గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్తే జైలుకు పంపారు.. 60 ఏళ్ల భారతీయ మహిళ అరెస్ట్
అమెరికాలో మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న 60 ఏళ్ల భారతీయ మహిళ బబ్లీ కౌర్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అనూహ్యంగా అదుపులోకి తీసుకున్నారు. గ్రీన్ కార్డ్ ప్రక్రియ కోసం వెళ్లిన ఆమెను ఐస్ (ICE) ఏజెంట్లు బంధించి డిటెన్షన్ సెంటర్‌కు తరలించడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల్లో ఆందోళన నెలకొంది. మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాలో నివసిస్తూ, స్థానిక సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న 60 ఏళ్ల బబ్లీ కౌర్ (Babblejit ‘Bubbly’ Kaur) ఉదంతం ఇప్పుడు అగ్రరాజ్యంలో కలకలం రేపుతోంది.

ఏం జరిగింది?
డిసెంబర్ 1వ తేదీన బబ్లీ కౌర్ తన గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు ఇచ్చేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కార్యాలయానికి వెళ్లారు. సాధారణంగా జరిగే ప్రక్రియే కదా అని వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆమె కుమార్తె జ్యోతి కౌర్ కథనం ప్రకారం.. "అమ్మ ఫ్రంట్ డెస్క్ వద్ద ఉండగా, కొందరు ఫెడరల్ ఏజెంట్లు లోపలికి వచ్చి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లారు. కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు" అని వివరించారు.
30 ఏళ్ల నివాసం.. నేరచరిత్ర లేదు
బబ్లీ కౌర్ 1994 నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఆమెపై ఎలాంటి నేరచరిత్ర లేదు. ఆమె కుమార్తె, అల్లుడు అమెరికా పౌరులు (US Citizens). వారి స్పాన్సర్‌షిప్‌తో ఇప్పటికే ఆమె గ్రీన్ కార్డ్ పిటిషన్ కూడా ఆమోదం పొందింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకుంటున్న తరుణంలో ఈ అరెస్ట్ జరగడం ఆమె కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అరెస్టయిన తర్వాత చాలా గంటల వరకు ఆమె ఎక్కడ ఉందో కూడా కుటుంబ సభ్యులకు తెలియలేదు. చివరకు విక్టర్ విల్ సమీపంలోని 'అడెలాంటో ఐస్ ప్రాసెసింగ్ సెంటర్' (ఒకప్పుడు ఇదొక ఫెడరల్ జైలు)లో ఆమెను ఉంచినట్లు ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా తెలుసుకున్నారు.
నరకం లాంటి డిటెన్షన్ సెంటర్
ప్రస్తుతం ఆ అరవై ఏళ్ల వృద్ధురాలు డజన్ల కొద్దీ ఇతర ఖైదీలతో కలిసి ఒకే పెద్ద గదిలో గడుపుతున్నారు. "అక్కడ రాత్రంతా లైట్లు ఆపరు. విపరీతమైన శబ్దాల వల్ల అమ్మ నిద్రపోలేకపోతోంది. ఆమెను అలా చూడటం నరకంగా ఉంది. అది మనుషులు ఉండే చోటు కాదు" అంటూ కుమార్తె జ్యోతి కౌర్ కన్నీటి పర్యంతమయ్యారు.
బబ్లీ కౌర్ దంపతులు గత రెండు దశాబ్దాలుగా లాంగ్ బీచ్‌లో 'నటరాజ్ క్యూసిన్' అనే రెస్టారెంట్‌ను నడుపుతూ స్థానికులకు ఎంతో సుపరిచితులయ్యారు. బబ్లీ ఒక ఫార్మసీలో 25 ఏళ్ల పాటు పనిచేశారు కూడా. అలాంటి వ్యక్తిని అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవడంపై రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు.
బరిలోకి దిగిన కాంగ్రెస్ ప్రతినిధి
డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. బబ్లీ కౌర్ అరెస్ట్‌ను "అత్యంత భయంకరమైనది"గా అభివర్ణించిన ఆయన, ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తరపు లాయర్లు ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆమె న్యాయ పోరాటం కోసం స్థానికులు 'GoFundMe' ద్వారా ఇప్పటికే 26,000 డాలర్లకు పైగా నిధులు సేకరించారు.
అయితే, ఈ అరెస్ట్‌పై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం అవుతున్న తరుణంలో, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉన్న వారిని కూడా ఇలా అరెస్ట్ చేయడం భారతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


