Indian Railways : భారతీయ రైల్వే నుంచి బిగ్ అప్డేట్- ఇక టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్!
రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్‌కు (పీఆర్‌ఎస్) మారుతోంది. ఈ ఆధునిక సాంకేతికతతో తత్కాల్ బుకింగ్ రద్దీ సమస్యలు పూర్తిగా తొలగిపోనున్నాయి.
ప్రయాణ రంగంలో ఒక కీలక అధ్యాయానికి తెరలేపింది భారతీయ రైల్వే! టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి రైల్వే శాఖ సరికొత్త ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్‌కు (పీఆర్‌ఎస్) మారుతోంది. 2010 నుంచి అమల్లో ఉన్న పాత టెక్నాలజీ స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త వ్యవస్థను దశలవారీగా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా తత్కాల్ సమయంలో సర్వర్ డౌన్ అవ్వడం, బుకింగ్ స్లో అవ్వడం వంటి సమస్యలకు ఈ కొత్త సిస్టమ్ చక్కటి పరిష్కారం చూపనుంది.

"కొత్త యూజర్ ఫ్రెండ్లీ లుక్ అండ్ ఫీల్‌కు సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాము. పాత పీఆర్‌ఎస్ నుంచి కొత్తదానికి మళ్లే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నాము." అని రైల్వే బోర్డు పబ్లిక్ రిలేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ధర్మేంద్ర తివారీ తెలిపారు.
తాజాగా ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ బీటా వెబ్‌సైట్ కూడా ఈ మార్పులో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.
పీఆర్‌ఎస్ అంటే ఏంటి?
భారతదేశంలో ఏ రిజర్వ్‌డ్ రైలు టికెట్ వెనకయినా పీఆర్‌ఎస్ సిస్టమ్ పనిచేస్తుంది. సీట్ల కేటాయింపు, వెయిటింగ్‌లిస్ట్, ఆర్‌ఏసీ, రిజర్వేషన్ చార్ట్‌లు, ప్రయాణికుల విచారణలతో పాటు టికెట్ల బుకింగ్, మార్పులు, రద్దు చేయడం వంటి అన్ని అంశాలను ఇదే పర్యవేక్షిస్తుంది. దీనిని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (క్రిస్) రూపొందించి నిర్వహిస్తోంది.
1986లో ప్రారంభమైన పీఆర్‌ఎస్ సిస్టమ్.. మాన్యువల్ రిజర్వేషన్ రిజిస్టర్లు, కౌంటర్ బుకింగ్ విధానాన్ని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చింది. 1990ల నాటికి ఇది దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు విస్తరించింది. ఇక 2002లో ఇంటర్నెట్ ఆధారిత బుకింగ్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు కౌంటర్ల వరకు వెళ్లకుండానే టికెట్లు పొందే అవకాశం లభించింది. 2014లో నెక్ట్స్ జనరేషన్ ఈ-టికెటింగ్ సిస్టమ్ ఆన్‌లైన్ సామర్థ్యాన్ని మరింత పెంచింది. తాజాగా 2025లో రైల్‌వన్ యాప్‌ను తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు నెక్ట్స్ జెన్ పీఆర్‌ఎస్‌ను అందుబాటులోకి తెస్తోంది. 2026 ఆగస్టు నుంచి ఈ మార్పు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
ఇప్పుడే ఎందుకు మార్చాల్సి వచ్చింది?
ప్రస్తుతం ఉన్న పీఆర్‌ఎస్ సిస్టమ్ నిమిషానికి సుమారు 32,000 టికెట్లను మాత్రమే బుక్ చేయగలదు. అయితే తత్కాల్ సమయంలో ఒక్కసారిగా రద్దీ పెరిగినప్పుడు ఈ సామర్థ్యం సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్లౌడ్ ఆధారిత కొత్త పీఆర్‌ఎస్‌ను రూపొందించారు.
దీని ద్వారా నిమిషానికి 1.5 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే విచారణల సామర్థ్యాన్ని 4 లక్షల నుంచి ఏకంగా 40 లక్షలకు పెంచారు! బహుళ భాషా సౌలభ్యం, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ఇది మరింత నమ్మకమైన సేవలను అందిస్తుంది.
మార్పుల్లో భాగంగా ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. అవి..
- ముందస్తు రిజర్వేషన్ కాలాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించారు.
- మరింత పారదర్శకత కోసం 2025 జులైలో ఆధార్-ధృవీకరించిన తత్కాల్ బుకింగ్‌ను ప్రవేశపెట్టారు.
- బాట్లు, అనధికార ఏజెంట్లను అరికట్టడానికి ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని జతచేశారు.
- ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ కొత్త బీటా వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
భారీ స్థాయి కార్యకలాపాలు..
2025 జూన్ నుంచి 2026 జూన్ మధ్య కాలంలో ప్రయాణికులు పీఆర్‌ఎస్ ద్వారా ఏకంగా 65.08 కోట్ల రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇందులో 89 శాతం అనగా 57.90 కోట్ల టికెట్లు ఆన్‌లైన్ ద్వారానే బుక్ కావడం విశేషం. రోజువారీగా దాదాపు 20.5 లక్షల మంది ప్రయాణికులు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇందులో 73 శాతం లావాదేవీలు క్యాష్‌లెస్ పద్ధతిలోనే జరుగుతున్నాయి.
ఒకేసారి కాకుండా.. రైళ్ల వారీగా ఈ కొత్త సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. రాబోయే నెలల్లో ఐఆర్‌సీటీసీలో సరికొత్త అనుభూతిని పొందవచ్చని, రద్దీ సమయంలోనూ బుకింగ్ వేగం గణనీయంగా పెరుగుతుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


