Electric cars : పండుగకు ఎలక్ట్రిక్ కారు కొనాలా? ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్ ఇవి..
ఈ పండుగకు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్‌లో ఉన్న ఆప్షన్స్ చూసి ఏది ఎంచుకోవాలే అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్, టాప్-10 ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పుంజుకుంటోంది. ఇంధన ధరల పెరుగుదల, పర్యావరణ స్పృహ పెరగడంతో వినియోగదారులు సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2026 నెలలో భారత ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల (పీవీ) విపణి సంచలన గణాంకాలను నమోదూ చేసింది! క్రితం ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన 17,932 యూనిట్లతో పోలిస్తే, ఈసారి ఏకంగా 95.4 శాతం వృద్ధితో మొత్తం 35,048 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. ఆగస్టు నెలలోని 31,769 యూనిట్లతో పోల్చినా ఇది 10.3 శాతం నెలవారీ ఎదుగుదలను ప్రతిబింబిస్తోంది.

ఈ మొత్తం విక్రయాల్లో టాటా మోటార్స్, మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ కంపెనీలే అగ్రగామిగా నిలిచాయి. ఈ మూడు దిగ్గజ సంస్థలే మార్కెట్‌లో ఏకంగా 27,816 యూనిట్లను విక్రయించి అత్యధిక వాటాను దక్కించుకోవడం విశేషం.
మరి మీరు ఈ పండుగ సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇండియాలో ఉన్న టాప్-10, బెస్ట్ సెల్లింగ్ ఈవీ బ్రాండ్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
తిరుగులేని ఆధిపత్యంలో టాటా మోటార్స్!
ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో 7,369 యూనిట్లను అమ్మగా, ఈ సెప్టెంబర్‌లో ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ విక్రయాలు జరిపి 14,792 కార్లను కస్టమర్లకు అందించింది. దీనితో ఏడాది ప్రాతిపదికన 100.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆగస్టు నాటి 13,825 యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం పెరుగుదల. ప్రస్తుతం భారత ఈవీ విపణిలో టాటా మోటార్స్ ఏకంగా 42.2 శాతం సింహభాగాన్ని కలిగి ఉండి, రెండో స్థానంలో ఉన్న మహీంద్రా కంటే 7,010 యూనిట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. విస్తృతమైన ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడమే టాటా విజయ రహస్యంగా నిలుస్తోంది.
దూసుకుపోతున్న మహీంద్రా.. విన్‌ఫాస్ట్ సంచలనం!
దేశీయ దిగ్గజం మహీంద్రా 7,782 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది సెప్టెంబర్ నాటి 3,973 యూనిట్లతో పోలిస్తే ఇది 95.9 శాతం వృద్ధి. అంతేకాకుండా ఆగస్టు నాటి 6,827 యూనిట్ల కంటే 14 శాతం వృద్ధి నమోదు చేసి, మార్కెట్‌లో 22.2 శాతం వాటాను సొంతం చేసుకుంది. మహీంద్రా సంస్థ సరికొత్త ఐఎన్‌జీఎల్‌ఓ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6 మోడళ్ల ఉమ్మడి విక్రయాలు ఇప్పటికే లక్ష మైలురాయిని దాటడం గమనార్హం.
మూడో స్థానంలో నిలిచిన జేఎస్‌డబ్ల్యూ ఎంజీ 5,242 యూనిట్లను విక్రయించి 9.1 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం వియత్నాంకు చెందిన ఈవీ సంస్థ ‘విన్‌ఫాస్ట్’ నాలుగో స్థానానికి చేరడం. గతేడాది సెప్టెంబర్‌లో దేశీయంగా ప్రయాణం ప్రారంభించి కేవలం 6 కార్లు అమ్మిన విన్‌ఫాస్ట్, ఈ సెప్టెంబర్‌లో ఏకంగా 2,964 కార్లను విక్రయించింది! ఆగస్టు నాటి విక్రయాల కంటే ఇది 32.4 శాతం ఎక్కువ. దీనితో 8.5 శాతం మార్కెట్ వాటాతో కియాను ఐదో స్థానంలోకి నెట్టింది.
దిగువ వర్గంలో తీవ్ర పోటీ..
ఐదో స్థానంలో నిలిచిన కియా మోటార్స్ సెప్టెంబర్‌లో 1,263 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది 598 యూనిట్లతో పోలిస్తే రెట్టింపు కాగా, ఆగస్టు నాటి 851 యూనిట్ల కంటే 48.4 శాతం వృద్ధి. కంపెనీ ప్రస్తుతం 3.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఆరో స్థానంలో నిలిచిన మారుతీ సుజుకీ తన ఈ విటారా మోడల్‌తో 1,104 కార్లను విక్రయించినప్పటికీ, ఆగస్టు నాటి 1,472 యూనిట్లతో పోలిస్తే 25 శాతం క్షీణతను చూసింది.
మిగిలిన స్థానాల్లో బీవైడీ 836 యూనిట్లతో (14.2% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి) ఏడో స్థానంలో, హ్యుందాయ్ 792 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. టయోటా తన అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా మోడల్‌తో 218 యూనిట్లు అమ్మగా (29.8% మంత్ ఆన్ మంత్ వృద్ధి), సిట్రోయెన్ 55 యూనిట్లతో టాప్-10 జాబితాను ముగించింది.
మొత్తంగా పరిశీలిస్తే, టాప్-3 స్థానాల్లో ఉన్న కంపెనీలే మార్కెట్‌లో 79.4 శాతం విక్రయాలను శాసించగా, మొదటి ఐదు బ్రాండ్లు కలిపి 32,043 యూనిట్లతో 91.5 శాతం వాటాను ఆక్రమించాయి.
రాబోయే పండుగల సీజన్‌లో ఈ విక్రయాలు మరింత పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
మరి ఈ బ్రాండ్స్‌లో మీరు దేనిని ఎంచుకుంటున్నారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


