...
...
Next Story

హోటల్ బిల్లులో గ్యాస్ చార్జీలు వేస్తున్నారా? సీసీపీఏ హెచ్చరిక

హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో ఎల్‌పీజీ లేదా గ్యాస్ చార్జీల పేరుతో అదనపు వసూళ్లు చేయడంపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) సీరియస్ అయింది. ఇది అక్రమ వాణిజ్య పద్ధతి అని, ఇలాంటి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Published on: Mar 26, 2026, 06:45:21 IST
Advertisement

హోటల్‌కు వెళ్లి భోజనం చేశాక చేతికి వచ్చే బిల్లులో మెనూ ధరలు, ట్యాక్సులతో పాటు అదనంగా 'గ్యాస్ చార్జీలు' కనిపిస్తున్నాయా? అయితే వినియోగదారులు జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి అదనపు వసూళ్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అధికార సంస్థ (CCPA) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు తమ ఇష్టం వచ్చినట్లుగా ‘ఎల్‌పీజీ చార్జీలు’, ‘గ్యాస్ సర్‌చార్జ్’ లేదా ‘ఫ్యూయల్ కాస్ట్ రికవరీ’ పేరుతో కస్టమర్లపై భారం వేయకూడదని స్పష్టం చేసింది.

చట్టవిరుద్ధమైన వసూళ్లు: సీసీపీఏ హెచ్చరిక

హోటల్ బిల్లులో గ్యాస్ చార్జీలు వేస్తున్నారా? సీసీపీఏ హెచ్చరిక (Nitin Sharma)
హోటల్ బిల్లులో గ్యాస్ చార్జీలు వేస్తున్నారా? సీసీపీఏ హెచ్చరిక (Nitin Sharma)

వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం.. ఆహార పదార్థాల ధరలకు అదనంగా ఇలాంటి చార్జీలు వసూలు చేయడం 'అక్రమ వాణిజ్య పద్ధతి' (Unfair Trade Practice) కిందకు వస్తుందని సీసీపీఏ హెచ్చరించింది. ఈ మేరకు సెక్షన్ 10 కింద వ్యాపార సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానాలు కూడా ఉంటాయని పేర్కొంది.

తనిఖీలు ముమ్మరం

వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఈ అంశంపై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో హోటళ్లపై నిఘా పెంచామని వెల్లడించారు. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌కు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మెనూ కార్డులో ఒక ధర చూపించి, బిల్లు ఇచ్చే సమయంలో గ్యాస్ ఖర్చులు అంటూ అదనంగా వసూలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

నిబంధన ఏమంటోంది?

వ్యాపారం నిర్వహించడానికి అయ్యే ఖర్చులు అంటే.. గ్యాస్ (LPG), విద్యుత్, సిబ్బంది జీతాలు లేదా ఇతర నిర్వహణ ఖర్చులన్నింటినీ కలిపే మెనూలో వస్తువు ధరను నిర్ణయించాలి. అంతే తప్ప, వంట వండటానికి ఇంత గ్యాస్ అయిందని బిల్లులో ప్రత్యేకంగా ‘ఫ్యూయల్ చార్జీలు’ వేయడం తప్పు. "ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా తమ బిల్లులో ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా ఇలాంటి చార్జీలను జోడించకూడదు" అని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ప్రశ్న: హోటల్ బిల్లులో గ్యాస్ చార్జీలు వేస్తే ఏం చేయాలి?

జవాబు: ముందుగా సదరు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించండి. ఇది చట్టవిరుద్ధమని చెప్పండి. వారు వినకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ (1915) కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

ప్రశ్న: సర్వీస్ ఛార్జ్, గ్యాస్ ఛార్జ్ రెండూ ఒకటేనా?

జవాబు: కాదు. గతంలోనే సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఇప్పుడు తాజాగా గ్యాస్, ఎల్‌పీజీ వంటి ఇంధన చార్జీలను కూడా బిల్లులో విడిగా వేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe