యూకేలో మరో జాత్యహంకార అత్యాచారం! 20ఏళ్ల భారత సంతతి యువతిపై..
ఇంగ్లాండ్‌లోని వాల్సాల్‌లో 20 ఏళ్ల భారతీయ సంతతి యువతిపై అత్యాచారం, జాత్యహంకార దాడి జరిగింది. నిందితుడుని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా యూకేలో భారత సంతతి మహిళలపై జాత్యంహకార దాడి జరగడం ఇది రెండు నెలల్లో రెండోసారి!
బ్రిటిష్ సిక్కు యువతిపై అత్యాచారం జరిగిన నెల రోజుల తర్వాత, ఉత్తర ఇంగ్లాండ్‌లో మరో ‘జాత్యహంకార ప్రేరేపిత దాడి’ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి 20ఏళ్ల భారత సంతతి యువతి లక్ష్యంగా అత్యాచారం జరిగింది.

వాల్సాల్‌లో 20 ఏళ్ల యువతిపై "జాత్యహంకార ప్రేరేపిత అత్యాచారం" చేసినట్లుగా అనుమానిస్తున్న ఒక శ్వేతజాతీయుడిని గుర్తించడానికి వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు అత్యవసరంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగింది?
స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం వాల్సాల్‌లోని పార్క్ హాల్ ప్రాంతంలోని వీధిలో బాధపడుతున్న ఒక మహిళ క్షేమంపై ఆందోళన వ్యక్తం కావడంతో తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ నేరాన్ని “జాత్యహంకార దాడి”గా గుర్తించిన వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు ప్రజల నుంచి సమాచారం కోరుతూ అతడి సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు.
దాడి చేసిన వ్యక్తి శ్వేతజాతీయుడని, 30 ఏళ్ల వయసులోపు ఉంటాడని, అతడికి పొట్టి జుట్టు ఉందని, ఘటన సమయంలో ముదురు రంగు దుస్తులు ధరించి ఉన్నాడని పోలీసులు వివరించారు.
దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డిటెక్టివ్ సూపరింటెండెంట్ రోనన్ టైరర్ మాట్లాడుతూ.. "ఇది ఒక యువతిపై జరిగిన భయంకరమైన దాడి. బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేయడానికి మేము చేయగలిగిన ప్రతి పని చేస్తున్నాము," అని చెప్పారు.
"సాక్ష్యాలను సేకరించడానికి, నిందితుడి వివరాలను తెలుసుకోవడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయి. తద్వారా అతడిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటాము. ప్రస్తుతం మేము అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని చూసి ఉంటే, మాకు తెలియజేయడం చాలా ముఖ్యం," అని ఆయన అన్నారు.
సమీప ప్రాంతాలలో డాష్‌క్యామ్‌లు, సీసీటీవీ కెమెరాలు ఉన్న పౌరులు తమ ఫుటేజీలను తనిఖీ చేసి, సమాచారాన్ని పంచుకోవాలని డీఎస్ టైరర్ విజ్ఞప్తి చేశారు.
"మీరు ఆ ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తూ ఉండవచ్చు, మీ డాష్‌క్యామ్‌లో ఫుటేజ్ ఉండవచ్చు. లేదా మేము ఇంకా సేకరించని సీసీటీవీ ఫుటేజ్ మీ వద్ద ఉండవచ్చు. మీరు అందించే సమాచారం మా దర్యాప్తుకు కీలక మలుపు కావచ్చు," అని ఆయన జోడించారు.
బాధితురాలు పంజాబీ యువతే కావచ్చన్న స్థానిక సంస్థ
బాధితురాలి గుర్తింపును రక్షించడానికి వివరాలు విడుదల చేయనప్పటికీ, స్థానిక కమ్యూనిటీ గ్రూపులు బాధితురాలు పంజాబీ యువతి అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సిక్కు ఫెడరేషన్ యూకే స్థానిక వర్గాలను ఉటంకిస్తూ.. "వాల్సాల్‌లో జాత్యహంకార ప్రేరేపిత అత్యాచారానికి గురైన యువతి పంజాబీ మహిళ" అని తెలిపింది.
"దాడి చేసిన వ్యక్తి ఆమె నివసిస్తున్న ఇంటి తలుపును పగులగొట్టినట్లు తెలుస్తోంది.. వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు గత రెండు నెలల్లో 20 ఏళ్లలోపు యువతులపై రెండు జాత్యహంకార అత్యాచారాలను గుర్తించారు. ఈ నేరాలకు పాల్పడిన వారిని అత్యవసరంగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది," అని ఆ సంస్థ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ దాడి గత సెప్టెంబర్ ఘటనను గుర్తుకు తెస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఈ అత్యాచారాన్ని మరే ఇతర నేరాలతో ముడిపెట్టడం లేదని డీఎస్ టైరర్ తెలిపారు.
"ఈసారి వాల్సాల్‌లో మరో జాత్యహంకార ప్రేరేపిత అత్యాచారం గురించి వినడం చాలా ఆశ్చర్యకరం, బాధాకరం. వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు పార్క్ హాల్ ప్రాంతంలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం, దాడి జరిగినట్లు నివేదించారు. దీనిని జాత్యహంకార దాడిగా అభివర్ణించారు," అని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ లేబర్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ అన్నారు.
"మా ప్రాంతంలో మహిళలపై పదేపదే జరుగుతున్న హింస, దానికి విద్వేషం, జాత్యహంకార ఉద్దేశాలు తోడవడం చాలా కలవరపెడుతోంది," అని ఆమె ఇంకా జోడించారు.
యూకేలోని ఓల్డ్‌బరీలో సిక్కు యువతిపై అత్యాచారం..
సెప్టెంబరులో, వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసుల అధికార పరిధిలోనే ఉన్న ఓల్డ్‌బరీలో ఒక సిక్కు యువతిపై అత్యాచారం జరిగింది.
ఈ ఘటన సెప్టెంబర్ 9న ఉదయం 8:30 గంటలకు బర్మింగ్‌హామ్‌కు సమీపంలోని ఓల్డ్‌బరీలోని టేమ్ రోడ్ చుట్టూ జరిగింది.
పోలీసులు ఈ నేరాన్ని “జాత్యహంకార ప్రేరేపిత దాడి”గా దర్యాప్తు చేశారు. అత్యాచారంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల వ్యక్తి వివరాలను పోలీసులు విడుదల చేశారు. పగటిపూట మహిళపై దాడి చేసి, హింసించినట్లు భావిస్తున్న ఇద్దరు శ్వేతజాతీయుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు మొదట్లో ప్రకటించారు.
ఓల్డ్‌బరీ కేసులో పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. కానీ తరువాత జాత్యహంకార అత్యాచార దర్యాప్తులో భాగంగా వారిని బెయిల్‌పై విడుదల చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


