ఒక ఆలోచనని స్టార్టప్‌గా ఎలా మార్చాలి? మీకోసం ఈ ప్రాక్టికల్ గైడ్..
నేటి విద్యార్థుల్లో వ్యాపారవేత్తలు కావాలనే ఆకాంక్ష పెరుగుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సొంతంగా స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారి కోసం NSRCEL నిపుణుల సూచనలతో కూడిన ప్రత్యేక కథనం ఇది. ఇందులో చెప్పిన టిప్స్ మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి.
ప్రస్తుతం భారతీయ విద్యార్థుల్లో వ్యవస్థాపకత (Entrepreneurship) పట్ల ఆసక్తి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. ఇటీవలి ‘గెస్ ఇండియా’ నివేదిక ప్రకారం.. సుమారు 14శాతం మంది విద్యార్థులు డిగ్రీ పూర్తి కాగానే స్టార్టప్ బాట పట్టాలని కోరుకుంటున్నారు. మరో 31 శాతం మంది ఐదేళ్లలోపు సొంతంగా ఏదైనా సాధించాలని కలలుగంటున్నారు.

అయితే, స్టార్టప్ నిర్మించడానికి ఏదైనా నిర్దిష్టమైన ఫార్ములా ఉందా? అంటే 'యెస్ అండ్ నో' అని చెప్పాలి. ఎందుకంటే వ్యాపారం అనేది ఒక లెక్కతో కూడిన శాస్త్రం కాదు! ఇందులో సవాళ్లు, అస్పష్టత చాలా ఎక్కువ. కానీ విద్యార్థి దశలో ఉన్న వ్యవస్థాపకులు విజయతీరాలకు చేరడానికి కొన్ని ముందస్తు అడుగులు వేయడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకుని మంచి ఫలితాలను చూడవచ్చు. ఐఐఎమ్ బెంగళూరుకు చెందిన NSRCEL (స్టార్టప్ ఇంక్యుబేటర్) సుమారు 120 మందికి పైగా ఫౌండర్లతో పనిచేసిన అనుభవంతో అందిస్తున్న కొన్ని కీలక సూచనలను ఇక్కడ తెలుసుకోండి..
ఒక ఆలోచనని స్టార్టప్‌గా ఎలా మార్చాలి?
1. సరైన సమస్యను గుర్తించండి..
కేవలం ఒక ‘ఐడియా’ వచ్చింది కదా అని స్టార్టప్ మొదలుపెట్టకండి. మీరు పరిష్కరించాలనుకుంటున్న 'సమస్య' ఏంటో స్పష్టంగా తెలుసుకోండి. దీని కోసం మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి:
- ఈ సమస్య తీవ్రత ఎంత? దీని వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు?
- ప్రస్తుతం ఆ సమస్యకు వారు వాడుతున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి?
- ఆ సమస్య వారి జీవితంలో ఎంత తరచుగా ఎదురవుతోంది?
దీనికోసం కస్టమర్ల ప్రపంచంలోకి వెళ్లండి. కేవలం సర్వేలు మాత్రమే కాకుండా, వారితో నేరుగా మాట్లాడండి. వారి ప్రవర్తనను గమనించండి. కొన్నిసార్లు వారు చెప్పే మాటల కంటే, వారు పడుతున్న ఇబ్బందులు మీకు గొప్ప ‘ఐడియా’ను ఇస్తాయి.
2. ప్రాథమిక పరీక్ష ముఖ్యం..
మీ ఐడియా బాగుందో లేదో తెలుసుకోవడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులను అడగకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని నొప్పించకూడదనే ఉద్దేశంతో 'బాగుంది' అని చెప్పే అవకాశం ఉంది. మీ టార్గెట్ కస్టమర్ల వద్దకు వెళ్లండి. సోషల్ మీడియాలో వచ్చే లైకులు చూసి మోసపోకండి. మీ ప్రాజెక్ట్ కోసం కస్టమర్ తన సమయాన్ని గానీ, డబ్బును గానీ వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నదే అసలైన విజయం.
3. కనీస వసతులతో మొదలుపెట్టండి..
మొదట్లోనే లక్షల రూపాయల ఖర్చుతో భారీ ఫీచర్లతో ప్రొడక్ట్ తయారు చేయకండి. 'మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్' (ఎంవీపీ) అంటే కనీస వసతులతో కూడిన వెర్షన్‌ను సిద్ధం చేయండి.
ఉదాహరణకు: నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎయిర్ బీఎన్బీ తొలినాళ్లలో.. ఫౌండర్లు తమ ఇంట్లోనే ఒక ఎయిర్ మ్యాట్రెస్ వేసి కేవలం ఒక్క అపార్ట్‌మెంట్‌తోనే మొదలుపెట్టారు. అపరిచితులు వేరే వాళ్ల ఇంట్లో ఉండటానికి డబ్బులు ఇస్తారా లేదా అని పరీక్షించడమే వారి ఉద్దేశం. అది వర్కవుట్ అయ్యాకే భారీ టెక్నాలజీని నిర్మించారు.
4. ఐడియా దొంగిలిస్తారనే భయం వద్దు..
చాలామంది తమ ఐడియాను ఎవరికీ చెప్పరు.. ఎవరైనా దొంగిలిస్తారేమో అని భయపడతారు. కానీ ఐడియా కేవలం ఒక ఆరంభం మాత్రమే. దాన్ని ఆచరణలో పెట్టే ‘ఎగ్జిక్యూషన్’లోనే అసలైన సత్తా ఉంటుంది. నలుగురితో చర్చించడం వల్ల మీకు తెలియని కొత్త విషయాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు మెరుగవుతాయి.
5. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి..
మీ బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? మీతో పాటు ప్రయాణించే కో-ఫౌండర్‌లో ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు అనుకుంటున్నారు? అనే విషయాలపై క్లారిటీ తెచ్చుకోండి. మీరు పరిష్కరిస్తున్న సమస్యకు, మీకు ఉన్న అనుభవానికి సంబంధం ఉందా? ఒకవేళ లేకపోతే, ఆ రంగానికి చెందిన నిపుణులను మీ టీమ్‌లో చేర్చుకోండి.
చివరిగా.. స్టార్టప్ ప్రయాణం అనేది నేర్చుకుంటూ సాగించే ఒక లాంగ్ జర్నీ. కస్టమర్ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే మీ పద్ధతులను మార్చుకుంటూ ముందుకు సాగండి. విద్యార్థి దశలోనే అడుగులు వేయడం మీకు భవిష్యత్తులో గొప్ప పాఠంగా మారుతుంది.
– గంగోత్రి వీ నాయక్, ఐడియా స్టేజ్ ఎంటర్పరెన్యూర్షిప్ అండ్ మెంటరింగ్, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


