టాటా మోటార్స్‌కి కొత్త పేరు- ఇకపై ‘TATA.CARS’గా! నథింగ్స్ టూ ఫార్ అంటున్న దిగ్గజ కంపెనీ
Tata cars : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల విభాగానికి సరికొత్త బ్రాండ్ గుర్తింపును ప్రకటించింది. ఇకపై టాటా ప్యాసింజర్ కార్లన్నీ 'TATA.CARS' పేరుతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. వివరాల్లోకి వెళితే..
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తమ ప్రయాణికుల వాహన (ప్యాసింజర్ వెహికల్స్) వ్యాపార శైలిలో కీలక మార్పులు చేపట్టింది. కస్టమర్లతో నేరుగా జరిపే ప్రచారాలు, కమ్యూనికేషన్ కోసం 'TATA.CARS' పేరును కొత్త బ్రాండ్ నేమ్‌గా ఉపయోగిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు 'నథింగ్స్ టూ ఫార్' అనే సరికొత్త ట్యాగ్‌లైన్‌ను కూడా తీసుకొచ్చింది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో టాటా బ్రాండ్ కార్లకు, శ్రేష్ఠమైన భద్రతా ప్రమాణాల వల్ల విపరీతమైన ఆదరణ ఉందనే విషయం తెలిసిందే. నెక్సాన్, పంచ్, హారియర్ వంటి మోడళ్లు ఇక్కడి రోడ్లపై అత్యధికంగా అమ్ముడవుతున్న వేళ, కంపెనీ తన బ్రాండ్ రూపరేఖలను మార్చడం ఆటోమొబైల్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకే చోటుకు అన్ని రకాల వాహనాలు
కస్టమర్లు సాధారణంగా షోరూమ్‌లకు వచ్చినప్పుడు లేదా బయట మాట్లాడుకునేటప్పుడు "టాటా కార్స్" అని సంబోధిస్తుంటారు. వినియోగదారుల అలవాటును దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మార్పు చేసింది. ఇకపై టాటాకు చెందిన హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ కార్లన్నింటినీ ఒకే బ్రాండ్ పరిధిలోకి తీసుకెళ్తున్నారు.
అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లు, ప్రకటనల్లో ఈ కొత్త పేరునే వాడతారు. ప్రయాణికుల లక్ష్యాలను నెరవేర్చడంలో, సుదూర ప్రాంతాలకు సురక్షితంగా చేర్చడంలో తోడ్పడటమే 'నథింగ్స్ టూ ఫార్' వెనుక ఉన్న అసలు ఉద్దేశమని కంపెనీ వెల్లడించింది. సురక్షితమైన కార్ల తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి స్వదేశీ సాంకేతికతను అందించడం ఈ నినాదంలో భాగమేనని స్పష్టం చేసింది.
కొత్త డిజైన్, ఆకట్టుకునే రంగు..
బ్రాండ్ రీబ్రాండింగ్‌లో భాగంగా ప్రత్యేక డిజైన్ శైలిని రూపొందించారు. దీనికి 'పారలల్ పాత్‌వేస్' అని పేరు పెట్టారు. టాటా సింబల్‌లోని 'T' ఆకారం, రోడ్లపై ఉండే గీతల ఆధారంగా ఈ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇవి భవిష్యత్తు వైపు సాగే ప్రయాణాలకు సంకేతంగా నిలుస్తాయి.
దీంతో పాటు ‘అంబిషన్ బ్లూ’ అనే ప్రత్యేక నీలి రంగును, 'పారలల్ డిస్‌ప్లే' అనే కొత్త ఫాంట్‌ను, బ్రాండ్ కోసం ప్రత్యేక ఆడియో సౌండ్‌ను పరిచయం చేశారు.
లోగో, మోడళ్ల పేర్లలో ఎలాంటి మార్పు లేదు
ఈ మార్పు కేవలం మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వరకు మాత్రమే పరిమితం కానుంది. కంపెనీ చట్టబద్ధమైన పేరు 'టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్' అనే ఉంటుంది. ఇన్వెస్టర్లు, నిబంధనలకు సంబంధించిన కమ్యూనికేషన్‌లో పాత పేరే కొనసాగుతుంది.
అదే సమయంలో వాహనాలపై ఉండే ప్రముఖ టాటా లోగో మారదు. మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న నెక్సాన్, పంచ్, కర్వ్, హారియర్, సఫారీ మోడళ్ల పేర్లను మార్చడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న టాటా మోటార్స్, పెట్రోల్, డీజిల్, ఈవీ మోడళ్లను మరింత విస్తరించేందుకు ఈ బ్రాండింగ్ దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


