షేర్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి.. కారణాలివే

భారత స్టాక్ మార్కెట్లో తీవ్ర కలకలం రేగింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల దెబ్బకు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా కుప్పకూలాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.

Updated on: Oct 8, 2026, 15:23:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో కుప్పకూలాయి. మధ్యాహ్నం 3.15 గంటల సమయానికి బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 1.71 శాతం పతనమవ్వగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1177 పాయింట్లు నష్టపోయి 71,461 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఆకస్మిక పతనంతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఏకంగా రూ.10 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

షేర్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి.. కారణాలివే
షేర్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి.. కారణాలివే

మార్కెట్లను ముంచెత్తిన కారణాలు

భారత మార్కెట్ల పతనానికి భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకున్న కఠిన నిర్ణయమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బుధవారం ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి.

"ఇటీవలి రెపో రేటు పెంపు వల్ల ద్రవ్య లభ్యత, అప్పుల వ్యయంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నారు. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. త్రైమాసిక ఫలితాలు, చమురు ధరలు, ఆర్బీఐ నిర్ణయాలపై మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది" అని విభవంగల్ అనుకూలకార ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య వివరించారు.

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు కూడా మార్కెట్‌ను కిందకు లాగాయని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ భయాలు, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, రూపాయి బలహీనపడటం ఇన్వెస్టర్లను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తున్నాయని తెలిపారు.

సెగ రేపుతున్న బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్

అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 5.3 శాతం మార్కు వద్ద కొనసాగుతుండటంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌ఐఐ) అది ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గంగా మారింది. దీంతో వారు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి వరుసగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.

మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్‌కు 103 డాలర్లకు చేరువై రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. నవంబర్ మిడ్‌టెర్మ్ ఎన్నికలకు ముందే ఇరాన్‌పై కొత్త దాడులు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం పెంటగాన్‌ను ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలే క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

నష్టపోయిన, లాభపడిన షేర్లు

గురువారం నాటి ట్రేడింగ్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎస్‌బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. అదానీ గ్రీన్ 7.52 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.57 శాతం, పేటీఎం 5.25 శాతం నష్టపోయాయి.

అయితే మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా టైటన్, నెస్లే ఇండియా, ట్రెంట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ రెండో త్రైమాసిక (Q2FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటంతో ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More