...
...
Next Story

బ్యాంక్ జాబ్స్: 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలెక్షన్ (IBPS) 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Published on: Aug 3, 2026, 10:40:16 IST
Advertisement

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA - క్లర్క్) పోస్టుల భర్తీ కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తగిన అర్హతలున్న అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు తేదీలు - ముఖ్యమైన సమాచారం

బ్యాంక్ జాబ్స్: 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్
బ్యాంక్ జాబ్స్: 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 1న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఆగస్టు 21ని చివరి తేదీగా నిర్ణయించారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. ఇక ప్రాథమిక (Prelims) పరీక్షలు అక్టోబరు 2026లో జరగనున్నాయి.

అర్హతలు, వయోపరిమితి

కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదేని విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకునే సమయానికే అభ్యర్థి వద్ద వ్యాలిడ్ మార్కుల జాబితా లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా, ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించేటప్పుడు డిగ్రీలో వచ్చిన మార్కుల శాతాన్ని కచ్చితంగా పొందుపరచాలి.

వయోపరిమితి విషయానికొస్తే.. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 02.08.1998 కంటే ముందు, 01.08.2006 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు (ఈ రెండు తేదీలు కూడా వర్తిస్తాయి).

దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ, ఇతరులకు ఐబీపీఎస్ దరఖాస్తు ఫీజును రూ.850గా నిర్ణయించారు. అదేవిధంగా ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwBD), మాజీ సైనికోద్యోగులకు (ESM/DESM) ఫీజు రూ.175గా నిర్దేశించారు.

ఎంపిక విధానం, పరీక్ష తీరు

ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు (1 గంట). ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు ఉంటాయి.

ఐబీపీఎస్ నిర్ణయించిన కటాఫ్ మార్కులను ప్రతి విభాగంలోనూ సాధించాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.

నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 (పావు) వంతు మార్కుల కోత విధిస్తారు. సమాధానం గుర్తించని ప్రశ్నలకు ఎలాంటి పెనాల్టీ ఉండదు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

  • ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించాలి.
  • హోమ్ పేజీలో కనిపించే 'IBPS Clerk Registration' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలు నమోదు చేసి ప్రాథమిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాలి.
  • మీ కేటగిరీకి సంబంధించిన దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ బ్యాంకింగ్/కార్డ్ ద్వారా చెల్లించాలి.
  • వివరాలన్నీ సరి చూసుకుని సబ్మిట్ బటన్ నొక్కి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి.

సమగ్ర నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe