ఆంత్రోపిక్ షేర్లు కొంటున్నారా? భారతీయ ఇన్వెస్టర్లకు అసలు ఖర్చు ఇదే

నాస్‌డాక్‌లో ఆంత్రోపిక్ (ANT) షేర్లు నేడు లిస్ట్ అవుతున్నాయి. ఐపీఓలో అవకాశం దక్కకపోయినా భారతీయ ఇన్వెస్టర్లు ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ షేర్లు కొనొచ్చు. అయితే షేర్ ధరతో పాటు ఫారెక్స్ ఛార్జీలు, 20% టీసీఎస్, పన్నుల భారం, రిస్కుల గురించి ముందే తెలుసుకోవాలి.

Published on: Nov 19, 2026, 14:24:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రపంచ ఏఐ రంగంలో సంచలనం సృష్టిస్తున్న 'క్లాడ్' (Claude) చాట్‌బాట్ సృష్టికర్త ఆంత్రోపిక్ (Anthropic) నేడు (నవంబర్ 19) అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ నాస్‌డాక్‌లో అడుగుపెడుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) షేర్ ధరను 83 డాలర్లుగా ఖరారు చేశారు. తొలుత ప్రకటించిన 70–78 డాలర్ల ధరల శ్రేణి కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. నాస్‌డాక్‌లో 'ఏఎన్‌టీ' (ANT) టిక్కర్ పేరుతో ఈ షేర్ల ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

ఆంత్రోపిక్ షేర్లు కొంటున్నారా? భారతీయ ఇన్వెస్టర్లకు అసలు ఖర్చు ఇదే
ఆంత్రోపిక్ షేర్లు కొంటున్నారా? భారతీయ ఇన్వెస్టర్లకు అసలు ఖర్చు ఇదే

ఆంత్రోపిక్ ఐపీఓలో నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు దక్కలేదు. కేవలం ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, స్విట్జర్లాండ్, యూకే సహా కొన్ని ఎంపిక చేసిన ఐరోపా దేశాల రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రమే సంస్థ ఈ అవకాశాన్ని పరిమితం చేసింది.

అయితే భారతీయులు ఆంత్రోపిక్ షేర్లను కొనడానికి ఎలాంటి నిషేధం లేదు. నాస్‌డాక్‌లో లిస్టింగ్ పూర్తయిన తర్వాత అర్హులైన భారతీయ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. కానీ విదేశీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం షేర్ ధర మాత్రమే కాకుండా అదనపు ఛార్జీలు, పన్నుల భారం కూడా ఉంటుంది.

లిస్టింగ్ తర్వాత ఆంత్రోపిక్ షేర్లు ఎలా కొనాలి?

భారతీయ నివాసితులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద అంతర్జాతీయ బ్రోకరేజీ వేదికల ద్వారా ఆంత్రోపిక్ సహా ఇతర యూఎస్ షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇంటరాక్టివ్ బ్రోకర్స్, వెస్టెడ్ ఫైనాన్స్, ఐఎన్‌డీమనీ (INDmoney) వంటి ప్లాట్‌ఫామ్‌లు భారతీయులకు విదేశీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఇందుకోసం ఇన్వెస్టర్లు ముందుగా ఆయా ప్లాట్‌ఫామ్‌లలో ఖాతా తెరిచి, కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం తమ భారతీయ బ్యాంక్ ఖాతా నుంచి విదేశీ బ్రోకరేజీ ఖాతాకు నగదు బదిలీ (రెమిటెన్స్) చేయాలి. ఖాతాలో డబ్బు జమ అయిన తర్వాత అమెరికన్ డాలర్లలో ఆంత్రోపిక్ షేర్లను కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

ఆర్బీఐ ఎల్ఆర్ఎస్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా భారతీయ నివాసితులు అమెరికా స్టాక్స్ సహా విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. నాస్‌డాక్‌లో ఆంత్రోపిక్ లిస్ట్ అయిన వెంటనే, ఎల్ఆర్ఎస్ నిబంధనలు, విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా), వర్తించే పన్ను నియమాలకు లోబడి భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనే అవకాశం ఉంది.

ఎల్ఆర్ఎస్ కింద ఒక భారతీయ నివాసి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 2,50,000 డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు. 2004 ఫిబ్రవరి 4న 25,000 డాలర్ల పరిమితితో ఆర్బీఐ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిమితిని సవరిస్తూ వచ్చింది.

పెట్టుబడి వెనుక దాగి ఉన్న అదనపు ఖర్చులు, టీసీఎస్

విదేశీ షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు షేర్ ధరతో పాటు పలు అదనపు ఖర్చులు ఉంటాయి. రూపాయలను డాలర్లలోకి మార్చేటప్పుడు ఎక్స్ఛేంజీ రేట్ స్ప్రెడ్‌లు (మార్పిడి రుసుములు), బ్రోకరేజీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు షేర్లు కొనేటప్పుడు ఒకసారి, అమ్మిన తర్వాత డబ్బును వెనక్కి తెచ్చుకునేటప్పుడు మరోసారి.. ఇలా రెండుసార్లు ఫారెక్స్ స్ప్రెడ్ భారాన్ని మోయాల్సి వస్తుంది. చిన్న మొత్తాల్లో లేదా స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టేవారి రాబడిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

దీనికి తోడు మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్) నిబంధనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడుల కోసం పంపే మొత్తం రూ. 10 లక్షలు దాటితే, ఆ అదనపు మొత్తంపై 20 శాతం టీసీఎస్ విధిస్తారు.

