సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఇండియన్ టీమ్ ఇదే.. గిల్, హార్దిక్ వచ్చేశారు.. బుమ్రా కూడా..
సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల టీమ్ ఇండియాను ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఈ జట్టులోకి శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, బుమ్రాలాంటి వాళ్లు తిరిగి వచ్చారు. ఆ టీమ్ తో రెండో వన్డే జరుగుతున్న సమయంలోనే టీ20 టీమ్ ఎంపిక చేయడం విశేషం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టైటిల్‌ను కాపాడుకునే దిశగా టీమ్ ఇండియా తొలి అడుగు వేసింది. డిసెంబర్ 9న కటక్‌లో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును ప్రకటించింది. అందరు స్టార్ ప్లేయర్స్ ను జట్టులోకి ఎంపిక చేసి ఆ మెగా టోర్నీకి ఇప్పటి నుంచే సిద్ధమైంది.
బుధవారం (డిసెంబర్ 3) సాయంత్రం రాయ్‌పూర్‌లో సమావేశమైన సెలెక్టర్లు.. ఊహించినట్లే సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా తిరిగి రావడం జట్టు ఎంపికలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
కటక్, ముల్లన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లు ప్రపంచకప్‌కు ముందు జట్టు కూర్పులను పరీక్షించుకోవడానికి భారత్‌కు చివరి అవకాశంగా మారనున్నాయి.
టీ20 సిరీస్‌కు టీమ్ ఇలా..
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మూడు, నాలుగు స్థానాల్లో ఫ్లెక్సిబుల్ ఆప్షన్లుగా ఉంటారు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రీహాబ్ పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడం అత్యంత కీలకమైన అంశం. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా అతను జట్టులో చేరడంతో, బ్యాటింగ్ లైనప్ బలపడటమే కాకుండా బౌలింగ్‌లోనూ స్థిరత్వం వచ్చింది.
ఈ ఫార్మాట్‌లో సంజు శాంసన్ వికెట్ కీపర్‌గా మొదటి ఎంపికగా కొనసాగుతున్నాడు. అయితే జితేష్ శర్మ ఎంపికతో ఆ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. స్పిన్ హిట్టర్‌గా, అదనపు బౌలింగ్ ఆప్షన్‌గా శివమ్ దూబే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
బౌలింగ్ కూడా బలంగానే..
ఇక బౌలింగ్ విభాగంలో కూడా భారత్ బలంగా కనిపిస్తోంది. పేస్ దళానికి జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా అతనికి సహకరించనున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు పరుగులను కట్టడి చేసే బాధ్యతను పంచుకోనున్నారు.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత టీ20 జట్టు ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్













