IIT Bombay : ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. యాజమాన్యం క్షమాపణలు, ప్రొఫెసర్ సస్పెన్షన్!
ఐఐటీ బాంబేలో దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థుల భారీ ఆందోళనల నడుమ ఐఐటీ యాజమాన్యం తన తొందరపాటు ప్రకటనపై క్షమాపణలు చెప్పడమే కాకుండా, వివాదంలో ఉన్న ప్రొఫెసర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ అనే దళిత విద్యార్థి శుక్రవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడటం, విద్యాసంస్థ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తడం, యాజమాన్యం తీరుపై విమర్శలు రావడంతో ఐఐటీ బాంబే పాలకవర్గం దిగివచ్చింది.

క్షమాపణలు చెప్పిన ఐఐటీ యాజమాన్యం!
విద్యార్థి మృతికి సంబంధించిన కారణాలపై స్పష్టత రాకముందే తొందరపడి ప్రకటన విడుదల చేసినందుకు ఐఐటీ బాంబే యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పింది.
"సాహిల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై మేము అంతకుముందు విడుదల చేసిన ప్రకటనలో ఉన్న వివరాలకు క్షమాపణలు కోరుతున్నాం. పోలీసుల విచారణ పూర్తి కాకుండానే ఘటనకు సంబంధించిన కారణాలను అధికారికంగా విశ్లేషించడం సరికాదు," అని సంస్థ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.
ఇదే సమయంలో ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే తన పదవికి రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను ఫేక్ న్యూస్‌గా ఖండించింది.
కాగా ఐఐటీ బాంబేలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ ఫిబ్రవరి నుంచి ఇది 3వ ఘటన్!
ప్రొఫెసర్ సస్పెన్షన్.. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు విచారణ!
బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐఐటీ మాజీ డీన్, ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాతో పాటు మరికొందరిపై తీవ్రమైన కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా దర్యాప్తును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి ఈ కేసు విచారణకు నేతృత్వం వహిస్తున్నారు.
కుల వివక్ష ఆరోపణలు.. నిరసనజ్వాలలు!
క్యాంపస్‌లో తమ కుమారుడు తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్నాడని, ప్రొఫెసర్ల ఒత్తిడి వల్లే ప్రాణాలు తీసుకున్నాడని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ అతడు ఈ విషయమై తమతో మాట్లాడాడని చెప్పారు.
మరోవైపు క్యాంపస్‌లో విద్యార్థులు గత మూడు రోజులుగా భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌తో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులు 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
మరోవైపు, పరీక్షలో చాట్‌జీపీటీ ద్వారా సహాయం పొందుతూ దొరికిపోయాడనే ఆరోపణలు వచ్చినా, విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఐఐటీ యాజమాన్యం వాదిస్తోంది. ఘటన స్థలంలో ఎలాంటి డెత్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
ప్రొఫెసర్‌కు మద్దతుగా కొందరు విద్యార్థులు..
ఈ వివాదంలో సరికొత్త మలుపుగా ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరు విద్యార్థులు, టీచర్లు సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాకు మద్దతుగా నిలిచారు. ఆయనపై వచ్చిన కుల వివక్ష ఆరోపణల్లో నిజం లేదని, మీడియా అసత్య ప్రచారం చేస్తోందని విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కాగా, ఎస్సీ/ఎస్టీ సెల్‌కు సదరు విద్యార్థి నుంచి ఎలాంటి ముందస్తు ఫిర్యాదు రాలేదని ఐఐటీ స్పష్టం చేసింది.
దేశంలోని అగ్రగామి విద్యాసంస్థల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కుల వివక్ష ఆరోపణలు ఉన్నత విద్యా వ్యవస్థ తీరుతెన్నులపై మళ్లీ ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


