బ్యాంకుపై ఫిర్యాదు చేయాలా? ఆర్‌బీఐ ఆంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే ముందు ఈ 3 స్టెప్స్ తప్పనిసరి

బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థల సేవల్లో లోపాలుంటే ఆర్‌బీఐకి నేరుగా ఫిర్యాదు చేయలేరు. దీనికంటూ ఒక క్రమ పద్ధతిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించింది. ఆంబుడ్స్‌మన్‌ను కలవడానికి ముందు మీరు అనుసరించాల్సిన ఆ 3 కీలక దశలు ఇవే.

Published on: Mar 27, 2026, 18:17:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీ బ్యాంకు మీ సమస్యను పరిష్కరించడం లేదా? లోన్ విషయంలో కానీ, క్రెడిట్ కార్డు ఛార్జీల విషయంలో కానీ మీకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? అయితే వెంటనే ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసేయాలని అనుకుంటున్నారా? కాస్త ఆగండి! బ్యాంకు ఫిర్యాదుల పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పక్కా పద్ధతిని రూపొందించింది. ఆ ప్రక్రియను అనుసరించకుండా నేరుగా ఆర్‌బీఐని ఆశ్రయిస్తే మీ ఫిర్యాదు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం (REUTERS)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం (REUTERS)

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (NBFCs), క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్స్.. ఇలా ఏ ఆర్థిక సంస్థపై ఫిర్యాదు చేయాలన్నా ఆర్‌బీఐ సూచించిన ఈ 3 అంచెల విధానాన్ని పాటించడం తప్పనిసరి.

1. మొదటి అడుగు: సంబంధిత సంస్థకే ఫిర్యాదు

మీకు ఏ బ్యాంకుతో సమస్య ఉందో, ముందుగా ఆ బ్యాంకులోనే ఫిర్యాదు చేయాలి. సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకునే అవకాశం సదరు సంస్థకు కల్పించడం ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ముఖ్యం. దీనిని దాటవేసి నేరుగా పై అధికారులకు వెళ్లకూడదు.

2. రెండో అడుగు: రసీదు లేదా రిఫరెన్స్ నంబర్ తీసుకోవాలి

మీరు ఫిర్యాదు చేసిన వెంటనే దానికి సంబంధించిన 'అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్' లేదా 'రిఫరెన్స్ నంబర్' తప్పకుండా తీసుకోవాలి. మీరు ఫిర్యాదు చేశారనడానికి ఇదే ప్రధాన ఆధారం. మీ సమస్య ఏ దశలో ఉందో ట్రాక్ చేయడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

3. మూడో అడుగు: ఆర్‌బీఐ ఆంబుడ్స్‌మన్‌ను ఎప్పుడు కలవాలి?

మీరు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపు బ్యాంకు నుంచి ఎటువంటి స్పందన రాకపోయినా, లేదా వారు ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తికరంగా లేకపోయినా.. అప్పుడు మీరు ఆర్‌బీఐ ఆంబుడ్స్‌మన్‌‌ను ఆశ్రయించవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలి?

ఆంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

  • ఆన్‌లైన్ ద్వారా: ఆర్‌బీఐ వారి మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) పోర్టల్ https://cms.rbi.org.in సందర్శించి ఫిర్యాదు చేయవచ్చు.
  • తపాలా ద్వారా: సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (CRPC), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్టార్ 17, చండీగఢ్ - 160017 చిరునామాకు మీ ఫిర్యాదును పంపవచ్చు.

ముందుగా బ్యాంకును సంప్రదించకుండా నేరుగా ఆంబుడ్స్‌మన్‌కు పంపే ఫిర్యాదులను అనుమతించబోమని, అవి తిరస్కరణకు గురవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. నేను నేరుగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చా?

లేదు. ముందుగా మీరు సమస్య ఉన్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయాలి. వారు పరిష్కరించకపోతేనే ఆర్‌బీఐని సంప్రదించాలి.

2. బ్యాంకుకు ఫిర్యాదు చేశాక ఎంత కాలం ఆగాలి?

కనీసం 30 రోజులు వేచి చూడాలి. ఆ లోపు స్పందన రాకపోతే ఆంబుడ్స్‌మన్‌కు ఆశ్రయించవచ్చు.

3. ఆర్‌బీఐ హెల్ప్‌లైన్ నంబర్ ఏది?

బ్యాంకింగ్ ఫిర్యాదులకు సంబంధించిన సందేహాల కోసం మీరు 14448 నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా ఆర్‌బీఐ అవగాహన వెబ్‌సైట్ https://rbikehtahai.rbi.org.in/ ను చూడవచ్చు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More