అయితే టీసీఎస్ అనేది శాశ్వత అదనపు ఖర్చు కాదు. ఇన్వెస్టర్లు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో ఈ మొత్తాన్ని తమ పన్ను బాధ్యతకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ పన్ను భారం కంటే ఎక్కువ టీసీఎస్ కట్ అయితే రీఫండ్ కింద వెనక్కి పొందవచ్చు. అయినప్పటికీ షేర్లు కొనే సమయంలో ముందస్తుగా ఎక్కువ నగదు సమకూర్చుకోవాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం పెరుగుతుంది.

లాభాలపై పన్నుల లెక్క ఎలా ఉంటుంది?

భారతీయ నివాసితులు యూఎస్ స్టాక్స్ కొనుగోలు చేసిన 24 నెలల తర్వాత విక్రయిస్తే, ఆ లాభాలపై భారత్‌లో 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) చెల్లించాలి. ఒకవేళ 24 నెలల లోపే షేర్లను అమ్మితే, ఆ లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణించి ఇన్వెస్టర్ ఆదాయపు పన్ను శ్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. డివిడెండ్లపై పడే పన్ను నిబంధనలు వీటికి వేరుగా ఉంటాయి.

మారకపు విలువ ఒడుదొడుకులు, యూఎస్ ఎస్టేట్ ట్యాక్స్ ముప్పు

భారతీయ ఇన్వెస్టర్లకు రూపాయి-డాలర్ మారకపు విలువ హెచ్చుతగ్గులు కీలకంగా మారతాయి. ప్రస్తుతం డాలర్ మారకం విలువ సుమారు రూ. 93.24 వద్ద కొనసాగుతోంది. రూపాయి బలహీనపడితే యూఎస్ షేర్ల కొనుగోలు మరింత ఖరీదవుతుంది. ఒకవేళ షేర్లు అమ్మిన తర్వాత డాలర్లను రూపాయల్లోకి మార్చుకునే సమయంలో రూపాయి బలపడితే, ఇన్వెస్టర్లకు వచ్చే నికర రాబడి తగ్గిపోతుంది. కరెన్సీ మార్పిడిపై బ్యాంకులు, ప్లాట్‌ఫామ్‌లు విధించే ఫారెక్స్ మార్కప్ ఛార్జీలు లావాదేవీల ఖర్చును మరింత పెంచుతాయి. ఉదాహరణకు, మీరు ఆంత్రోపిక్ షేర్లను ఒక డాలర్ ధరకు కొని, తిరిగి సరిగ్గా అదే ధరకు అమ్మినప్పటికీ ఫారెక్స్ స్ప్రెడ్‌లు, బ్రోకరేజీ ఛార్జీల వల్ల మీకు నష్టమే మిగులుతుంది.

మరోవైపు యూఎస్ ఎస్టేట్ ట్యాక్స్ గురించి కూడా భారతీయ ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాలి. విదేశీ ఆస్తులు వారసులకు బదిలీ అయ్యే సమయంలో ఈ పన్ను ప్రస్తావన వస్తుంది. ఆంత్రోపిక్ వంటి అమెరికాలో నమోదైన కంపెనీల షేర్లను యూఎస్ ఆస్తులుగా పరిగణిస్తారు. అమెరికా పౌరసత్వం లేదా నివాసం లేని విదేశీయులు మరణించినప్పుడు, వారి పేరిట ఉన్న యూఎస్ ఆస్తుల విలువ 60,000 డాలర్లు దాటితే ఎస్టేట్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ పన్ను రేటు 40 శాతం వరకు ఉండే అవకాశం ఉంది.

ఐపీఓ పత్రాల్లో ఆంత్రోపిక్ వెల్లడించిన రిస్కులు ఇవే..

పెట్టుబడి పెట్టే ముందు ఆంత్రోపిక్ తన ఐపీఓ ఫైలింగ్‌లో ప్రస్తావించిన తీవ్రమైన రిస్కులను ఇన్వెస్టర్లు విస్మరించకూడదు. "ఏఐ మోడళ్ల వల్ల ఏదైనా నష్టం జరిగితే ఏఐ కంపెనీలు ఊహించని చట్టపరమైన బాధ్యతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాలను అంచనా వేయడం కష్టమవుతుంది" అని ఆంత్రోపిక్ తన ప్రాస్పెక్టస్‌లో స్పష్టం చేసింది.

"ఏఐ బీమా మార్కెట్ ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీమా కవరేజీ భారీ విపత్తుల వల్ల కలిగే నష్టాల నుంచి కంపెనీలను రక్షించలేకపోవచ్చు," అని సంస్థ పేర్కొంది. కొత్తగా వస్తున్న ఏఐ చట్టాల వల్ల భద్రత, జవాబుదారీతనం, నిబంధనల అమలు విషయంలో కఠినమైన ఆంక్షలు ఎదురై కంపెనీ ఖర్చులు, కోర్టు కేసుల భారం పెరిగే ప్రమాదం ఉందని ఆంత్రోపిక్ అంగీకరించింది. అంచనా వేయడానికి, బీమా చేయడానికి వీలులేని ఇలాంటి రిస్కులను లెక్కగట్టి షేర్ విలువను నిర్ణయించడం ఇన్వెస్టర్లకు పెద్ద సవాలుగా మారనుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More