వెనెజువెలాలో సంక్షోభం- ముడిచమురు ధరలపై ప్రభావం ఎంత? భారత్‌కు చిక్కులు తప్పవా?
వెనెజువెలాలో అమెరికా చేపట్టిన సైనిక చర్య ప్రపంచ చమురు మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడంతో గ్లోబల్ సప్లై చైన్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు భారత్ దిగుమతులను ఎలా ప్రభావితం చేస్తాయి? అన్న చర్చలు మొదలయ్యాయి.
ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. భారీ చమురు నిల్వలున్న వెనెజువెలాలో అమెరికా సైన్యం శనివారం మెరుపు దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ఈ 'రెజీమ్ ఛేంజ్' ఆపరేషన్ ఒక్కసారిగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక ముడిచమురు నిల్వలున్న దేశాల్లో ఒకటైన వెనెజువెలాలో నెలకొన్న ఈ అనిశ్చితి, గ్లోబల్ సప్లై చైన్‌ని ఎలా ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చమురు రంగంపై ట్రంప్ కన్ను!
ఈ సైనిక చర్య అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. "వెనెజువెలా చమురు రంగంలో అమెరికా ఇకపై చాలా బలంగా జోక్యం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన అమెరికన్ ఆయిల్ కంపెనీలు అక్కడ కీలక పాత్ర పోషిస్తాయి," అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రకటనతో వెనెజువెలా చమురు సంపదపై అమెరికా పట్టు బిగించనుందని స్పష్టమవుతోంది. అయితే, ఇంతటి ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల (శనివారం రాత్రి నాటికి) వద్ద నిలకడగానే ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితి ఏంటి?
అమెరికా దాడులు జరిగినప్పటికీ తమ చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయని వెనెజువెలా ప్రభుత్వ సంస్థ 'పీడీవీఎస్ఏ' తెలిపింది. ప్రధాన చమురు కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. అయితే, రాజధాని కారకాస్ సమీపంలోని లా గువైరా ఓడరేవు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
డిసెంబర్‌లో అమెరికా విధించిన ఆంక్షలు, చమురు నౌకల దిగ్బంధం కారణంగా ఇప్పటికే వెనెజువెలా ఎగుమతులు దెబ్బతిన్నాయి. దీనితో నిల్వలు పేరుకుపోయి, ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెనెజువెలా సంక్షోభం.. భారత్‌పై ప్రభావం ఎంత?
వెనెజువెలా పరిణామాలు భారత్‌కు అత్యంత కీలకం. చైనా తర్వాత వెనెజువెలా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటి.
2021-22లో అమెరికా ఆంక్షల వల్ల భారత్ దిగుమతులు దాదాపు సున్నాకి పడిపోయాయి. 2023-24లో తిరిగి పుంజుకుని, సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన చమురును భారత్ దిగుమతి చేసుకుంది.
2024లో భారత్ దిగుమతులు ఏకంగా 500 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) నివేదిక ప్రకారం, 2025లో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడొవ అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. అయితే గతేడాది ద్వితీయార్థం నుంచి పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, కఠినతరమైన ఆంక్షల వల్ల దిగుమతులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు వెనెజువెలాలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడంతో, రాబోయే రోజుల్లో భారత్‌కు చమురు సరఫరా, ధరల విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
'భారతీయులు జాగ్రత్తగా ఉండాలి..'
వెనెజువెలాపై అమెరికా దాడులు, ఆ దేశంలోని తాజా పరిణామాలపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ వెనెజువెలాలోని భారతీయులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు, ఆ దేశానికి ప్రయాణ ఆలోచనలను విరమించుకోవాలని పేర్కొంది.
“వెనెజువెలాలోని భారతీయులు తమ కదలికలను విరమించుకోవాలి. కారకాస్‌లోని భారతీయ రాయబారంతో టచ్‌లో ఉండాలి. ఈమెయిల్ ఐడీ cons.caracas@mea.gov.in. లేదా ఎమర్జెన్సీ నెంబర్ +58-412-9584288 తో సంప్రదించాలి,” అని భారత్ పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


