హోండా అడ్వెంచర్ ధమాకా! XR300L, XR300 ర్యాలీ బైక్స్ లాంచ్- ధర..

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త XR300L, XR300 ర్యాలీ బైకులను విడుదల చేసింది. అడ్వెంచర్, డ్యూయల్ స్పోర్ట్ సెగ్మెంట్‌లో హిమాలయన్, ఎక్స్‌పల్స్‌లకు గట్టి పోటీనిచ్చేలా వీటి ధరలను నిర్ణయించారు.

Published on: Oct 6, 2026, 05:59:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లేందుకు మాత్రమే కాకుండా.. వారాంతాల్లో లాంగ్ రైడ్స్, కొండల్లో ఆఫ్‌రోడింగ్ చేసే అడ్వెంచర్ బైకర్ల కోసం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రెండు సరికొత్త బైకులను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండా ఎక్స్‌ఆర్300ఎల్, హోండా ఎక్స్‌ఆర్300 ర్యాలీ పేరుతో విడుదలైన ఈ బైకుల ఎక్స్-షోరూమ్ ధరలను వరుసగా రూ. 1.83 లక్షలు, రూ. 2.08 లక్షలుగా నిర్ణయించింది.

హోండా కొత్త అడ్వెంచర్ బైక్..
హోండా కొత్త అడ్వెంచర్ బైక్..

గత కొన్నేళ్లుగా భారతదేశంలో లైట్‌వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల విభాగానికి డిమాండ్ విపరీతంగా పెరిగుతోంది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకునేలా హోండా ఈ మోడళ్లను రేసులోకి దించింది.

ఒకే ప్లాట్‌ఫారమ్.. రెండు భిన్న స్టైల్స్!

ఈ రెండు హోండా బైకులను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించినప్పటికీ, కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు భిన్నమైన డిజైన్ శైలిని ఇచ్చారు.

ఎక్స్‌ఆర్300ఎల్ : ఇది పూర్తిగా ఆఫ్‌రోడింగ్, డర్ట్ రైడింగ్ ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని తయారైంది. తక్కువ బాడీ వర్క్, తేలికపాటి స్ట్రక్చర్‌తో ఇది రూపొందింది.

ఎక్స్‌ఆర్300 ర్యాలీ (XR300 Rally): సుదూర ప్రయాణాలు (లాంగ్ డిస్టెన్స్ టూరింగ్) చేసే వారి కోసం దీనిని తీర్చిదిద్దారు. ప్రయాణంలో గాలి ఒత్తిడి పడకుండా పెద్ద ఫ్రంట్ ఫెయిరింగ్, ఎత్తైన విండ్‌స్క్రీన్, అదనపు బాడీ ప్యానెళ్లను ఇందులో అమర్చారు.

ఎత్తైన రైడింగ్ స్టాన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, స్పోక్ వీల్స్, డ్యూయల్ పర్పస్ టైర్లతో సాంప్రదాయ డ్యూయల్ స్పోర్ట్ లుక్‌లో ఈ రెండూ ఆకట్టుకుంటున్నాయి.

ఇంజిన్ సామర్థ్యం, పనితీరు..

హోండా ఈ రెండు బైక్స్​లోను 286 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది గరిష్టంగా 24.3 హెచ్‌పీ పవర్, 26.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు.

పనితీరు పరంగా చూస్తే.. హీరో ఎక్స్‌పల్స్ 210 కంటే అధిక శక్తిని, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కంటే బ్యాలెన్స్‌డ్ రైడింగ్‌ను ఇది అందిస్తుంది. సాధారణంగా భారీ అడ్వెంచర్ బైకులు 180 కిలోలకు పైగా బరువుంటాయి. కానీ హోండా ఎక్స్‌ఆర్300 మోడళ్లు అత్యంత తేలికగా ఉండటం వల్ల ఇటు నగర ట్రాఫిక్‌లోనూ, అటు కఠినమైన ఆఫ్‌రోడ్ దారుల్లోనూ సులభంగా నడపవచ్చు. ఇంజిన్ స్మూత్‌నెస్‌కు హోండా ఉన్న పేరు ఈ బైకులకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

సస్పెన్షన్, బ్రేకింగ్ హార్డ్‌వేర్..

కఠినమైన రోడ్లపై నమ్మకమైన ప్రయాణాన్ని అందించేందుకు హోండా అత్యుత్తమ హార్డ్‌వేర్‌ను జత చేసింది.

  • ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్
  • వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్
  • ముందు, వెనుక డిస్క్ బ్రేకులు
  • మట్టి, తార్ రోడ్లపై పట్టునిచ్చే డ్యూయల్ పర్పస్ టైర్లు
  • దెబ్బలను తట్టుకునే వైర్ స్పోక్ వీల్స్

హోండా అడ్వెంచర్ బైక్స్- ధరలు..

హోండా ప్రకటించిన రూ. 1.83 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో అనేక మోడళ్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. కవాసాకి కేఎల్ఎక్స్ 230 ఖరీదైనది కాగా, హీరో ఎక్స్‌పల్స్ నుంచి నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లాలనుకునే వారికి హోండా సీఆర్300ఎల్ సరైన ఆప్షన్. మరోవైపు కేటీఎం అడ్వెంచర్ 250, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కంటే తక్కువ ధరకు, తక్కువ బరువుతో లభిస్తుండటంతో ఎక్స్‌ఆర్300 ర్యాలీ మోడల్ అడ్వెంచర్ ప్రేమికులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More