...
...
Next Story

Honda cars : హోండా నుంచి 2 కొత్త కార్లు.. ఒకటి హైబ్రిడ్, ఇంకోటి ఈవీ! ఇంకొన్ని రోజుల్లోనే లాంచ్

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా రెండు సరికొత్త గ్లోబల్ ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 1న థాయ్‌లాండ్‌లో నెక్ట్స్-జెనరేషన్ హైబ్రిడ్ 'అవాన్సియర్' కారును, డిసెంబర్ 2న భారత్‌లో 'హోండా ఆల్ఫా ఈవీ'ని ప్రదర్శించనుంది. ఈ రెండు కార్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు ఇక్కడ చదవండి..

Published on: Nov 15, 2026, 16:01:27 IST
Advertisement

జపాన్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు సరికొత్త గ్లోబల్ ఎస్‌యూవీ మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. అవే హోండా అవాన్సియర్, హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. హోండా అభివృద్ధి చేసిన నెక్ట్స్ జెన్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న తొలి కార్లలో అవాన్సియర్ ఒకటి. డిసెంబర్ 1, 2026న థాయ్‌లాండ్ వేదికగా ఈ కారును ఆవిష్కరించనున్నారు. అయితే మూడు వరుసల సీటింగ్ ఉన్న ఈ ఎస్‌యూవీని భారత్‌లోకి తీసుకురావడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. అదే సమయంలో భారతీయ కార్ల ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హోండా ఆల్ఫా ఈవీ' డిసెంబర్ 2, 2026న మన దేశంలో అధికారికంగా అరంగేట్రం చేయనుంది.

హోండా 0 అల్ఫా ఇదిగో..
హోండా 0 అల్ఫా ఇదిగో..

ఇప్పటివరకు పెట్రోల్, హైబ్రిడ్ కార్లకే పరిమితమైన హోండా, ఇప్పుడు ఆల్ఫా ఈవీతో భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగుపెడుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీగా కొత్త 'హోండా అవాన్సియర్'!

కంపెనీ గ్లోబల్ లైనప్‌లో సీఆర్-వీ కంటే పైస్థాయిలో హోండా అవాన్సియర్ నిలవనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ శాంటా ఫే, కియా సోరెంటో, స్కోడా కొడియాక్, మాజ్డా సీఎక్స్-80 వంటి దిగ్గజ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇందులో 2.0-లీటర్, నాలుగు సిలిండర్ల డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండే అవకాశం ఉంది. అన్ని చక్రాలకు శక్తిని అందించే ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థతో దీనిని తీసుకురానున్నారు.

తాజాగా విడుదలైన అధికారిక టీజర్ల ప్రకారం.. అవాన్సియర్ సన్నని హెడ్‌ల్యాంప్ క్లస్టర్లు, అడ్డంగా ఉండే ఎరుపు రంగు లైట్ స్ట్రిప్‌తో నిలువుగా అమర్చిన టెయిల్‌ల్యాంప్స్, వాలుగా ఉండే వెనుక విండ్‌స్క్రీన్‌తో ఆకట్టుకుంటోంది. యానిమేటెడ్ లైటింగ్ సీక్వెన్స్‌తో కూడిన సన్నని ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హోండా కొత్త లోగోతో కూడిన హెచ్-ఆకారపు సిగ్నేచర్, అవాన్సియర్ అక్షరాలు దీనికి ప్రీమియం రూపాన్ని ఇస్తున్నాయి. కొలతల విషయానికొస్తే ఈ కారు సుమారు 4,960 మిల్లీమీటర్ల పొడవు, 1,950 మిల్లీమీటర్ల వెడల్పు, 1,690 మిల్లీమీటర్ల ఎత్తు ఉండనుంది.

'హోండా ఆల్ఫా ఈవీ' విశేషాలివే!

రోడ్లపై పరీక్షలు జరుపుకుంటున్న హోండా ఆల్ఫా ఈవీ స్పై చిత్రాలను గమనిస్తే, కాన్సెప్ట్ మోడల్ డిజైన్‌ను దాదాపు అలాగే కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎంపీవీ తరహా విశాలమైన కొలతలతో పాటు మస్క్యులర్ ఎస్‌యూవీ రూపాన్ని ఇది సంతరించుకుంది. హోండా ‘థిన్, లైట్ అండ్ వైజ్’ డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. వాలుగా ఉండే ముందు విండ్‌స్క్రీన్, నిలువుగా ఉండే వెనుక విండ్‌స్క్రీన్, వెలిగే హోండా లోగోతో కూడిన ఫ్రంట్ గ్రిల్, ముందు భాగంలోనే ఛార్జింగ్ పోర్ట్, ప్రత్యేకమైన హెడ్‌ల్యాంప్స్, మందపాటి సీ-పిల్లర్, 19-అంగుళాల ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెనుక బంపర్‌లో చిన్న లైట్ యూనిట్లు, పెద్ద ఫాక్స్ బాష్ ప్లేట్, పూర్తి వెడల్పుతో కూడిన యూ-ఆకారపు టెయిల్‌ల్యాంప్స్ దీనికి భవిష్యత్ తరం కారు రూపాన్ని ఇస్తున్నాయి.

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత హోండా ఆల్ఫా ఈవీకి గట్టి పోటీ ఎదురుకానుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా ఎబెల్లా, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లతో ఇది తలపడనుంది.

స్థానికంగా తయారు చేస్తుండటం వల్ల ధర కూడా అందుబాటులో ఉంటే, భారత ఈవీ మార్కెట్లో హోండా తన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks