Mahindra Vision S : 2027లో గ్రాండ్ ఎంట్రీ! మహీంద్రా 'విజన్ ఎస్' ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫీచర్లు ఇవే..
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సరికొత్త 'విజన్ ఎస్' ఎస్‌యూవీని ప్రొడక్షన్ వెర్షన్‌గా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. 'NU_IQ' ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వివరాలతో పాటు పవర్‌ట్రైన్ సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడంలో మహీంద్రా నిరంతరం అగ్రస్థానంలో నిలుస్తోంది. థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ సిరీస్‌లతో రికార్డు విక్రయాలు సాధిస్తున్న ఈ దిగ్గజ సంస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త కాన్సెప్ట్ కార్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన ఫ్లెక్సిబుల్ 'NU_IQ' ప్లాట్‌ఫామ్ ఆధారంగా రాబోతున్న ‘విజన్ ఎస్’ ఎస్‌యూవీకి సంబంధించిన ఫీచర్లు, డిజైన్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

కంపెనీ గ్రాండ్ ఈవెంట్‌లో ఈ విజన్ సిరీస్‌ను తొలిసారిగా ప్రపంచానికి ప్రదర్శించింది. 2027 నాటికి ప్రొడక్షన్ వెర్షన్‌ను రోడ్లపైకి తీసుకురావాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా లీకైన ఇంటీరియర్ స్పై చిత్రాలను పరిశీలిస్తే, కాన్సెప్ట్ మోడల్‌కు చాలా దగ్గరగా ప్రొడక్షన్ వెర్షన్ ఉండే అవకాశం కనిపించడమే కాకుండా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాపులర్ మహీంద్రా మోడళ్లలోని ప్రీమియం ఫీచర్లు ఇందులో కొలువుదీరనున్నాయి.
థార్ రాక్స్ తరహాలో ప్రీమియం ఇంటీరియర్..
మహీంద్రా విజన్ ఎస్ క్యాబిన్ లోపల కస్టమర్లను ఆకట్టుకునేలా ఆధునిక వసతులు కల్పించారు. డాష్‌బోర్డ్‌పై 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. దీని డిజైన్, అమరిక ఇటీవల మార్కెట్లోకి వచ్చి బ్లాక్‌బస్టర్ విజయ సాధించిన థార్ రాక్స్ సెటప్‌ను పోలి ఉంది. దీనికి తోడు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లభించనుంది.
రోజూవారీ వాడకాన్ని సులభతరం చేసేందుకు క్లైమేట్ కంట్రోల్ కోసం టచ్ సిస్టమ్ కాకుండా ఫిజికల్ బటన్లను ఇచ్చారు. సెంటర్ కన్సోల్‌పై ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సదుపాయం కనిపించింది. లీకైన చిత్రాల్లోని స్టీరింగ్ వీల్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ మోడళ్ల నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ వెర్షన్ వచ్చేసరికి దీని డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశముంది.
మస్కులర్ బాక్సీ డిజైన్.. పక్కా రగ్గడ్ లుక్!
మహీంద్రా కార్లకు ఉండే ప్రత్యేకమైన ఆఫ్-రోడ్ రగ్గడ్ డిజైన్‌ను ఈ విజన్ ఎస్ మోడల్‌లోనూ కొనసాగించారు.
ముందు భాగం: వర్టికల్ స్లాట్ గ్రిల్, ప్రాజెక్టర్ హెడ్‌లాంప్‌లతో పాటు ఎల్-షేప్ డ్యూయల్ డీఆర్‌ఎల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
వెనుక భాగం: సాంప్రదాయ ఎస్‌యూవీల తరహాలో టైల్‌గేట్‌పైనే ఫుల్-సైజ్ స్పేర్ వీల్‌ను బిగించారు.
ఓవరాల్ స్టాన్స్: బాక్సీ షేప్, నిటారుగా ఉండే ప్రొఫైల్ వల్ల ఇది రోడ్డుపై భారీ వాహనంలా కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో స్కార్పియో కుటుంబంలో ఒక భాగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్, ఈవీ ఆప్షన్లు!
మహీంద్రా సరికొత్తగా తెచ్చిన 'NU_IQ' ప్లాట్‌ఫామ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది సాంప్రదాయ ఇంధనంతో నడిచే ఐసీఈ మోడళ్లతో పాటు పూర్తి ఎలక్ట్రిక్ (ఈవీ) మోడళ్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇటీవల జరిపిన రోడ్ టెస్టింగ్‌లో ఈ కారు డీజిల్ ఇంజిన్‌తో ప్రయాణిస్తూ కనిపించింది. అంటే ప్రారంభంలో మహీంద్రా దీనిని పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకువచ్చి, ఆ తర్వాత ఈవీ వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై విభిన్న పవర్‌ట్రైన్‌లను రూపొందించడం వల్ల కంపెనీకి తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
2027లో రోడ్లపైకి..!
NU_IQ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మహీంద్రా మొత్తం నాలుగు కాన్సెప్ట్ మోడళ్లను (విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్ఎక్స్టీ, విజన్ ఎస్) పేటెంట్ చేసింది. ఇందులో ముందుగా 'విజన్ ఎస్' మోడల్ 2027 లో ప్రొడక్షన్‌కు వెళ్లి ఆ తర్వాత మార్కెట్లోకి విడుదల కానుంది. లాంచ్ తేదీ దగ్గరపడే కొద్దీ దీని ఫైనల్ పేరు, ఇంజిన్ సామర్థ్యం, ధర గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


