Smit Machchhar : ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్ఛార్‌తో మోదీ వీడియో కాల్
మిడ్-ఎయిర్ కలకలం సమయంలో తీవ్రగాయాలైనా వెనకడుగు వేయకుండా 170 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్ మాట్లాడారు. ఆయన సాహసాన్ని కొనియాడిన ప్రధాని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆకాశంలో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డ వేళ, తీవ్రగాయాలైనా వెనకడుగు వేయకుండా సమయస్ఫూర్తితో ఘోర విపత్తును అడ్డుకున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నేరుగా వీడియో కాల్ మాట్లాడారు. ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి విమానాన్ని సురక్షితంగా నిలబెట్టిన ఆయన ధైర్యసాహసాలను మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

"నేను ధైర్యం చేయకపోతే 170 మంది ప్రాణాలు పోయేవి"
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆ ఘోర క్షణాల్లో తనకు ఎదురైన అనుభవాన్ని కెప్టెన్ స్మిత్ ప్రధానికి వివరించారు. "నా ప్రాణాల కోసం నేను పోరాడుతున్న క్షణాల్లో.. నేను గనుక ధైర్యం ప్రదర్శించకపోతే విమానంలో ఉన్న 170 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారని గ్రహించాను. అందుకే ప్రాణాలకు తెగించి ఆ పని చేశాను," అని స్మిత్ ప్రధాని మోదీతో పేర్కొన్నారు.
“నేను పాజిటివ్‌గా ఉంటాను. అవకాశం దొరికినప్పుడల్లా హనుమాన్ చాలీసా చదువుతాను. ఘటన సమయంలోనూ హనుమాన్ చాలీసా జపించాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయన (హనుమంతుడు) దేవుడే కాదు, నా రక్షకుడు అని,” స్మిత్ తెలిపారు.
అంతకుముందు గురువారం స్మిత్ భార్య, తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన ప్రధాని.. యూఏఈలోని భారత దౌత్య కార్యాలయాల నుంచి స్మిత్ కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
'9/11 తరహా తీవ్రవాద ఘోరాన్ని అడ్డుకున్న భారతీయుడు'
దిల్లీలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ, కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన సాహసాన్ని కొనియాడారు. "నిన్న (బుధవారం) జరిగిన ఘటనలో మన దేశానికి చెందిన కెప్టెన్ స్మిత్ అద్భుతమైన సమయస్ఫూర్తి, ధైర్యం కనబరిచారు. ఇజ్రాయెల్ ప్రధాని చెప్పినట్లుగా, ఒక భారతీయుడు 9/11 తరహా ఘోర విపత్తును నివారించారు," అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా కూడా స్మిత్‌ను నిజమైన హీరో అభివర్ణించిన మోదీ, "ఘోర ప్రమాదం ముంచుకొస్తున్న వేళ తీవ్రంగా గాయపడినప్పటికీ, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే ఆయన నిశ్చయంతో విరోచితంగా పోరాడారు. వందలాది ప్రాణాలను కాపాడిన స్మిత్ పట్ల భారతదేశం గర్విస్తోంది," అని రాసుకొచ్చారు.
నిమిషానికి 23,000 అడుగుల కిందకు పడిపోయిన విమానం!
ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానంలో బుధవారం ఆకాశంలోనే ఊహించని ఘర్షణ చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో కో-పైలట్.. విమానాన్ని కూల్చేందుకు కట్ర పన్నాడు. ఆ సమయంలో అతనితో జరిగిన ఘర్షణలో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో దాదాపు 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా నిమిషానికి 23,000 అడుగుల చొప్పున వేగంగా కిందకు పడిపోతూ 15,600 అడుగుల ఎత్తుకు చేరింది. తీవ్రమైన నొప్పులు ఉన్నప్పటికీ స్మిత్ సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేయడంతో, విమాన సిబ్బంది, ప్రయాణికులు లోపలికి ప్రవేశించి కో-పైలట్‌ను అదుపులోకి తెచ్చారు. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది.
13 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ పైలట్..
కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ వాణిజ్య విమానయాన రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సుదీర్ఘ అనుభవజ్ఞుడు. ఇప్పటివరకు ఆయన 9,750 గంటలకు పైగా విమానాలు నడిపారు. ఎక్కువగా బోయింగ్ 737 రకం విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు ఆయన 11 సంవత్సరాల పాటు భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా సేవలు అందించారు.
కాగా, బుధవారం నాటి ఘటన అనంతరం ఫ్లైదుబాయ్ సంస్థ ఇజ్రాయెల్‌కు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


