33 డిగ్రీల ఎండలో 'హుడీ'.. పూణే వ్యాపారవేత్త హత్య కేసును ముడివిప్పిన చిన్న క్లూ
పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో పోలీసులు ఒక చిన్న క్లూతో మిస్టరీని ఛేదించారు. జూన్ నెల ఎండల్లో నిందితుడు ధరించిన ఒక 'హుడీ' (తల కవర్ చేసే స్వెటర్) ఈ పకడ్బందీ హత్యోదంతాన్ని ఛేదించడంలో పోలీసులకు కీలక ఆధారంగా మారింది.
33 డిగ్రీల ఎండలో ఒక వ్యక్తి తలకు హుడీ వేసుకుని తిరగడం.. పూణే రూరల్ పోలీసుల అనుమానానికి బీజం వేసింది. లోహ్‌గఢ్ కోటపై ప్రమాదవశాత్తు పడి మరణించాడనుకున్న 25 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ కేసు.. చివరకు పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని లోనావాలా రూరల్ పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయడే వివరించారు.

అనుమానం రేకెత్తించిన 'హుడీ'
కేతన్ అగర్వాల్ మంచి ట్రెకర్ అని, అంత సులభంగా లోహ్‌గఢ్ కోటపై నుంచి జారిపడే అవకాశం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు గట్టిగా చెప్పారు. దీంతో ప్రమాద కోణాన్ని పక్కనబెట్టి పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. జూన్ 18 ఉదయం అక్కడ 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కోట కింద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు, తీవ్రమైన ఎండలో ఒక వ్యక్తి హుడీ ధరించి, తల కప్పుకుని, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని తిరగడం ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయడే దృష్టిని ఆకర్షించింది. వాతావరణానికి ఏమాత్రం పొంతన లేని ఆ దుస్తులే పోలీసులకు తొలి క్లూగా మారాయి.
"జూన్ 18 నాటి ఉష్ణోగ్రతలను పరిశీలించినప్పుడు ఆ ఉదయం 33 డిగ్రీల ఎండ ఉంది. కోట దిగువన ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి హుడీ ధరించి, తల కప్పుకుని, హెడ్‌ఫోన్స్‌తో కనిపించాడు. ఆ వాతావరణంలో అలాంటి దుస్తులు వేసుకోవడం మాకు అనుమానం కలిగించింది" అని ఇన్‌స్పెక్టర్ తాయడే పేర్కొన్నారు.
ఫోన్ ఇంట్లోనే వదిలేసి.. పక్కా ప్లాన్‌తో
ఆ హుడీ ధరించిన వ్యక్తిని సియా ప్రియుడు చేతన్ చౌదరి (22)గా పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరకకూడదనే ప్లాన్‌తో చేతన్ తన మొబైల్ ఫోన్‌ను కొంధ్వాలోని తన ఇంట్లోనే వదిలిపెట్టి కోటకు వచ్చాడు. కానీ సీసీటీవీల ద్వారా అతని కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. చేతన్, సియాలను గట్టిగా విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నారు.
సియా తండ్రి ప్రవీణ్ గోయల్ మార్కెట్ యార్డ్‌లో మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుండగా, చేతన్ కుటుంబానికి కూడా అదే ప్రాంతంలో హోల్‌సేల్, రిటైల్ కిరాణా వ్యాపారం ఉంది. ఈ వ్యాపార పరిచయాలతోనే సియా, చేతన్‌లు గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నారు.
రూ. 14 కోట్ల పెళ్లి.. లోయలోకి నెట్టేసిన ప్రియుడు
'సక్సెస్ గ్రూప్' డైరెక్టర్‌గా ఉన్న కేతన్‌తో సియాకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో దాదాపు రూ. 14 కోట్ల భారీ బడ్జెట్‌తో వీరి వివాహానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ సియా, చేతన్‌ల బంధం కొనసాగుతూనే ఉంది.
జూన్ 18న కేతన్, సియాలు కోటకు రాకముందే చేతన్ చౌదరి అక్కడికి చేరుకున్నాడు. వారు నిర్మానుష్య ప్రాంతానికి రాగానే, సియా సాయంతో కేతన్‌ను లోయలోకి నెట్టేసి హతమార్చాడు.
"సుదీర్ఘ విచారణ, కాల్ డేటా రికార్డులు (CDR), ఫోన్ లొకేషన్లు, మెసేజ్‌ల ఆధారంగా నిందితులు ఇద్దరూ కేతన్ అగర్వాల్‌ను హతమార్చడానికి కుట్ర పన్నినట్లు అంగీకరించారు" అని పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.
ముందే జరిగిన హత్యాయత్నం?
దర్యాప్తులో మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కేతన్, సియాలు ఇండోనేషియాలోని బాలి వెళ్లాల్సి ఉండగా, ముంబై ఎయిర్‌పోర్టులో కేతన్ పాస్‌పోర్ట్ మాయమైంది. లోనావాలాలో ఆగినప్పుడు సియానే ఉమ్మడి పౌచ్ నుంచి ఆ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ఆరోపించారు.
అంతేకాదు, జూన్ 18 ఘటనకు నాలుగు రోజుల ముందు (జూన్ 14న) కూడా వారు లోహ్‌గఢ్ కోటకు వెళ్లారు. అప్పుడు కూడా ఎవరో తనను వెనుక నుంచి నెట్టేయడానికి ప్రయత్నించారని కేతన్ అప్పట్లో చెప్పాడని తండ్రి గుర్తు చేసుకున్నారు. అయితే పక్కనే పాము ఉందంటూ సియా డ్రామా ఆడి ఆ విషయాన్ని డైవర్ట్ చేసిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


