స్టాక్ మార్కెట్‌లో ఇండెక్స్ ట్రేడింగ్: తక్కువ రిస్క్‌తో లాభాలు పొందే స్మార్ట్ మార్గం

స్టాక్ మార్కెట్‌లో విడివిడి షేర్లలో పెట్టుబడి పెట్టడం కంటే ఇండెక్స్ ట్రేడింగ్ చేయడం సురక్షితమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఒకే కంపెనీపై ఆధారపడే ప్రమాదం తగ్గడమే కాకుండా పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం లభిస్తుందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహన్ వివరించారు. 

Published on: Aug 14, 2026, 11:47:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనగానే ఏదో ఒక నిర్దిష్ట కంపెనీ షేర్లను కొనడం లేదా అమ్మడం మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే మార్కెట్ ట్రెండ్‌ను పట్టుకోవడానికి, విస్తృతమైన అవకాశాలను ఒడిసిపట్టుకోవడానికి మరొక అద్భుతమైన మార్గం ఉంది. దాన్నే 'ఇండెక్స్ ట్రేడింగ్' (Index Trading) అంటారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారికైనా, అనుభవజ్ఞులైన ట్రేడర్లకైనా విడివిడి షేర్లపై పందెం కాయడం కంటే ఇండెక్స్ ట్రేడింగ్ చేయడం వల్ల రిస్క్, ఒడుదొడుకులు గణనీయంగా తగ్గుతాయి.

స్టాక్ మార్కెట్‌లో ఇండెక్స్ ట్రేడింగ్: తక్కువ రిస్క్‌తో లాభాలు పొందే మార్గం
స్టాక్ మార్కెట్‌లో ఇండెక్స్ ట్రేడింగ్: తక్కువ రిస్క్‌తో లాభాలు పొందే మార్గం

ఒకే కంపెనీ షేర్లపై పందెం కాయకుండా మొత్తం మార్కెట్ లేదా ఒక నిర్దిష్ట రంగాన్ని అంచనా వేయడానికి ఇండెక్స్ ట్రేడింగ్ అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యూహం.

ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి?

ఎన్‌ఎస్‌ఈ (NSE), బిఎస్‌ఈ (BSE) వంటి ఎక్స్ఛేంజీలలో ఉండే నిఫ్టీ 50 (Nifty 50), సెన్సెక్స్ (Sensex), బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty) లేదా సెక్టోరల్ ఇండెక్సుల ఆధారంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కొనుగోలు లేదా విక్రయం చేయడాన్నే ఇండెక్స్ ట్రేడింగ్ అంటారు. ఇవి ఒక సమూహానికి చెందిన షేర్ల మొత్తం పనితీరును ప్రతిబింబిస్తాయి.

ఉదాహరణకు, నిఫ్టీ 50 పెరుగుతుందని భావిస్తే నిఫ్టీ ఫ్యూచర్స్ లేదా కాల్ ఆప్షన్స్ (Call Options) కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోతుందని అంచనా వేస్తే ఫ్యూచర్స్‌ను షార్ట్ చేయడమో లేదా పుట్ ఆప్షన్స్ (Put Options) కొనుగోలు చేయడమో చేయవచ్చు.

ఇండెక్స్ ట్రేడింగ్ ఎలా పనిచేస్తుంది?

ఎక్స్ఛేంజీలలో లభించే ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ద్వారా ఈ వ్యాపారం సాగుతుంది.

ఇండెక్స్ ఫ్యూచర్స్: రాబోయే తేదీలో నిర్ణీత ధరకు ఇండెక్స్‌ను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి చేసుకునే ఒప్పందాలు.

ఇండెక్స్ ఆప్షన్స్: గడువు తీరేలోపు నిర్ణీత ధరకు ఇండెక్స్‌ను కొనుగోలు చేసే లేదా అమ్మే హక్కును కల్పించే ఒప్పందాలు (ఇందులో కచ్చితంగా కొనాలనే నిబంధన ఉండదు).

ఈ కాంట్రాక్టులు పూర్తి పారదర్శకంగా, నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో సాగుతాయి. ఇండెక్స్‌ను భౌతికంగా డెలివరీ చేయడం వీలుకాదు కాబట్టి ఇవి కేవలం నగదు రూపంలోనే సెటిల్ (Cash-settled) అవుతాయి.

