...
...
Next Story

India Skills Report 2026 : మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న 8 స్కిల్స్- ఇవి నేర్చుకుంటే జాబ్ పక్కా!

భారతదేశంలో యువత ఉద్యోగార్హత 56.35 శాతానికి పెరిగినట్లు 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026' స్పష్టం చేసింది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో అవకాశాలు అపరిమితంగా ఉన్నాయని, 8 ప్రధాన స్కిల్స్ ఉన్న వారికి కంపెనీలు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

Published on: Oct 27, 2026, 07:30:49 IST
Advertisement

నేటి వేగవంతమైన డిజిటల్ యుగంలో ఉద్యోగ అవకాశాలు సాధించాలంటే కేవలం సాంప్రదాయ డిగ్రీలు మాత్రమే సరిపోవు! మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను పెంపొందించుకున్న వారిని మాత్రమే ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ యువత నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026’ ద్వారా పలు కీలక విషయాలు వెలువడ్డాయి.

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 అప్డేట్స్..
ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 అప్డేట్స్..

తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ స్థితిని అధిగమించి, ఉద్యోగాలు సాధించగల అర్హత ఉన్న యువత శాతం గణనీయంగా పెరిగింది. 2025లో 54.81 శాతంగా ఉన్న ఉద్యోగార్హత, 2026 నాటికి 56.35 శాతానికి పెరగడం ఎంతో ఆశాజనకమైన పరిణామం. ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా వెలుగొందుతున్న హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాల్లో గిగ్ వర్క్, ఫ్రీలాన్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

ఏఐ విప్లవం: 2027 నాటికి 12.5 లక్షల మంది ఏఐ నిపుణులు!

ప్రస్తుతం ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో వస్తున్న మార్పులు ఉద్యోగాల స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ విభాగాల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్‌కు తగినంత సప్లై లేకపోవడంతో కంపెనీలు ఈ రంగాలు తెలిసిన వారికి భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.

ఏఐ విభాగంలో ఏటా రెండంకెల స్థాయిలో కొత్త ఉద్యోగాలు నమోదు అవుతున్నాయి. 2027 నాటికి భారతదేశంలో 12.5 లక్షల మంది ఏఐ నిపుణుల అవసరం ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. దీనికోసం డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు డిజిటల్ లిటరసీతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అత్యంత ఆవశ్యకమని పేర్కొంది.

మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న 8 ప్రధాన స్కిల్స్..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AI & ML): ఎన్‌ఎల్‌పీ, ఎంఎల్‌ఆప్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్.

సైబర్ సెక్యూరిటీ : ఐఓటీ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్ సెక్యూరిటీ, డేటా కాంప్లైయన్స్.

క్లౌడ్ కంప్యూటింగ్ : మల్టీ-క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ : పైథాన్, రియాక్ట్ (React.js), ఫుల్-స్టాక్ డెవలప్‌మెంట్, మొబైల్ యాప్స్.

డేటా అనలిటిక్స్ : పవర్ బీఐ, ట్యాబ్లో , ఎస్‌క్యూఎల్.

ఫిన్‌టెక్ అండ్ బ్లాక్‌చైన్ : డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్.

సస్టైనబిలిటీ అండ్ ఈఎస్‌జీ : పునరుత్పాదక ఇంధనం, వాతావరణ ముప్పు నిర్వహణ, గ్రీన్ బిల్డింగ్.

హెల్త్‌కేర్ ఐటీ : టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్‌లు, డయాగ్నోస్టిక్ ఏఐ టూల్స్.

నియామకాల ప్రాసెస్‌ను మారుస్తున్న ఏఐ!

గతంలో లాగా కేవలం రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు మాత్రమే కాకుండా, అభ్యర్థుల ఎంపికలో కంపెనీలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. 70 శాతం ఐటీ కంపెనీలు, 50 శాతం బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థలు తమ నియామక ప్రక్రియలో ఇప్పటికే ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నాయి.

అభ్యర్థి రెజ్యూమ్‌ను వడపోత పోయడం నుంచి, వారి ప్రాక్టికల్ స్కిల్స్‌ను అంచనా వేయడం వరకు ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు తమ సాంప్రదాయ విద్యతో పాటు ఇంటర్న్‌షిప్‌లు, కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకుంటూ తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks