IMD : జమ్ముకశ్మీర్​ నుంచి అండమాన్ వరకు.. దేశవ్యాప్తంగా ఇక భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అండమాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ రాబోయే రోజుల్లో వర్ష ప్రభావం పెరగనుంది. ఆ వివరాలు..

Published on: Sep 17, 2026, 14:02:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా వాతావరణ సరళి మళ్లీ మారుతోంది. రానున్న కొన్ని రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షపాతం తీవ్రత మరీ ఎక్కువగా ఉండనుందని అధికారులు స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా పెరగనున్న వర్షాల ప్రభావం.. (PTI)
దేశవ్యాప్తంగా పెరగనున్న వర్షాల ప్రభావం.. (PTI)

తెలుగు రాష్ట్రాలపై వర్ష ప్రభావం..

దక్షిణ భారతదేశంలోనూ రాబోయే రోజుల్లో వానల తీవ్రత పెరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 19 నుంచి 22వ తేదీ మధ్య పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్​లో రానున్న రోజుల్లో వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉండటంతో చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

మధ్య, తూర్పు భారతంలో దంచికొట్టనున్న వానలు!

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల్లో వానలు ఉధృతంగా పడే అవకాశాలున్నాయి. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో, తూర్పు మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో భారీ వర్షాలు పడవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో సెప్టెంబర్ 19 నుంచి 22 మధ్య చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు.

అటు తూర్పు భారతదేశంలో ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా తడిసిముద్ద కానున్నాయి. ఒడిశాలో సెప్టెంబర్ 19 నుంచి 22 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి.

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోనూ అదే హోరు..

ఉత్తర భారతదేశంలో జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈశాన్య భారతంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో సెప్టెంబర్ 19 వరకు భారీ వర్ష హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.

బుధవారం రాత్రి వరకు (24 గంటల వ్యవధిలో) సిక్కింలో ఏకంగా 30 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో, అసోంలో 12 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.

ఇప్పటికీ 15 శాతం వర్షపాతం లోటు!

ఈ ఏడాది జూన్ 4న ప్రారంభమైన నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కంటే తక్కువ వానలే పడ్డాయి. సెప్టెంబర్ 16 నాటికి సాధారణంగా 801.5 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 682 ఎంఎం మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం వర్షపాతం లోటు నెలకొంది. ఎల్​నినో ప్రభావం దీనికి కారణం అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

రాబోయే ఏడు రోజుల్లో కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయడానికి తోడ్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More