ ఎస్‌యూవీలో విశ్వసనీయమైన 1.5-లీటర్ 4-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇది 121 పీఎస్ (సుమారు 119 బీహెచ్‌పీ) పవర్, 145 ఎన్ఎమ్ టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ ప్రాధాన్యతలను బట్టి 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
ధరలు, మార్కెట్ పోటీ..
"కొత్త ఎలివేట్‌తో కస్టమర్లు ఎంతగానో ఆశించే ఫీచర్లు, మరింత బోల్డ్ డిజైన్, ప్రీమియం క్యాబిన్ అనుభూతిని అందిస్తున్నాం. భారత్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్, అందుకే నూతన ఎలివేట్‌ను అందరికంటే ముందుగా ఇక్కడే పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాం," అని హోండా కార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.81 లక్షల నుంచి రూ. 16.98 లక్షల మధ్య ఉంది. కొత్త ఫీచర్లు తోడవుతున్నందున ఫేస్‌లిఫ్ట్ ధరలో కొద్దిపాటి పెంపు ఉండే అవకాశముంది.
ఇక మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి కార్లకు ఈ 2026 హోండా ఎలివేట్ గట్టి పోటీనివ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


