Hyundai Bayon : హ్యుందాయ్ నుంచి బిగ్ అప్డేట్- స్టైలిష్ బేయాన్ ఎస్​యూవీ బుకింగ్స్ షురూ..

హ్యుందాయ్ సంస్థ తమ సరికొత్త 'బేయాన్' క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ బుకింగ్‌లను భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానాన్ని దక్కించుకోనున్న ఈ కారు ఇంజిన్, డిజైన్, ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 23, 2026, 16:31:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో సరికొత్త ఎస్​యూవీని లాంచ్ చేసేందుకు​ సిద్ధమైంది. సబ్‌కాంప్యాక్ట్ ఎస్‌యూవీ 'వెన్యూ', పాపులర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ 'క్రెటా' మధ్య ఖాళీని పూరించేందుకు ‘బేయాన్’ పేరుతో ఒక కొత్త క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీని తీసుకొస్తోంది. వచ్చే నెలలో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ కారు కోసం హ్యుందాయ్ ఇప్పుడు ప్రీ- బుకింగ్స్​ని ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ బుకింగ్స్ షురూ..
హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ బుకింగ్స్ షురూ..

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్, క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో హ్యుందాయ్ తీసుకొస్తున్న బేయాన్, మార్కెట్లో మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ వంటి వాహనాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ- స్పోర్టీ లుక్, ఆకట్టుకునే డిజైన్..

బేయాన్ ఎస్‌యూవీ సాధారణ బాక్సీ టైప్ డిజైన్ కాకుండా స్పోర్టీ క్రాస్‌ఓవర్ లుక్‌తో వస్తోంది. వాహనం ముందు భాగంలో హెచ్-షేప్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు పైభాగంలో, ప్రధాన హెడ్‌లాంప్‌లు బంపర్‌కు కాస్త కిందగా అమర్చిన స్ల్పిట్-హెడ్‌లాంప్ సెటప్‌ను ఇచ్చారు. దృఢమైన స్కిడ్ ప్లేట్‌తో ఫ్రంట్ లుక్ రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తుంది.

పక్కవైపు నుంచి చూస్తే, సీ-పిల్లర్ వద్ద ప్రత్యేకమైన కర్వ్స్, రూఫ్ రైల్స్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చ్‌లు, పల్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో ముందు లైట్లను ప్రతిబింబించేలా సన్నని ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్‌ను అమర్చారు. ఈ కారు మొత్తం పొడవు సుమారు 4,200 ఎంఎం వరకు ఉంటుంది.

హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీ- అధునాతన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లు!

ఎస్​యూవీ క్యాబిన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించిన నాలుగో తరం ఐ20 డిజైన్ ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. డ్యాష్‌బోర్డ్‌పై డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలు కలిసి ఉండే ట్విన్-స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఎస్​యూవీ ఏసీ కంట్రోల్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కన్సోల్, నిలువుగా ఉండే ఎయిర్ వెంట్స్, స్టీరింగ్ వీల్‌పై ప్రత్యేక ఫోర్-డాట్ మోటిఫ్ వంటివి ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో ఈ కారును తీర్చిదిద్దారు.

హ్యుందాయ్ బేయాన్- శక్తివంతమైన ఇంజిన్..

హ్యుందాయ్ బేయాన్ 1.5-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. దీనిని క్రెటాలో ఉపయోగించే ఇంజిన్ ప్రాతిపదికగానే రూపొందించారు. మ్యాన్యువల్, ఆటోమేటిక్ (సీవీటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.

ఇంధన పొదుపు కోరుకునేవారి కోసం కంపెనీ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ మోడల్‌ను కూడా అందించనుంది. బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) తగ్గకుండా కారు అండర్‌బాడీ (కింది భాగం) లో సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చడం దీని ప్రధాన ప్రత్యేకత.

హ్యుందాయ్ బేయాన్ ఎస్​యూవీకి సంబంధించిన లాంచ్ డేట్, ధర, ఇతర ఫీచర్ల వివరాలపై సంస్థ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More