ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై రాహుల్ నిప్పులు: ఉద్యోగాలకు ముప్పుపై ఆందోళన
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను నిరసిస్తున్న ఉద్యోగులకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దవుతాయని, ఉద్యోగ భద్రత కోల్పోతారని హెచ్చరిస్తూ ఉద్యోగులకు లేఖ రాశారు. పార్లమెంటరీ సమీక్ష నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) మెజారిటీ వాటాలను ప్రైవేట్ సంస్థకు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో అక్టోబర్ 29న బ్యాంక్ ఉద్యోగులకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల బాట పట్టించిన ఉద్యోగుల శ్రమను పక్కనపెట్టి, బ్యాంకును ప్రైవేట్ పరం చేయడం వెనుక గల కారణాలను రాహుల్ ప్రశ్నించారు.
"ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి వెళితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్ హక్కులు తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే బలహీనపడిన సర్వీసు నిబంధనలు తమ చివరి రక్షణ కవచాన్ని కూడా కోల్పోతాయి" అని రాహుల్ గాంధీ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేసి, పార్లమెంటరీ పర్యవేక్షణలో సమగ్ర సమీక్ష చేపట్టాలని 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్' డిమాండ్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ లేఖ విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లాభాల్లోకి తెచ్చినా ప్రైవేటీకరణేనా?
ఏడేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును పునర్నిర్మించడంలో ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయమని రాహుల్ గాంధీ కొనియాడారు. గతేడాది ఈ బ్యాంక్ రూ. 9,000 కోట్లకు పైగా నికర లాభాన్ని గడించిందని ఆయన గుర్తు చేశారు. అంతటి ఘనమైన ఆర్థిక పురోగతిని సాధించిన ప్రభుత్వ రంగానికి చెందిన సుదృఢమైన సంస్థను విదేశీ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా 2003లో పార్లమెంట్లో ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ మాట్లాడుతూ, ఐడీబీఐలో ప్రభుత్వ వాటా కనీసం 51 శాతం తగ్గకుండా చూస్తామని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత విక్రయ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ మెజారిటీ వాటాలను భారీగా తగ్గించుకుని, యాజమాన్య హక్కులను ప్రైవేట్ కొనుగోలుదారుకు అప్పగిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఉద్యోగుల ఆందోళన
కెనడాకు చెందిన బిలియనీర్ ప్రేమ్ వత్సకు చెందిన 'ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్' (Fairfax Financial Holdings) అనుబంధ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ మెజారిటీ వాటాలను విక్రయించడాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ తీవ్రంగా ఖండించింది. ఈ విక్రయ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఫోరమ్ కన్వీనర్ దేవిదాస్ తుల్జాపూర్కర్ వ్యాఖ్యానించారు.
బ్యాంకుకు ఉన్న ఆస్తులు, సంస్థాగత సామర్థ్యం, కస్టమర్లతో ఉన్న బంధం, భవిష్యత్ రాబడులు, వ్యూహాత్మక ప్రాముఖ్యతను సరిగ్గా లెక్కించకుండా తక్కువ ధరకు కట్టబెడుతున్నారనే ఆందోళనను ఫోరమ్ వ్యక్తం చేసింది. బ్యాంక్ ఆస్తులు, రియల్ ఎస్టేట్ మూల్యాంకన పద్ధతులను (Valuation Methodology), ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఈ ధరకు అంగీకరించిందో బహిర్గతం చేయాలని కోరింది. అలాగే కొనుగోలుదారు యజమాన్య వ్యవస్థ, ఆర్థిక సామర్థ్యం, రెగ్యులేటరీ రికార్డులను పారదర్శకంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
"ఒక ప్రముఖ భారతీయ బ్యాంక్ యాజమాన్య బదిలీలో ప్రజలకు జవాబుదారీతనం వహించడానికి కేవలం నిబంధనల ఆమోదాలు సరిపోవు" అని ఫోరమ్ స్పష్టం చేసింది. ఐడీబీఐని బ్యాంకింగ్ కంపెనీగా మార్చినప్పుడు ఇచ్చిన హామీకి, ప్రస్తుత విక్రయ నిర్ణయానికి ఉన్న పొంతనపై ప్రభుత్వం పార్లమెంట్‌కు, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
రిజర్వేషన్లు, ఉద్యోగ భద్రతపై ప్రభావం
ఈ విక్రయ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థ సామాజిక బాధ్యతలపై, ఉద్యోగుల సేవా నిబంధనలపై, రిజర్వేషన్ విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రస్తుతం మొత్తం 19,108 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు 9,500 మంది ఉన్నారు. వీరితో పాటు 6,911 మంది మహిళా ఉద్యోగులు, 884 మంది దివ్యాంగులు బ్యాంకులో సేవలు అందిస్తున్నారు.
ప్రైవేట్ యాజమాన్యానికి బాధ్యతలు అప్పగించే ముందే వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత, వర్తించే సేవా నిబంధనలు, ఆర్థిక చేరిక (Financial Inclusion) వంటి సామాజిక బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
రూ. 52,878 కోట్ల విక్రయ డీల్ వివరాలు
అక్టోబర్ 14న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐడీబీఐ బ్యాంకులోని 60.72 శాతం నియంత్రణ వాటాను విక్రయించేందుకు ఆమోదం లభించింది. ఈ లావాదేవీ మొత్తం విలువ రూ. 52,878 కోట్లు (సుమారు 5.56 బిలియన్ డాలర్లు). ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తనకున్న 30.48 శాతం వాటాను (సుమారు రూ. 26,620 కోట్లు), ఎల్ఐసీ తనకున్న 30.24 శాతం వాటాను (సుమారు రూ. 26,440 కోట్లు) కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థకు విక్రయించనున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