ఇండెక్స్ ట్రేడింగ్ ఎందుకు ఎంచుకోవాలి?

సాధారణ ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఇండెక్స్ ట్రేడింగ్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

పోర్ట్‌ఫోలియో వైవిధ్యం (Diversification): ఒకే కంపెనీలో వచ్చే నష్టాల భయం ఉండదు. ఇండెక్స్‌లోని ఏదైనా ఒక షేరు పడిపోయినా, మిగిలిన షేర్ల రాబడి దానిని భర్తీ చేస్తుంది.

అధిక లిక్విడిటీ (Liquidity): నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కావలసిన ధర వద్ద సులువుగా ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి.

తక్కువ వ్యయం (Cost Efficiency): అనేక కంపెనీల షేర్లను విడివిడిగా కొనడానికి అయ్యే లావాదేవీల ఖర్చుతో పోలిస్తే ఇండెక్స్ ట్రేడింగ్‌లో చార్జీలు తక్కువ.

మార్కెట్ సెంటిమెంట్‌ను ఒడిసిపట్టడం: దేశీయ ఆర్థిక పరిస్థితులు, ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ విధానాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలకు అనుగుణంగా మార్కెట్ దిశను అంచనా వేయవచ్చు.

వలటైలిటీ వ్యూహాలు: మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్, స్ప్రెడ్స్ వంటి వ్యూహాలతో ఆప్షన్స్ ట్రేడర్లు మంచి లాభాలు పొందవచ్చు.

పరిగణనలోకి తీసుకోవాల్సిన రిస్కులు

ఇండెక్స్ ట్రేడింగ్‌లో లాభాలతో పాటు కొన్ని కీలక రిస్క్‌లు కూడా ఉన్నాయి.

లివరేజ్ రిస్క్ (Leverage Risk): ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లివరేజ్ సాధనాలు. మార్కెట్ అనుకూలిస్తే లాభాలు ఎంత ఎక్కువగా ఉంటాయో, ప్రతికూలంగా మారితే నష్టాలు కూడా అంతే వేగంగా ఉంటాయి.

ఎక్స్‌పైరీ ఒత్తిడి (Expiry Pressure): డెరివేటివ్ కాంట్రాక్టులకు వారం లేదా నెలాఖరు గడువు (Expiry) ఉంటుంది. కాబట్టి టైమింగ్ సరిగ్గా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది.

మ్యాక్రో ఎకనామిక్ ప్రభావం: గ్లోబల్ వార్తలు, ముడిచమురు ధరలు, వడ్డీ రేట్ల మార్పుల వల్ల ఇండెక్స్‌లలో అకస్మాత్తుగా తీవ్రమైన మార్పులు రావచ్చు.

ప్రాచుర్యం పొందిన ట్రేడింగ్ వ్యూహాలు

మార్కెట్ నిపుణులు ప్రధానంగా ఈ కింది వ్యూహాలను ఉపయోగిస్తుంటారు.

ట్రెండ్ ఫాలోయింగ్ (Trend Following): చార్ట్‌లలో మూవింగ్ యావరేజెస్, బ్రేక్‌అవుట్ ప్యాటర్న్స్ ఆధారంగా ట్రేడింగ్ చేయడం.

హెడ్జింగ్ (Hedging): మార్కెట్ పతనమయ్యే సమయంలో తమ వద్ద ఉన్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఇండెక్స్ డెరివేటివ్స్‌ను వాడటం.

ఆప్షన్ స్ప్రెడ్స్ (Option Spreads): బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్ వంటి పద్ధతుల ద్వారా రిస్క్‌ను పరిమితం చేసుకోవడం.

వార్తల ఆధారిత ట్రేడింగ్ (News-Based Trading): కేంద్ర బడ్జెట్, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల ప్రకటనలు లేదా అంతర్జాతీయ పరిణామాల సమయంలో వచ్చే స్వల్పకాలిక హెచ్చుతగ్గుల ద్వారా లాభపడటం.

వ్యాసకర్త:

- శ్రీకాంత్ చౌహాన్

ఈక్విటీ రీసెర్చ్ హెడ్,

కోటక్ సెక్యూరిటీస్

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More