...
...
Next Story

ఎగ్జిమ్ బ్యాంకులో 120 కొలువులు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు

భారత ఎగ్జిమ్ బ్యాంక్ 120 మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీలు, రాత పరీక్ష విధానం, ఫీజు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Nov 16, 2026, 16:23:58 IST
Advertisement

బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం. దేశ విదేశీ వాణిజ్యానికి ఆర్థిక తోడ్పాటు అందించే ప్రభుత్వ రంగ సంస్థ 'ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్' (ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నియామక ప్రకటన విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న 120 మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

HT Images
HT Images

ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు 2026 నవంబర్ 27న ప్రారంభమై, డిసెంబర్ 11తో ముగుస్తాయి.

ఖాళీల వివరాలు.. అర్హత నిబంధనలు ఇవే

ఈ నియామక డ్రైవ్ ద్వారా ఎగ్జిమ్ బ్యాంక్ మొత్తం 120 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగంలో 90 ఖాళీలు, మేనేజర్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోని సమగ్ర నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.

2027 మే నెల నాటికి తమ చివరి అర్హత పరీక్షలకు హాజరైన వారు లేదా హాజరుకానున్న విద్యార్థులు కూడా రాత పరీక్ష రాసేందుకు అర్హులేనని బ్యాంకు స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులు నిర్ణీత విద్యార్హతను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపే ధ్రువపత్రాలను బ్యాంకు నిర్దేశించిన చేరిక తేదీ నాటికి సమర్పించాలి. ఈ చేరిక గడువు 2027 జూన్ 30 దాటకూడదని నిబంధన విధించింది.

ఎంపిక విధానం.. రాత పరీక్ష ఎలా ఉంటుందంటే?

అభ్యర్థుల ఎంపికలో భాగంగా ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో పార్ట్-1, పార్ట్-2 అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-1లో 40 మార్కులకు తప్పనిసరి ప్రశ్న ఉంటుంది. పార్ట్-2లో అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా 60 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు.

జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీల కింద రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతో పాటు మహిళలకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. వీరు కేవలం రూ. 100 ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఒకసారి చెల్లించిన ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెనక్కి ఇవ్వరు.

అభ్యర్థులు తమ ఫీజును రూపే, వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో డెబిట్ కార్డులతో పాటు క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు లేదా మొబైల్ వాలెట్ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. నియామక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎగ్జిమ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

నోటిఫికేషన్ పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks