EMI టెన్షన్ లేకుండా ఉండాలంటే మీ నెలవారీ ఆదాయంలో అది ఎంత శాతం ఉండాలి?

లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఆదాయంలో 30 శాతానికి మించి నెలవారీ ఈఎంఐ ఉంటే అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: Apr 21, 2026 5:27 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత ఇల్లు, కొత్త కారు లేదా పిల్లల ఉన్నత చదువులు.. ఇలా మన జీవితకాల లక్ష్యాలను చేరుకోవడానికి లోన్ తీసుకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది. అయితే, మనం తీసుకునే ఈ అప్పులే మన ఆర్థిక స్వేచ్ఛను నిశ్శబ్దంగా హరిస్తున్నాయా? నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం కేవలం ఈఎంఐలకే (EMIs) సరిపోతోందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. రుణం భారం కాకూడదన్నా, ఒత్తిడి లేని జీవితం గడపాలన్నా మన సంపాదనకు, అప్పులకు మధ్య సరైన సమతుల్యత ఉండటం చాలా ముఖ్యం.

ఇల్లు, కార్ లోను తదితర చెల్లింపులు మీ నెలవారీ ఆదాయంలో 30 శాతం కంటే మించకుండా ఉండడం మంచిది
ఇల్లు, కార్ లోను తదితర చెల్లింపులు మీ నెలవారీ ఆదాయంలో 30 శాతం కంటే మించకుండా ఉండడం మంచిది

నిపుణుల సలహా: 30 శాతం సూత్రం

లోన్ల విషయంలో ఆర్థిక నిపుణులు ఒక ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా నమ్ముతారు. అదే 30 శాతం నిబంధన. "మీ నెలవారీ నికర ఆదాయంలో లోన్ రీపేమెంట్ ఈఎంఐ 25 నుంచి 30 శాతం లోపే ఉండటం క్షేమకరం. ఈ పరిమితి దాటితే మీ ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది" అని హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ రోహిత్ పట్వర్ధన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హోమ్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాల విషయంలో మన భవిష్యత్తు ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకోవడం చాలా అవసరమని ఆయన సూచించారు.

మరో నిపుణులు, భారత్ లోన్ బిజినెస్ హెడ్ శక్తి షెఖావత్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. "రుణం అనేది మన ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలి తప్ప, మన జీవితాన్ని శాసించేలా ఉండకూడదు. ఆదాయంలో అప్పుల భారం 30-40 శాతం లోపే ఉంటేనే అత్యవసర పరిస్థితులకు, పొదుపునకు అవకాశం ఉంటుంది," అని ఆయన వివరించారు. ఈ పరిమితి దాటితే తెలియకుండానే అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

లెక్క ఇలా ఉండాలి..

విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ నెలవారీ ఆదాయం అక్షరాలా రూ. 1,00,000 అనుకుందాం. మీకు వేరే ఇతర అప్పులు ఏవీ లేకపోతే, మీరు కొత్తగా తీసుకునే లోన్ EMI రూ. 25,000 నుంచి రూ. 30,000 లోపు మాత్రమే ఉండాలి. ఒకవేళ మీ ఈఎంఐ భారం రూ. 40,000 నుంచి రూ. 45,000 దాటుతోందంటే మాత్రం మీ ఆర్థిక ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో ఉందని అర్థం. అటువంటి సమయంలో కొత్తగా మరో లోన్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

లోన్ తీసుకునే ముందు గమనించాల్సిన అంశాలు

అప్పు చేసే ముందు కేవలం బ్యాంకులు ఎంత లోన్ ఇస్తున్నాయి అనే దానికంటే, మనం ఎంత తిరిగి కట్టగలమో ఆలోచించాలి.

  1. ఆదాయ స్థిరత్వం: మీ ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం ఎంతవరకు స్థిరంగా ఉంటుందో ఆలోచించండి. ఆదాయంలో ఒడిదుడుకులు ఉంటే భారీ ఈఎంఐలను భరించడం కష్టమవుతుంది.
  2. అత్యవసర నిధి: ఏదైనా అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవిస్తే కనీసం 3 నుంచి 6 నెలల పాటు ఇంటి ఖర్చులకు, లోన్ ఈఎంఐలకు సరిపడా నగదును సిద్ధంగా ఉంచుకోవాలి. దీనివల్ల లోన్ ఎగవేత అనే సమస్య తలెత్తదు.
  3. భవిష్యత్తు అవసరాలు: పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, రిటైర్మెంట్ ప్లాన్ వంటి కీలకమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా లోన్ తీసుకోవద్దు.
  4. వడ్డీ రేట్ల ప్రభావం: పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫ్లోటింగ్ రేట్లలో స్వల్ప మార్పులు వచ్చినా మీ ఈఎంఐ భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.
  5. జీవనశైలికి వెసులుబాటు: లోన్ కట్టిన తర్వాత మీ విలాసాలకు, ఇతర ఇష్టమైన పనులకు తగినంత నగదు మిగిలి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. కేవలం అప్పులకే జీవితాన్ని అంకితం చేయకూడదు.

చివరిగా చెప్పాలంటే.. ఈఎంఐ అనేది కేవలం మనం కట్టగలిగే సామర్థ్యం మీద మాత్రమే కాకుండా, మన ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీయని విధంగా ఉండాలి. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని మీ లోన్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More