IND vs SA : ఒక్క ఓటమితో తలకిందులైన సమీకరణాలు.. భారత్ సెమీస్ చేరాలంటే ఇక అద్భుతం జరగాల్సిందేనా!

సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీనితో సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెట్ రన్ రేట్ కూడా ఇప్పుడు కీలకం కానుంది.

Published on: Feb 23, 2026, 06:00:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ 2026లో భారత అభిమానులకు షాకిస్తూ టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆశలు ప్రమాదంలో పడ్డాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. దీనితో పాయింట్లు రాకపోవడమే కాదు, నెట్​ రన్​ రేట్​ కూడా దెబ్బతింది. ఫలితంగా సెమీస్ రేసులో నిలవాలంటే భారత్ ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన 'డూ ఆర్ డై' పరిస్థితికి చేరుకుంది.

సూర్యకుమార్​ యాదవ్​.. (AFP)
సూర్యకుమార్​ యాదవ్​.. (AFP)

బౌలర్లు రాణించినా.. బ్యాటర్ల వైఫల్యం

ఆదివారం జరిగిన మ్యాచ్​లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో రాణించగా, యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ 45 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో 3 వికెట్లు (3/15) తీసి ఆకట్టుకున్నాడు.

అయితే, 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కనీసం పోరాటం కూడా చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ (4 వికెట్లు) ధాటికి భారత టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఏ దశలోనూ భారత బ్యాటర్లు లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. ఒకానొక సందర్భంలో సౌతాఫ్రికా ఫీల్డర్లకు భారత బ్యాటర్లు క్యాచింగ్​ ప్రాక్టీస్​ చేయిస్తున్నట్టు పరిస్థితి మారింది! చివరకు టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ కావడంతో పరాజయం తప్పలేదు.

ఈ ఓటమితో టీమిండియా సూపర్​ 8 గ్రూప్​ 1లో ఖాతా తెరవకపోవడమే కాదు, నెట్​ రన్ ​రేట్​ (-3.80) విషయంలోనూ దారుణంగా వెనకపడింది.

టీ20 వరల్డ్​ కప్​- ఇండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి? సమీకరణాలు..

ఈ ఓటమి తర్వాత భారత్ టీ20 వరల్డ్​ కప్​ 2026 సెమీఫైనల్ చేరడం ఇప్పుడు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఇవే:

సందర్భం 1 - రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే:

భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (వెస్టిండీస్, జింబాబ్వేలపై) ఖచ్చితంగా గెలవాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరుతాయి. అయితే, ఒకవేళ మరో రెండు జట్లు కూడా 4 పాయింట్లతో సమానంగా ఉంటే.. అప్పుడు మెరుగైన 'నెట్ రన్ రేట్' ఉన్న జట్టే సెమీస్‌కు వెళుతుంది. ప్రస్తుతం భారత్ రన్ ​రేట్ మైనస్‌లో ఉండటం ఆందోళన కలిగించే విషయం.

సందర్భం 2 - ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే:

ఒకవేళ భారత్ కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచి, 2 పాయింట్లతో నిలిస్తే.. అప్పుడు దక్షిణాఫ్రికా తన మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలని మనం కోరుకోవాలి. అలాగే వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్ విజేతను భారత్ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, వెస్టిండీస్, జింబాబ్వే తలో 2 పాయింట్లతో నిలుస్తాయి. ఇక్కడ కూడా రన్ రేట్ ద్వారానే విజేతను నిర్ణయిస్తారు.

సూపర్​ 8 గ్రూప్​ 1లో భారత్​కు మిగిలిన మ్యాచులు :-

ఫిబ్రవరి 26: భారత్ వర్సెస్​ జింబాబ్వే (చెన్నై)

మార్చి 1: భారత్ వర్సెస్​ వెస్టిండీస్ (కోల్‌కతా)

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత జట్టు ఒత్తిడిలో ఉంది. చెన్నైలో జరగబోయే జింబాబ్వే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధిస్తేనే రన్ రేట్ మెరుగుపడే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More